నెహ్రూకు నచ్చింది మోదీ చేతికొచ్చింది! | Sakshi Guest Column On Nehru PM Narendra Modi Joe Biden | Sakshi
Sakshi News home page

నెహ్రూకు నచ్చింది మోదీ చేతికొచ్చింది!

Published Mon, Jul 3 2023 3:36 AM | Last Updated on Mon, Jul 3 2023 3:36 AM

Sakshi Guest Column On Nehru PM Narendra Modi Joe Biden

బైడెన్‌తో మోదీ, నెహ్రూ

అమెరికా పర్యటనలో మన ప్రధానమంత్రికి బైడెన్‌ దంపతులు ఇచ్చిన కానుకలలో ‘కలెక్టెడ్‌ పొయెమ్స్‌ ఆఫ్‌ రాబర్ట్‌ ఫ్రాస్ట్‌’ తొలి ముద్రణ ప్రతి ఉంది. ఫ్రాస్ట్‌ బహుశా నెహ్రూకు నచ్చిన కవి. ఆ సంకలనంలోని ఒక కవిత ‘... బట్‌ ఐ హ్యావ్‌ ప్రామిసెస్‌ టు కీప్, అండ్‌ మైల్స్‌ టు గో బిఫోర్‌ ఐ స్లీప్‌’ అనే భావోద్వేగమైన వాక్యాలతో ముగుస్తుంది. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మోదీకి నెహ్రూ ‘మన ప్రియతమ’ పూర్వపు ప్రధాని కాదని! ఆ సంగతిని ఆయన అనేక పర్యాయాలు స్పష్టం చేశారు. దీనిని బట్టి బైడెన్‌ నుంచి మోదీకి ఆ పుస్తకం కానుకగా అందడం వింతగా లేదూ?

మనసు వింతైనది. విచిత్రంగా పని చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికో ఆలోచనల్ని కలుపుకొంటుంది. మరచిపోయిన జ్ఞాపకాలను రేపుకొంటుంది. అందులో తర్కం ఉండదు. అలా జరుగుతుందంతే. ఫలితం హాయినిగొల్పేది అయివుండొచ్చు, కలవర పరచేదీ కావచ్చు. గతవారం నాకు ఇలాగే జరిగింది. మీకెప్పుడైనా ఇలా అయిందా? 

జో బైడెన్‌ దంపతులు మన ప్రధాన మంత్రికి ఇచ్చిన కానుకలలో ‘కలెక్టెడ్‌ పొయెమ్స్‌ ఆఫ్‌ రాబర్ట్‌ ఫ్రాస్ట్‌’ తొలి ముద్రణ ప్రతి కూడా ఒకటని చదివినప్పుడు నాకు ఇలా అవడం మొదలైంది. ఫ్రాస్ట్‌ని కానుకగా ఇవ్వడంలో అసాధారణత ఏమీ కనిపించలేదు. ఫ్రాస్ట్‌ బహుశా అమెరికా దేశపు అత్యంత ప్రసిద్ధుడైన కవి. నాలుగుసార్లు పులిట్జర్‌ అవార్డు పొందిన వ్యక్తి ఆయన ఒక్కరే. కనుక అమెరికా అధ్యక్షుడు ఒక భారతీయ ప్రధానికి ఫ్రాస్ట్‌ కవితల తొలి ముద్రణ ప్రతిని ఇవ్వడం సముచితమైన కానుకే అవుతుంది. 

అయితే ఇక్కడొక చిక్కు ఉంది. లేదా నా ఉద్దేశంలో ఆక్షేపణ. ఫ్రాస్ట్‌ బహుశా జవహర్‌లాల్‌ నెహ్రూకు నచ్చిన కవి. మోదీకి బైడెన్‌ కానుకగా ఇచ్చిన ఈ కవితా సంకలనంలోని ఒక కవిత ‘స్టాపింగ్‌ బై ఉడ్స్‌ ఆన్‌ ఎ స్నోవీ ఈవెనింగ్‌’. ఆ కవిత భావోద్వేగభరితమైన ఈ వాక్యాలతో ముగుస్తుంది: ‘ది ఉడ్స్‌ ఆర్‌ లౌలీ, డార్క్‌ అండ్‌ డీప్, బట్‌ ఐ హ్యావ్‌ ప్రామిసెస్‌ టు కీప్, అండ్‌ మైల్స్‌ టు గో బిఫోర్‌ ఐ స్లీప్,అండ్‌ మైల్స్‌ టు గో బిఫోర్‌ ఐ స్లీప్‌.’

నెహ్రూ ఈ వాక్యాలలో లోతైన అర్థాన్ని చూశారు. వాటిని ఆయన ఉన్నవి ఉన్నట్లుగా చేత్తో తిరగ రాసుకుని ఆ కాగితాన్ని బల్లపైన ఉన్న గాజు పలక కింద... పైకి కనిపించేలా పెట్టుకున్నారని ఎవరి ద్వారానో నేను విన్నాను. మరికొందరు నెహ్రూ ఆ కాగితం ముక్కకు పటం కట్టించి బల్లపై ఉంచుకున్నారని అంటారు. నెహ్రూకు తను సేకరించిన అమూల్యమైన వస్తువులను తన పడక పక్కన అమర్చుకునే అలవాటు ఉందనీ, వాటిల్లో ఈ వాక్యాలు ప్రముఖ స్థానం పొందాయనీ కూడా కొందరు అంటారు. నిజం ఏదైనప్పటికీ అదొక కవిత. నెహ్రూకు ఎంతో అమూల్యమైనది. 

అయితే ఇదేమీ కొత్త కథ కాదు. 50లు, 60లు, 70లలో పెరిగి పెద్దవాళ్లయిన అనేకమంది భారతీయులకు ఈ సంగతి తెలుసు. నెహ్రూ జీవిత చరిత్రను రాసినవారు ఈ విషయం గురించి కూడా రాశారు. నెహ్రూ చుట్టూ అల్లుకుని ఉన్న నమ్మకాలలో ఇదొక భాగం.

అటువంటిదే ఒక వాస్తవం... అందరికీ తెలిసిన విషయం ఏమి టంటే,  మోదీకి నెహ్రూ ‘మన ప్రియతమ’ పూర్వపు ప్రధాని కాదని! ఆ సంగతిని ఆయన అనేకానేక పర్యాయాలు స్పష్టం చేశారు. దీనిని బట్టి బైడెన్‌ నుంచి మోదీకి ఆ పుస్తకం కానుకగా అందడం వింతగా అనిపించడం లేదూ?

బైడెన్‌కు ఈ సంగతి ఆయనకై ఆయనకు తెలియకపోవచ్చు. లేదా ఇదే పుస్తకాన్ని మోదీకి కానుకగా ఇవ్వాలన్న నిర్ణయం ఆయనది కాకపోనూవచ్చు. కానీ ఆయనకు ఎల్లవేళలా సలహాలు ఇచ్చేవారు ఉంటారన్నది మాత్రం నిస్సందేహం. వారు ఇండియా గురించి బాగా తెలిసినవారై, మరీ ముఖ్యంగా... మోదీని సంతోషపరిచే కానుకను జాగ్రత్తగా ఎంపిక చేయగలవారై ఉండొచ్చు. వారైతే నెహ్రూ–ఫ్రాస్ట్‌ లేదా మోదీ–నెహ్రూల మధ్య ఎలాంటి సంబంధం ఉన్నదో తెలియని వారంటే నమ్మడం కష్టం!

కనుక ఇది నిజంగా యాదృచ్ఛికమేనా, లేక ఇవ్వకనే ఇచ్చిన సూక్ష్మమైన సందేశమా అన్న ఆలోచన నా బుర్రను ఒక గమ్మత్తయిన, అనియంత్రిత దిశలోకి నడిపించింది. అదేమిటో తెలిసేలోపు నేను 1976లోకి వెళ్లిపోయాను. ఆ ఏడాది నేను నా 21వ జన్మదినాన్ని కేంబ్రిడ్జిలో... కొంచెం ఎక్కువ చేసి చెప్పుకోవాలంటే... మత్తుపానీ యాల ఆతిథ్యంతో వేడుకగా జరుపుకొన్నాను.  

ఆ సందర్భంగా... డఫ్నీ, ఆమె ప్రియ స్నేహితుడు హంఫ్రీ నాకు ఆకుపచ్చ, ఎరుపు చారల ‘టై’ని కానుకగా ఇచ్చారు. అది నేను కట్టుకునే రకం టై వంటిది కాదు కాబట్టి సొరుగులో పెట్టి, దానిని నాకు ఎవరిచ్చారో కూడా మర్చిపోయాను. తర్వాత ఎనిమిది నెలలకు హంఫ్రీ పుట్టినరోజు వచ్చింది. అతడి కోసం డఫ్నీ ముందేమీ చెప్పకుండా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేసింది. నేనొక మతిమరుపు గల బుద్ధిహీనుడిని కనుక నా సొరుగులో కనిపించిన టైని హంఫ్రీకి ఇవ్వదగిన బహుమతి అని భావించాను. దానినొక ఖరీదైన కాగితంలో చుట్టి, దానికి సరిపోయే బర్త్‌డే కార్డును జతపరచి రయ్యిన పార్టీకి లంఘించాను.  

నేనిచ్చిన కానుకను తెరచి చూడగానే హంఫ్రీ ముఖం ఎలా మారి పోయిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. విషయం అతడికి అర్థమైన క్షణం అది. తను ఇచ్చిన అదే టై తిరిగి తనకు కానుకగా వెళ్లింది!

హంఫ్రీ పెద్దగా నవ్వాడు. నా ముఖం ఎర్రబడింది. ‘‘మనం ఏదైతే చేస్తామో తిరిగి అదే మనకు జరుగుతుందని నేను ఊహించగలను’’ అని మాత్రం అన్నాడు హంఫ్రీ గొప్ప దయతో.  

బైడెన్‌ పుస్తకానికీ, నా టైకీ మధ్య మీకేదైనా ప్రత్యక్ష, లేదంటే పరోక్ష సంబంధం కనిపిస్తోందా? రెండింటినీ మీరు అనుచితమైన కానుకలుగా పిలవొచ్చు, లేదంటే తగని ఎంపికలు అనవచ్చు. కానీ బైడెన్‌ అసంకల్ప కానుక... నేను ఇబ్బంది పడ్డంతగా... ఆయన్ని ఏ విధం గానూ ఇబ్బంది పెట్టేదైతే కాదు. హంఫ్రీకి నాపై మనసులో ఏమీ లేదు. డఫ్నీతో అతడు విడిపోయినా, మేమిద్దరం ఇప్పటికీ స్నేహి తులుగానే ఉన్నాం. నన్నెప్పుడైనా అతడు టైతో చూస్తే, ‘ఆ’ టైని గుర్తు చేయడం మాత్రం మర్చిపోడు.  

బైడెన్‌ తనకు ఆ పుస్తకాన్ని కానుకగా ఇవ్వడం గురించి నరేంద్ర మోదీ ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని నాకు మహా ఆరాటంగా ఉంది. నేను అనుకోవడం... అమెరికా అధ్యక్షుడి అప్రమేయ కానుక మోదీకి ముసిముసి నవ్వులు తెప్పిస్తుందని. మోదీ ఎప్పుడైనా తన జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తే అందులో ఈ చిన్న కథ కోసం ఎదురు చూడవచ్చు.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement