
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు. రాష్ట్రపతి దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయంలో దిగనున్నారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా, మేడ్చల్ జిల్లా కలెక్టర్, రాచకొండ కమిషనర్ తదితరులు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనెల 20వ తేదీ న భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించను న్నారు.
అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేస్తారు. ఈ విడిది సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్ దారి మళ్లించే చర్యలను అధికారులు చేపట్టారు. ఈనెల 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.