ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ప్రధాని ఇందిరాగాంధీ.. ఈ పేరు వింటే ఒక ఉక్కు మహిళ గుర్తొస్తుంది. అత్యంత ధైర్యసాహసాలు కలిగిన ప్రధానిగా ఆమెకు ఎంతో పేరుంది. ఇందిర హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆమె ఖ్యాతిని ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాయి. కానీ అధికారం మహా చెడ్డది. దానికి అలవాటు పడినవాళ్లు ఎంతకైనా తెగిస్తారనడానికి ఇందిరాగాంధీనే ఉదాహరణ. ఆమె అధికార దాహానికి నిదర్శనమే దేశ చరిత్రలో బ్లాక్‌డేగా మిగిలిన ఎమర్జెన్సీ. ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు మాయని మచ్చలా మిగిలిన ఎమర్జెన్సీని ఇదేరోజు (1975 జూన్ 25న) విధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీపై పోటీచేసి ఓడిపోయిన రాజ్‌నారాయణ్ అనే సోషలిస్ట్ నేత ఇందిర ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు వేశారు. ఆమె అధికార దుర్వినియోగం చేసి గెలిచారని రాజ్‌నారాయణ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ సిన్హా ఇచ్చిన తీర్పు చరిత్రను మలుపు తిప్పింది. 1975 జూన్ 12న ఇందిర ఎన్నిక చెల్లదంటూ కోర్టు స్పష్టం చేసింది. ఆ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించడమే కాకుండా ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇందిరా గాంధీపై నిషేధం విధించింది. ఈ తీర్పు రాజకీయంగా పెను తుపాను సృష్టించింది.అధికారం లేకుండా ఉండలేని ఇందిర తన ఎన్నిక చెల్లదంటూ కోర్టు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకపోయారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయ స్థానం కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. దాంతో చేసేది లేక పదవి వదులుకోలేక ఎమర్జెన్సీ వైపు మొగ్గు చూపారు.
ఇష్టారాజ్యంగా..
కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇందిరా గాంధీ తన అననూయులతో సమావేశమై చకాచకా పావులు కదిపారు. ఈ విషయాన్ని తన మంత్రి వర్గ సహచరులకు తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ ముసాయిదాను సిద్ధం చేసి అర్ధరాత్రి రాష్ట్రపతి ఆమోదం పొందారు. దాంతో దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల అరెస్ట్‌లకు ఆదేశాలు వెళ్లాయి. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్‌షిప్ విధించారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వపరంగా జరిగిన దాషీ్టకం అంతాఇంతా కాదు. ఇందిర రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలో రాజ్యాంగేతర శక్తిగా మారారు. దాదాపు రెండేళ్ల పాటు కొనసాగిన ఈ చీకటి రోజులకు 1977 మార్చి 21తో తెరపడింది. ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు ఇందిర ప్రకటించారు. ఇందుకు ఆమె తర్వాత జరిగిన ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఎమర్జెన్సీకి ప్రతీకారంగా ఆమె పార్టీని ప్రజలు దారుణంగా ఓడించారు.
తిరిగి అధికారంలోకి..
ఇందిరా గాంధీని ఓడించి అధికారారంలోకి వచ్చిన జనతా పార్టీ స్వాతంత్య్రానంతరం ఏర్పడిన తొలి కేంద్ర కాంగ్రేసేతర పార్టీగా చరిత్ర సృష్టించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే జయప్రకాష్ నారాయణ్ కలలు కన్న సంపూర్ణ విప్లవం వాస్తవ రూపం దాల్చకుండానే ‘జనత ప్రయోగం’ విఫలమైంది. రాజకీయ స్వలాభాల కోసం చేతులు కలిపిన పార్టీలు అదే స్వార్థంతో కత్తులు దూసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఫలితంగా ఇందిరకు రాజకీయ పునర్జన్మ లభించింది. ముక్కలు చెక్కలయిన జనతా పార్టీని ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మట్టి కరిపించారు. ఏ ప్రజలైతే ఎమర్జెన్సీ కారణంగా తిరస్కరించారో.. తిరిగి మళ్లీ వారే ఇందిరా గాంధీకి అధికారం అప్పగించారు.
మూడు ఎమర్జెన్సీలు..
మనదేశం స్వాతంత్య్రం పొందాక మూడుసార్లు అత్యవసర పరిస్థితులను చవిచూసింది. 1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు భారత్–చైనాల మధ్య చెలరేగిన యుద్ధం కారణంగా ఎక్ట్సర్నల్ ఎమర్జెన్సీ విధించారు. అలాగే 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు ఇండో పాక్ వార్ సందర్భంగా అత్యవసర పరిస్థితి తలెత్తింది. మూడోసారి ఇందిరాగాంధీ హయాంలో దేశ భద్రత, ఆంతరంగిక కల్లోలాలను బూచిగా చూపించి 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీఅమల్లోకి తెచ్చారు. అయితే మొదటి రెండూ అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇందిరా గాంధీ తెచ్చిన అత్యవసర పరిస్థితి మాత్రం ప్రజలకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది.
మారిన మనిషిగా..
ప్రధాని అయిన తర్వాత ఇందిరలో మునుపటి తెంపరితనం తగ్గిపోయింది. విద్వేష పూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టేశారు. కానీ ఆమె దురదృష్టం.. ప్రజలు ఇచ్చిన రాజకీయ పునుర్జన్మను పూర్తిగా వినియోగించుకోలేక పోయారు. పదవీ కాలం పూర్తికాక ముందే అంగరక్షకుల తుపాకీ తూటాలకు బలైపోయారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఇందిరాగాంధీ తన జీవితకాలంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. అధికారం చేతిలో ఉందికదా! ఏం చేసినా చెల్లుతుందనుకునే వారికి ఇందిర జీవితమే ఒక ఉదాహరణ. ప్రజలు కొందరిని కొన్నాళ్లు నమ్ముతారు. అందరినీ ఎల్లకాలం నమ్మరు.