పారదర్శకత అవసరం! | Sakshi Editorial On Election bonds brought by Narendra Modi govt | Sakshi
Sakshi News home page

పారదర్శకత అవసరం!

Published Tue, Feb 20 2024 12:04 AM | Last Updated on Tue, Feb 20 2024 4:51 AM

Sakshi Editorial On Election bonds brought by Narendra Modi govt

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఫిబ్రవరి 15 చరిత్రాత్మక దినమని ప్రజాస్వామ్య ప్రియుల అభిప్రాయం. కేంద్రంలోని మోదీ సర్కార్‌ తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకం (ఈబీఎస్‌) రాజ్యాంగ విరుద్ధమనీ, పారదర్శకత లోపించిన ఈ పథకం కింద వివిధ పార్టీలకు బాండ్ల రూపంలో నిధులిచ్చిన దాతల వివరాలను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ వెల్లడించాలనీ సుప్రీమ్‌ కోర్ట్‌ చరిత్రాత్మక తీర్పునివ్వడమే అందుకు కారణం. 2018 నుంచి రాజకీయ పార్టీలకు పాడి ఆవుగా మారిన ఈ పథకం రాజ్యాంగంలోని 19 (1)(ఎ) అధికరణాన్ని ఉల్లంఘిస్తోందనీ, దాతలకుండే గోప్యత హక్కు కన్నా పౌరుల సమాచార హక్కే ముఖ్యమనీ కోర్ట్‌ అభిప్రాయపడింది.

బాండ్ల రూపంలో డబ్బులిచ్చిన దాతలు, అందుకున్న పార్టీలు, అందిన నిధులతో సహా మొత్తం వివరాల్ని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) వెల్లడించాలన్న సుప్రీమ్‌ ఆదేశం పాలక వర్గాలకు దెబ్బే! గత ఆరేళ్ళుగా జనం దృష్టి పడకుండా తప్పించుకున్న వివరాలన్నీ ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తాయి. అలాగే, కొన్నేళ్ళుగా అనుమాని స్తున్న కార్పొరేట్ల– రాజకీయపార్టీల క్విడ్‌ ప్రోకో బంధంపై ఎంతో కొంత బయటపడవచ్చు.

ఈ పథక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం కోర్ట్‌ తీర్పుపై ఇంకా మౌనముద్ర వీడలేదు. న్యాయశాఖ మంత్రి మాత్రం తీర్పును పరిశీలిస్తున్నా మనీ, సవాలు చేయదలిచినదీ లేనిదీ నిర్ణయిస్తామనీ వెల్లడించారు. నిజానికి, ఎన్నికల్లో లెక్క చూపని అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల బాండ్లను తెచ్చామన్నది పాలకుల వాదన. కోర్ట్‌ తీర్పుతో మళ్ళీ అదే ధన ప్రవాహ పరిస్థితి తలెత్తుతుందని వారి మాట.

కానీ, ఏ కార్పొరేట్‌ సంస్థల నుంచి, ఏ పార్టీకి, ఎంత నిధులు బాండ్ల రూపంలో వస్తున్నాయో తెలియని గోప్యమైన ఎన్నికల బాండ్ల వ్యవస్థ వల్ల కూడా మరో రకంగా జరుగుతున్నది అదే! అంతా గోప్యమే గనక సంస్థలు స్వప్ర యోజనాలు ఆశించి బాండ్ల రూపంలో పార్టీకి నిధులు కట్టబెట్టడం, ప్రతిగా వాటి ప్రయోజనాలను పాలకులు నెరవేర్చడమన్నది అచ్చమైన ‘క్విడ్‌ప్రోకో’యే! వివరాలు వెల్లడించాలన్న కోర్ట్‌ తాజా ఆదేశంతో ఈ ‘నీ కిది... నాకది’ పందేరాలు బట్టబయలవుతాయి. ఈ తలనొప్పి ఎందుకని బాండ్ల బదులు నేరుగా డబ్బులిస్తే అడ్డుకోవడం అప్పుడైనా, ఇప్పుడైనా కష్టమే. అందుకే, కోర్ట్‌ తీర్పు సర్వ రోగ నివారిణి కాకున్నా, ఎన్నికల నిధుల్లో పారదర్శకతనే అంశంపై మరోసారి చర్చ రేపగలిగింది.

లెక్క తీస్తే, 2017–18 నుంచి 2022–23 వరకు 12 వేల కోట్ల పైచిలుకు విలువైన ఎన్నికల బాండ్లు అమ్మకమయ్యాయి. చిత్రమేమిటంటే అందులో 55 శాతం, అంటే రూ. 6,564 కోట్ల మేర నిధులు అధికార బీజేపీకే దక్కాయి. ఈ అయిదేళ్ళలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు దక్కిన బాండ్లు 9.5 శాతమే. మరో మాటలో రూ. 1,135 కోట్లే. ఈ మొత్తం డబ్బులు ఎవరిచ్చారు, ఎంతిచ్చారన్నది దేవరహస్యం. ఆ గోప్యత చెల్లనేరదన్నది సుప్రీమ్‌ తాజా ఆదేశం.

ఆ ఆదేశాలను పాటిస్తామంటూ భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజానికి, ఎన్నికల బాండ్ల విషయంలో ఎన్నికల సంఘం (ఈసీ) సైతం రోజుకో రకం అభిప్రాయం వ్యక్తం చేసింది. మొదట్లో బాండ్లపై అభ్యంతరం చెబుతూ, ఇది వట్టి తిరోగమన చర్య అని పేర్కొంది. కారణాలేమో కానీ, తీరా సుప్రీమ్‌ ముందు తన మాట మార్చేసి, ఎన్నికల బాండ్లను సమర్థించింది. పథకాన్ని ఆపు చేయరాదని వాదించింది. ఇప్పుడేమో సుప్రీమ్‌ ఆదేశాల్ని పాటి స్తామంటోంది. వెరసి, బాండ్లపై ఈసీకి ఏపాటి నిర్దిష్టమైన అభిప్రాయముందో అర్థమైపోతోంది. 

చెల్లిస్తున్న వారి పేరేమీ లేకుండా ఏ సంస్థ అయినా వెయ్యి, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల వంతున ఎంతైనా ఓ పార్టీకి ఇచ్చే వీలు ఈ బాండ్ల పథకం కల్పించింది. అందుకు తగ్గట్టే, అపరిమిత రాజకీయ విరాళాలకు వీలు కల్పిస్తూ, కంపెనీస్‌ యాక్ట్‌లోని 182వ సెక్షన్‌ను 2017లో ప్రభుత్వం సవరించింది. గతంలో రూ. 20 వేల పైన వచ్చే ప్రతి విరాళానికీ పార్టీలు రికార్డులు సమర్పించాలని ఆదాయపన్ను చట్టం.

పాలకులు దాన్నీ మార్చేశారు. ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాల మొత్తం ఎంతన్నది చెబితే చాలంటూ ఎన్నికల బాండ్లకు మినహాయింపు కల్పించారు. ఈ సవరణల్ని సుప్రీమ్‌ తాజాగా కొట్టేసింది. గత మూడేళ్ళలో సదరు సంస్థకొచ్చిన సగటు నికర లాభంలో 7.5 శాతమే గరిష్ఠంగా ఇవ్వాలనే మునుపటి పరిమితిని మళ్ళీ తెచ్చింది. అపరిమిత కార్పొరేట్‌ ఫండింగ్‌ దోవలో డొల్ల కంపెనీలతో అక్రమ ధనాన్ని పార్టీలకు చేరవేయకుండా అడ్డుకట్ట వేసింది. 

గత 2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ. 2,994 కోట్లని చెబుతున్నా, అసలు ఖర్చు 55 – 60 వేల కోట్లని అంచనా. అందుకే, ఎన్నికల బాండ్ల కథ గోప్యంగా సాగుతోందంటూ సుప్రీమ్‌ కొట్టేయడం సరైనదే! నిర్ద్వంద్వమైన, సమగ్రమైన ఆ తీర్పును స్వాగతించాల్సిందే! అంత మాత్రాన ఇకపై అంతా పారదర్శకత నెలకొంటుందనుకోలేం. అలాగే, సుప్రీమ్‌ మాట సర్కార్‌కు ఎదురుదెబ్బే అయినా, కావాలనుకుంటే భవిష్యత్తులో పార్లమెంట్‌లో చట్టం ద్వారా కొత్త రూపంలో బాండ్లకు పాలకులు తెర తీసినా ఆశ్చర్యం లేదు.

అయితే, కోర్ట్‌ తన పని తాను సమర్థంగా చేసింది గనక, ఇప్పుడా తీర్పు స్ఫూర్తిని అందిపుచ్చుకొని, ఆచరణలో పెట్టాలి. చట్టబద్ధమైన ఎస్బీఐ, రాజ్యాంగబద్ధమైన ఈసీ అందులో ముందుండాలి. ఎన్నికల్లో అక్రమ ధనాన్ని అడ్డుకట్టాలంటే పాలకులు సైతం చిత్తశుద్ధి చూపాలి. పార్టీ విరాళాలిచ్చేందుకు వీలుగా సంస్థలు ప్రత్యేక ట్రస్టుల ఏర్పాటు లాంటి ఆలోచన చేయాలి. పారదర్శకత నెలకొల్పడం పెను సవాలే కానీ, ప్రజలు, పార్టీలు, బడా సంస్థలు... అందరూ త్రికరణశుద్ధిగా ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. సుప్రీమ్‌ తీర్పు ఆ దిశలో తొలి అడుగైతే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement