నేడే ‘పాంచ్’ పటాకా | fifth phase general elections to be held today | Sakshi
Sakshi News home page

నేడే ‘పాంచ్’ పటాకా

Published Thu, Apr 17 2014 1:26 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

fifth phase general elections to be held today

తొమ్మిది దశల 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు విడతలు పూర్తయ్యాయి. వందకు పైగా నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. దాదాపు అంతటా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. ఊహించని స్థాయిలో భారీగా పోలింగ్ నమోదయింది. ఇది క్షేత్రస్థాయిలో వేళ్లూనుకుపోయిన ప్రజల సాధికారతకు, భారత ప్రజాస్వామ్యంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
 
 ఐదో విడత పోలింగ్: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యే రోజు ఇది. ఢిల్లీ పీఠం అటో, ఇటో.. ఎటో తేల్చే ఓటు పడేదీ ఈ రోజే. 12 రాష్ట్రాల్లోని 121 స్థానాల్లో నేడు (ఏప్రిల్ 17) ఐదో దశ పోలింగ్ జరగనుంది. పైనున్న జమ్మూ, కాశ్మీర్ నుంచి దక్షిణాన కర్ణాటక, మధ్య భారతంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ ప్రాంతంలోని మహారాష్ట్ర, ఎడారి రాష్ట్రం రాజస్థాన్, తూర్పున పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, తూర్పు తీరాన ఒడిశా, ఈశాన్యాన మణిపూర్, ఉత్తరాన ఉత్తరప్రదేశ్.. ఇలా భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ రోజు పోలింగ్ జరగనుంది.
 
 మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్‌లలో తమ గాలి బలంగా వీస్తోందని బీజేపీ.. కర్ణాటక, యూపీలపై నమ్మకంతో కాంగ్రెస్‌లు ఉన్నాయి. ఒడిశాలో నవీన పట్నాయక్ మాయాజాలంతో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేడీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. బెంగాల్‌పై వామపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తున్న మరో మార్పు.. భారీ ఓటింగ్ శాతం. ముఖ్యంగా కొత్తగా ఓటర్లైన యువత ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. వారి మొగ్గు ఎటువైపన్న విషయం కూడా కీలకమే. మొత్తం 9 విడతల సార్వత్రిక పోరులో నేటితో 232 స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది.
 
 పోలింగ్ శాతం భారీగా పెరగడాన్ని ఎవరికి వారు తమకనుకూలంగా చెప్పుకుంటున్నారు. ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతను ఇది ప్రతిబింబిస్తోందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమని బీజేపీ అంటుండగా.. యూపీఏ పాలన కొనసాగాలన్న ప్రజల ఆకాంక్షను భారీగా పెరిగిన పోలింగ్ చూపిస్తోందని, మోడీ గాలి భ్రమేనన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ విశ్లేషిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ల వాదనను రుజువు చేసే ఆధారాలేవీ లేవు. పోలింగ్ శాతం పెరగడానికి ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు కారణం కావచ్చు. అంతేకానీ ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొనడానికి ఇదీ కారణం అని కచ్చితంగా చెప్పడం అజ్ఞానం, అమాయకత్వమే అవుతుంది. ఢిల్లీ, ఢిల్లీ చుట్టుపక్కలా పోలింగ్ శాతం పెరగడానికి మొదటిసారి ఓటేస్తున్న వారి సంఖ్య భారీగా పెరగడం, ఎన్నికల సంఘం, ఆర్‌డబ్ల్యూఏ లాంటి సంస్థలు చేపట్టిన అవగాహన, చైత్యన్య కార్యక్రమాలు కారణం కావచ్చు.
 
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్ నగర్ మత కలహాల నేపథ్యంలో మతం  ప్రాతిపదికన అక్కడి ఓటర్లు రెండుగా చీలడం వల్ల అక్కడ పోలింగ్ శాతం భారీగా పెరిగిందని భావిస్తున్నారు. ఏడునెలల క్రితం ముజఫర్‌నగర్‌లో జరిగిన తీవ్రస్థాయి హింసను ఇంకా అక్కడి ఓటర్ల వురువలేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సంస్కరించడం, బోగస్ ఓటర్లను ఏరివేయడం ద్వారా ఎన్నికల సంఘం చేపట్టిన సంస్కరణలు పోలింగ్‌లో పాల్గొంటున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

 - ప్రవీణ్ రాయ్
 సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్
 డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)

 
12 రాష్ట్రాలు.. 121 స్థానాలు
 2009లో ఎవరికెన్ని?
 ఈ 121 స్థానాల్లో 2009లో కాంగ్రెస్ 37, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలు 6 స్థానాల్లో, బీజేపీ 44, ఆ పార్టీ మిత్రపక్షాలు 5 సీట్లలో గెలుపొందాయి. వామపక్షాలు 4, బీఎస్పీ 1, ఎస్పీ 4, ఇతరులు 20 స్థానాల్లో విజయం సాధించాయి. అంటే మొత్తంమీద సింహభాగం సీట్లను కాంగ్రెస్, బీజేపీ పక్షాలు సొంతం చేసుకోగా, మిగిలిన 24% సీట్లను ఇతరులు, ఇతర ప్రాంతీయ పార్టీలు గెల్చుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఈ స్థానాల్లో యూపీఏ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్డీయేకు ఉపకరిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
 
 జార్ఖండ్
 ఓటర్లు-85,25,179, అభ్యర్థులు-106, మహిళా అభ్యర్థులు-7
 జార్ఖండ్‌లో దక్షిణ ప్రాంతంలోని 4, ఉత్తర ప్రాంతంలోని 2 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతుంది. వీటిలో 3 చోట్ల ముస్లిం ఓటర్లు 10% పైగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో వీటిలో బీజేపీ అభ్యర్థులు 4, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు తలో స్థానం గెలుచుకున్నారు. ఈసారి కూడా గత ఫలితాలే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
 ఉత్తరప్రదేశ్
 ఓటర్లు-1,85,35,994
 అభ్యర్థులు-150
 మహిళా అభ్యర్థులు-17
 
 ఉత్తరప్రదేశ్‌లోని 11 స్థానాల్లో 10 రూహేల్‌ఖండ్ ప్రాంతంలో, ఒకటి అవధ్‌లో ఉన్నాయి. ఈ స్థానాల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ముఖ్యంగా మొరాదాబాద్, రామ్‌పూర్ స్థానాల్లో 40%పైగా ముస్లిం ఓటర్లే. షాజహాన్‌పూర్, ఖేరీ స్థానాల్లో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లుండగా, మిగతా స్థానాల్లో 20% పైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ 11 స్థానాల్లో కాంగ్రెస్, ఎస్పీలు చెరో 4 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ కేవలం 2 సీట్లే గెలుచుకుంది. ఏప్రిల్ 10 నాటి ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. ముజఫర్‌నగర్ మత కలహాల కారణంగా ఆ ఎన్నికల్లో ముస్లింలు గంపగుత్తగా కాంగ్రెస్ లేదా బీఎస్పీకి ఓటేసి ఉండొచ్చని, అలాగే జాట్లు, ఇతర హిందువులు మొత్తంగా బీజేపీకే మొగ్గు చూపి ఉండొచ్చని భావిస్తున్నారు. బీజేపీ నేత అమిత్‌షా, ఎస్పీ మంత్రి ఆజంఖాన్‌ల విద్వేషపూరిత ప్రసంగాల వల్ల ఓటర్లు మత ప్రాతిపదికన మరింతగా చీలిపోయారు.
 
 అయితే, ఇప్పటికే రాష్ట్రంలోని లౌకికతత్వం దెబ్బతిన్నది. ఏప్రిల్ 10 నాటి 10సీట్లు,  నేటి 11 స్థానాలు మొత్తం ఈ 21 సీట్లలో ఫలితాలు ఏకపక్షంగా ఉండవచ్చు. కాంగ్రెస్, బీఎస్పీలకు అనుకూలంగానో లేదా బీజేపీకి అనుకూలంగానో ఫలితాలు ఉండొచ్చు. అయితే, జాట్/హిందూ ఓట్లు మొత్తంగా బీజేపీకే పడతాయన్నది మీడియా ఊహాగానంగానే కనిపిస్తోంది.
 
 రాజస్థాన్
 ఓటర్లు-3,46,17,656, అభ్యర్థులు-239,
 మహిళా అభ్యర్థులు-17
 
 బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి రాజస్థాన్. రాజస్థాన్‌లోని 20 స్థానాల్లో నేడు పోలింగ్ జరగనుంది. 2009లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల్లోని కొన్నిట్లో ఈసారి బీజేపీ పాగా వేసే పరిస్థితి ఉంది. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రాంతంలో 5, మధ్య ప్రాంతంలో 3, పశ్చిమ ప్రాంతంలో 5, దక్షిణ ప్రాంతంలో 5, హాఢోతీ ప్రాంతంలో 2 స్థానాల్లో నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జైపూర్, అజ్మీర్, బన్స్వారా, భిల్వారా, బికనీర్, చిత్తోఢ్‌గఢ్, ఝలావర్, జోధ్‌పూర్, పాలి, రాజ్‌సవుంద్, ఉదయ్‌పూర్, కోట, కరౌలీ-ధోల్‌పూర్, అల్వార్, భరత్‌పూర్-ఈ 15 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. నేడు పోలింగ్ జరిగే చోట్ల బీజేపీ రెండంకెల సంఖ్యలో సీట్లు కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. బీజేపీ రెబల్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్ పోటీలో ఉన్న బార్మేర్ సహా మిగిలిన 5 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్ధులు, బలమైన స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో బహుముఖ పోటీలు తప్పడం లేదు.
 
 బీహార్
 ఓటర్లు-1,18,50,786
 అభ్యర్థులు-117
 మహిళా అభ్యర్థులు-9
 బీహార్‌లో 7 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో మగధ ప్రాంతంలో 5, భోజ్‌పూర్ ప్రాంతంలో 2 ఉన్నాయి. జేడీయూ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఇవి. 2009 ఎన్నికల్లో జేడీయూ 5, బీజేపీ, ఆర్జేడీలు చెరో స్థానంలో విజయం సాధించాయి. వీటిలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కూతురు మీసా యాదవ్ పోటీ చేస్తున్న పాటలీపుత్రపైనే అందరి దృష్టి ఉంది. ఆమెకు పోటీగా బీజేపీ తరఫున బరిలో ఉన్న రామ్‌కృపాల్ యాదవ్ గట్టి పోటీ ఇస్తున్నారు.
 
 మణిపూర్
 ఓటర్లు-8,74,704
 అభ్యర్థులు-8
 మహిళా అభ్యర్థులు-1
 
 ఇన్నర్ మణిపూర్ స్థానం కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన సిటింగ్ ఎంపీ తక్‌చామ్ మీన్యాకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో మంచి పేరున్న రంజన్‌సింగ్‌ను బీజేపీ బరిలో నిలిపింది. గత రెండు ఎన్నికల్లో మీన్యా చేతిలో ఓడిపోయిన సీపీఐ నేత మొయిరాంగ్దమ్ నారా సింగ్.. ఈసారి పోటీలో ఉన్నారు.
 
 ఛత్తీస్‌గఢ్
 ఓటర్లు-45,58,873
 అభ్యర్థులు-50
 మహిళా అభ్యర్థులు - 5
 
 కాంగ్రెస్ కన్నా బీజేపీ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్. ఛత్తీస్‌గఢ్‌లో నేడు రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కాంకేర్ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2009 ఈ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి వీటిలో మహాసముంద్ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగీ బరిలో ఉండటమే దానికి కారణం.
 
 పశ్చిమబెంగాల్
 ఓటర్లు-60,23,258, అభ్యర్థులు-47, మహిళా అభ్యర్థులు 3
 
 కూచ్‌బీహార్, జాల్‌పాయిగుడి, అలీపూర్‌దువార్, డార్జిలింగ్ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో మొదటి రెండింటిని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2009లో డార్జిలింగ్ నుంచి బీజేపీ తరఫున జశ్వంత్ సింగ్ గెలిచారు. ప్రస్తుతం ఆయనను పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మిగతా మూడు స్థానాలను వామపక్షాలు(కూచ్‌బీహార్- ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాల్‌పాయిగుడి- సీపీఎం, అలీపూర్‌దువార్- రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) గెలుచుకున్నాయి.
 
 ఈ ఎన్నికల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న స్థానాల్లో డార్జిలింగ్ ఒకటి. ఇక్కడి నుంచి తృణమూల్ తరఫున ఫుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భాటియా, బీజేపీ నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌ఎస్ అహ్లూవాలియా, సీపీఎం తరఫున సమన్ పాఠక్‌లు బరిలో ఉన్నారు. ప్రత్యేక గూర్ఖా రాష్ట్ర ఏర్పాటును హామీ ఇస్తూ బీజేపీ ఇక్కడ ముందంజలో ఉంది. అయితే దాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తమ్మీద ఈ 4 స్థానాల్లో వామపక్షాలు కనీసం 3 స్థానాలు గెలుచుకుంటాయని అంచనా.
 
 ఒడిశా
 ఓటర్లు 1,53,41,460
 అభ్యర్థులు 98
 మహిళా అభ్యర్థులు 11
 
 ఇక్కడ 11 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో ఇవే చివరి దశ ఎన్నికలు.  నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఇక్కడ బలమైన పార్టీ. 2009లో ఆ పార్టీ 9 స్థానాలు గెలుచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మిగతా రెండు స్థానాలను కాంగ్రెస్(బాలాసోర్), సీపీఐ(జగత్సింగ్‌పూర్)లు పంచుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 21 స్థానాల్లో అత్యధిక సీట్లను ఈ సారి కూడా బీజేడీనే గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇక్కడ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ మెజారిటీ స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని భావిస్తున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం బీజేడీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని తెలుస్తోంది. సీఎంగా నవీన్ పట్నాయక్ పనితీరు, ఆయన ఇమేజ్ బీజేడీకి అనుకూల అంశాలుగా పరిణమించాయి.
 
 కర్ణాటక
 ఓటర్లు-4,62,11,844
 అభ్యర్థులు-434, మహిళా అభ్యర్థులు-21
 కర్ణాటక రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఈ రోజే పోలింగ్ జరుగుతుంది. 2009 ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు కైవసం చేసుకుని ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 6, జేడీఎస్ 3 స్థానాల్లో గెలుపొందాయి. ఇంకా లోతుగా విశ్లేషిస్తే.. ముంబై- కర్ణాటక ప్రాంతంలోని మొత్తం 6 స్థానాలు.. చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, హవేరి, ధార్వాడ్‌లను బీజేపీ గెలుచుకుంది. హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంలోని గుల్బర్గా, బీదర్‌లను కాంగ్రెస్.. రాయచూర్, కొప్పల్‌లను  బీజేపీ గెలుచుకున్నాయి. ఈ స్థానాల్లో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. కర్ణాటక తీర ప్రాంతంలోని 3 నియోజకవర్గాలు- ఉత్తర కన్నడ, ఉడుపి- చిక్‌మగళూరు, దక్షిణ కన్నడలను 2009లో బీజేపీనే గెలుచుకుంది.
 
 కాకపోతే మెజారిటీ మాత్రం చాలా తక్కువ. కేవలం 2% నుంచి 4% తేడాతోనే ఈ స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2009లో మధ్య కర్ణాటక ప్రాంతంలోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఈ ప్రాంతంలోని బళ్లారి, దావణగెరె, షిమోగా, చిత్రదుర్గ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే, దక్షిణ కర్నాటక ప్రాంతంలోని ఆరు(హాసన్, తువుకూరు, మాండ్యా, మైసూర్, చావురాజనగర్, కోలార్) స్థానాల్లో బీజేపీ ఒకటే గెలుచుకోగా, కాంగ్రెస్ 3, జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. బెంగళూరు ప్రాంతంలోని నాలుగు స్థానాల్లో బీజేపీ 2, కాంగ్రెస్, జేడీఎస్‌లు చెరో స్థానంలో గెలుపొందాయి.
 
మహారాష్ట్ర
 ఓటర్లు-3,24,27,558
 అభ్యర్థులు-358, మహిళా అభ్యర్థులు-24
 
 ఈ రాష్ట్రంలో నేడు జరగనున్నవి రెండో దశ ఎన్నికలు. మొత్తం 19 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో 11 పశ్చిమ మహారాష్ట్రలో, 6 మరఠ్వాడా ప్రాంతంలో, 2 కొంకణ్ ప్రాంతంలో ఉన్నాయి. 2009లో ఈ స్థానాల్లో కాంగ్రెస్ 6, ఎన్సీపీ 4, శివసేన 5, బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మరఠ్వాడాలోని 6 స్థానాల్లో యూపీఏ, ఎన్డీఏలు చెరో 3 సీట్లు గెలుచుకున్నాయి. వీటిలో హింగోలీ, నాందేడ్, పర్భణీ, బీడ్, ఉస్మానాబాద్ నియోజకవర్గాల్లో 10% పైగా ముస్లిం ఓటర్లున్నారు.
 
  మరోస్థానం లాతూర్ ఎస్సీ రిజర్‌‌వడ్ నియోజకవర్గం. పశ్చిమ మహారాష్ట్రలోని 11 స్థానాలకు గానూ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 3, ఎన్సీపీ 3, బీజేపీ 1, శివసేన 2, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఈ 11 సీట్లలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే(బారామతి), కేంద్రమంత్రి సుశీల్‌కుమార్ షిండే(షోలాపూర్), మాజీ  సీఎం అశోక్‌చవాన్(నాందేడ్), గోపీనాథ్ ముండే(బీడ్) సహా 358 మంది బరిలో ఉన్నారు. ఈ స్థానాల్లో యూపీఏ, ఎన్డీఏలకు సమానంగా విజయావకాశాలున్నా.. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండటంతో యూపీఏ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. యూపీఏ 2009 నాటి కన్నా కొన్ని స్థానాలు తక్కువగా గెలుపొందవచ్చు.
 
 మధ్యప్రదేశ్
 ఓటర్లు -1,67,22,163
 అభ్యర్థులు -142, మహిళా అభ్యర్థులు 11
 బీజేపీ బలంగా ఉన్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ వురోసారి విజయం సాధించింది. ఇక్కడ నేడు 10 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. వాటిలో 4 చంబల్ లోయ, 4 వింధ్య, 2 మాల్వా ప్రాంతాల్లో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో వీటిలో 8 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలవగలిగింది. కానీ ఈ సారి పరిస్థితి తారుమారైంది. ఈ ఎన్నికల్లో బీజేపీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నాయి.
 
 జమ్మూ, కాశ్మీర్
 ఓటర్లు - 14,68,886
 అభ్యర్థులు-13, మహిళా అభ్యర్థులు-1
 జమ్మూ, కాశ్మీర్‌లోని ఉధమ్‌పూర్ నియోజకవర్గంలో ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనతో బీజేపీ నుంచి డాక్టర్ జితేందర్ సింగ్, పీడీపీ నుంచి మొహమ్మద్ అష్రాఫ్ మాలిక్‌లు పోటీ పడ్తున్నారు. ఈ త్రిముఖ పోరులో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆజాద్ గెలుపు ఖాయమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఉధమ్‌పూర్ నియోజకవర్గంలో 17 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కిష్తవార్ జిల్లాలోని బెల్లెస్లా గ్రామానికి చెందిన ఆజాద్‌కు స్థానికుడిగా నియోజకవర్గంలో మంచి పరిచయాలున్నాయి.    

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement