కేవలం లాంఛనంగా, చెప్పాలంటే మొక్కుబడిగా దేశంలో సాగుతున్న ఎన్నికల క్రతువు రూపు రేఖా విలాసాలను మార్చి వాటికొక అర్థం, పరమార్థం ఉండేలా తీర్చిదిద్దిన టీఎన్ శేషన్ ఆదివారం కన్నుమూశారు. శేషన్ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ కాదు. ఆయనకు ముందు తొమ్మిది మంది పనిచేశారు. అయితే 1990లో ఆయన ఎన్నికల సంఘం చీఫ్‌గా పదవీబాధ్యతలు చేపట్టిననాటికి దానికి గుర్తింపు, గౌరవం అనేవి పెద్దగా లేవు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఆ తర్వాత జరిగేవాటన్నిటికీ మౌన ప్రేక్షక పాత్ర వహించడం ఎన్నికల సంఘానికి రివాజుగా మారిన తరుణంలో ఆయనొచ్చి ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. సమర్థవంతంగా వ్యవహరించగలిగే చేవ ఉంటే...ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడని సంసిద్ధత ఉంటే కొమ్ములు తిరిగిన నాయకగణం దారికి రావడం ఖాయమని శేషన్ ఆచరణాత్మకంగా నిరూపించారు.
శేషన్‌కు ముందు ఎన్నికల సంఘం అసలు పనిచేయలేదని చెప్పలేం. అప్పుడు కూడా అన్ని పార్టీల నేతలూ ప్రత్యర్థులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసేవారు. ఆ సంఘం కూడా అవసరాన్నిబట్టి కేంద్ర ప్రభుత్వానికో, రాష్ట్ర ప్రభుత్వానికో ఉత్తరాలు రాసేది. కాకపోతే ఆ ఉత్తరాలకు జవాబులు ఆశించేది కాదు. చర్యలు తీసుకుంటారని ఎదురుచూసేది కాదు. ఫిర్యాదులు రావడం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం మాత్రమే తన బాధ్యతగా భావించేది. మీడియా సైతం ఏ నియోజకవర్గంలో ఏం జరిగిందో...పోలింగ్ కేంద్రాల్లో అసాంఘిక శక్తులు ఎలా స్వైరవిహారం చేశాయో...ఎక్కడెక్కడ దళితులు, ఇతర అణగారిన వర్గాలకు చెందినవారూ ఓటేయకుండా పెత్తందార్లు నిలువరించారో వెల్లడించేది. కత్తులతో, బాంబులతో పరస్పరం చంపుకుంటున్న ముఠాలను చూసి ఓటేయడానికి వచ్చినవారు సైతం ‘బతుకుజీవుడా’ అంటూ పారిపోయేవారు. ఇవన్నీ ఎన్నికల సంఘానికి పెద్దగా పట్టేవి కాదు. శేషన్‌కు ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న తెలుగు వ్యక్తి ఆర్‌వీఎస్ పేరిశాస్త్రి మాత్రం 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల విషయంలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీతో విభేదించి ఆయన ఆగ్రహానికి గురయ్యారు. జైల్‌సింగ్ రెండోసారి రాష్ట్రపతి పదవికి పోటీ చేకుండా నిరోధించడం కోసం నామినేషన్ల ప్రక్రియను మార్చాలని రాజీవ్ ప్రభుత్వం కోరుకోగా పేరిశాస్త్రి అందుకు అంగీకరించలేదు. దాంతో అప్పటివరకూ ఏకవ్యక్తి నిర్వహణలో ఉన్న ఎన్నికల సంఘంలోకి మరో ఇద్దరిని నియమించేవిధంగా మార్చారు. కానీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ ఓటమిపాలై, వీపీ సింగ్ అధికారంలోకి రావడంతో ఈ మార్పు ముగిసిపోయింది. అనంతరకాలంలో శేషన్ వ్యవహారశైలి నచ్చక పీవీ నరసింహారావు దాన్ని మళ్లీ బహుళ సభ్య కమిషన్‌గా మార్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, మరో ఇద్దరు కమిషనర్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా, అధికారాలు కూడా లభించాయి.
శేషన్ వ్యవహారశైలి ఎలా ఉండేదో చెప్పడానికి ఆరోజుల్లో ఆయన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పెట్టుకున్న తగాదాను ప్రస్తావించాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)ని నియమించాలంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ‘మీ దగ్గరున్న ఫలానా ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించదల్చుకున్నాం. ఆయన్ను రిలీవ్ చేయండ’ని ఎన్నికల సంఘం అర్థించేది. ‘మీరు కోరుకున్న అధికారిని ఇవ్వలేమ’ని ప్రభుత్వం చెబితే, అది మరొకరి పేరు సూచించేది. శేషన్ వచ్చాక పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఇలాంటి వినతే వెళ్లింది. ఆయన సూచించిన అధికారిని ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన శేషన్ ఆ రాష్ట్రంతో ఉత్తరప్రత్యుత్తరాలు నిలిపేశారు. ఎన్నికల సంఘం జారీచేసే ఆదేశాలన్నీ పశ్చిమ బెంగాల్ మినహా ఇతర రాష్ట్రాలకు వెళ్లేవి. తన వినతిని అంగీకరించని పక్షంలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు నిలిపివేస్తానని కూడా ఒక దశలో శేషన్ హెచ్చరించారు. చివరకు న్యాయస్థానం జోక్యం తో అంతా సద్దుమణిగింది. ఎన్నికల సంఘం అడిగిన అధికారిని కేటాయించాల్సిందేనని ప్రభుత్వాన్ని... ఆ రాష్ట్రంతో కూడా ఉత్తరప్రత్యుత్తరాలు జరపాల్సిందేనని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది.
మొండిగా, ముక్కుసూటిగా, నిర్దాక్షిణ్యంగా, నిక్కచ్చిగా ఉండేవారిని శేషన్‌తో పోల్చేవారు. వోటర్లకు గుర్తింపు కార్డులు జారీచేయాలని 1994 చివరిలో శేషన్ నిర్ణయించినప్పుడు పార్టీలన్నీ అది వృధా ఖర్చని కొట్టిపారేశాయి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. అప్పుడు శేషన్ ‘కార్డుల్లేకపోతే...ఎన్నికలుండవ్’ అని హెచ్చరించారు. ఆ తర్వాత అన్నంత పనీ చేశారు. వోటర్ గుర్తింపు కార్డులు లేనందువల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం తప్పనిసరైంది. ఆ తర్వాత సైతం శేషన్ పట్టువీడక పోవడంతో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ అమలైంది. ఎన్నికల వ్యయంపై జమాఖర్చులు సమర్పించాలని అభ్యర్థుల్ని ఆదేశించి, దాన్ని అందరిచేతా పాటింపజేయడంలో శేషన్ విజయం సాధించారు. జమాఖర్చులు చెప్పని 1,500మంది అభ్యర్థుల్ని, తప్పుడు లెక్కలిచ్చిన మరో 14,000మందిని అనర్హుల్ని చేశారు. 1992లో బిహార్, పంజాబ్ ఎన్నికలను రద్దు చేసినందుకు నాయకులంతా ఏకమై ఆయన్ను అభిశంసించాలని చూస్తే శేషన్ చెక్కు చెదరలేదు. ఎన్నికల్లో హింసను గణనీయంగా తగ్గించడంలో ఆయన పాత్ర గణనీయమైనది. శేషన్‌తో కొత్త చట్టం రాలేదు. ఉన్న చట్టం దుమ్ముదులిపి, అందులోని అధికారా లను ఆయన సంపూర్ణంగా వినియోగించుకున్నారు. దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచా రు. అనంతరకాలంలో ఆ పదవి చేపట్టినవారిని ఒకరకంగా ఆయన ఇరకాటంలో పడేశారు. అంద రినీ ఆయనతో పోల్చి చూసి, వారి వారి సామర్థ్యాన్ని లెక్కగట్టే ‘ప్రమాణం’ ఒకటి తెలియకుండానే ఏర్పడిపోయింది. నిరంకుశుడిగా, దురహంకారిగా ముద్రపడినా తాను ఎన్నుకున్న దారిలో నిబ్బరంగా ముందుకు నడిచి, ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేసిన శేషన్ చిరస్మరణీయుడు.
Comments
Please login to add a commentAdd a comment