Bhudan pochampally
-
నేడు భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి
సాక్షి, యాదాద్రి: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆమె రోడ్డు మార్గంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.00 గంటలకు పోచంపల్లికి చేరుకుంటారు. అక్కడ శ్రీరంజన్ వీవ్స్‌ను సందర్శించి మగ్గం నేయడం, నూలు వడకడం, రీలింగ్ తదితర ప్రక్రియలను పరిశీలిస్తారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, మగ్గాలను తిలకిస్తారు. అనంతరం అక్కడే చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, అమ్మకాలపై ఆయా వర్గాల ముఖ్యులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. వినోబా భావే, వెదిరె రామచంద్రారెడ్డి చిత్ర పటాలకు నివాళులర్పిస్తారు. అనంతరం 12.20 గంటలకు పోచంపల్లి నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. -
శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక నేడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు. రాష్ట్రపతి దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయంలో దిగనున్నారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా, మేడ్చల్ జిల్లా కలెక్టర్, రాచకొండ కమిషనర్ తదితరులు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈనెల 20వ తేదీ న భూదాన్ పోచంపల్లిలో ఆమె పర్యటించను న్నారు. అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేస్తారు. ఈ విడిది సమయంలో రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు, పర్యటన సందర్భంగా ట్రాఫిక్ దారి మళ్లించే చర్యలను అధికారులు చేపట్టారు. ఈనెల 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
హరితహారం మొక్కలు తిన్న మేకలకు రూ.5వేలు జరిమానా
సాక్షి, భూదాన్ పోచంపల్లి : హరితహారంలో నాటిన మొక్కలు తిన్నందుకు మేకలకు రూ.5వేలు జరిమానా విధించిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హరితహారంలో భాగంగా గ్రామపరిధిలో రోడ్డు వెంట, అలాగే పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. అయితే పలువురి మేకలు తరుచూ మొక్కలను తింటుండటంతో గతేడాది సెప్టెంబర్‌లో గ్రామసభ నిర్వహించి పశువులు, మేకలు మొక్కలు తిన్నా, లేదా ఏదేని కారణంతో తొలగించినా మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించాలని తీర్మానించారు. కాగా.. సోమవారం గ్రామానికి చెందిన శాపాక జంగమ్మకు చెందిన మేకలు రోడ్డు వెంట నాటిన మొక్కలతో పాటు, పల్లెప్రకృతి వనంలోనివి కలిపి మొత్తం 10 మొక్కలు తిన్నాయి. దాంతో సిబ్బంది వాటిని పట్టుకొని గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి బంధించారు. 10 మొక్కలకు గాను రూ. 5000వేల జరిమానా విధించి రసీదును మేకల మెడలో వేశారు. జరిమానా చెల్లించి మేకలు తీసుకెళ్లాలని అధికారులు సదరు యజమానికి సమాచారం ఇచ్చారు. అంతేకాక గతంలో అనేక మార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో కేసు కూడా నమోదు చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా? చదవండి: ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ -
ఏటీఎంలో నకిలీ రూ. 2వేల నోటు
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే అందులో రూ.2వేల నకిలీ నోటు రావడంతో బాధితుడు ఖంగుతిన్న సంఘటన భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్ముఖిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు దుర్గం లింగస్వామి తెలిపిన వివరాల ప్రకారం..దేశ్ముఖిలోని నిజాం ఇంజనీరింగ్ కళాశాలలో ఇండిక్యాష్ ప్రైవేట్ ఏటీఎం ఏర్పాటు చేశారు. లింగస్వామి ఏటీఎం నుంచి రూ. 10వేల చొప్పున రెండు సార్లు మొత్తం రూ. 20వేలు డ్రా చేశాడు. అనంతరం నోట్లను లెక్కిస్తుండగా అందులో రూ. 2వేల నకిలీ నోటు కనిపించింది. నిశితంగా పరిశీలించగా ‘భారతీయ బచ్చోంక బ్యాంకు, దో హాజార్ అంక్ ’ అని ఆ నోట్‌పై రాసి ఉంది. వెంటనే బాధితుడు ఏటీఎంలోని స్క్రీన్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయగా రిజర్వు బ్యాంకును సంప్రదించాలని వారు సలహా ఇచ్చారు. నకిలీ నోటు వల్ల తాను రూ.2వేలు నష్టపోయానని బాధితుడు వాపోయాడు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
చేనేతను సమాజ అవసరంగా గుర్తించాలి : కోదండరాం
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: చేనేత పరిశ్రమను జీవనోపాధి కోసమే కాకుండా సమాజ అవసరంగా గుర్తించాలని తెలంగాణ జెఏసీ ైచైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని పద్మశాలి వేదిక వద్ద జాతీయ చేనేత సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నాడు మహాత్మాగాంధీ చేనేతను పునాదిగా చేసుకొని ఉద్యమం నడిపారని గుర్తు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ జెండాలో చరఖా ఏర్పాటు చేశారని, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం పోచంపల్లి చేనేత వస్త్రాలను ధరించేవారని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన చేనేతను నేటి ప్రభుత్వాలు విస్మరించడం వల్లే పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రూపాయలకు దొరికే కరెంట్‌ను ప్రభుత్వం ఆంధ్రాప్రాంతానికి చెందిన ఏడు ప్రైవేట్ సంస్థల వద్ద అధిక ధరకు కొనుగోలు చేసి ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చెల్లిస్తుందని ఆరోపించారు. అదే లక్షల మంది ఉపాధి పొందుతున్న చేనేతకు ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. మన సంస్కృతికి చిహ్నమైన చేనేత పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావడానికి నిపుణులతో సమగ్ర ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమా మెల్కోటే మాట్లాడుతూ చేనేతతో గిట్టుబాటులేక యువత ఈ రంగానికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. మనిషికి నాగరికతను నేర్పిన చేనేతకు ఎల్లప్పుడు విశిష్ట స్థానం ఉంటుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ రీజినల్ డిప్యూటీ డైరక్టర్ పూర్ణచందర్రావు తెలిపారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ తడక యాదగిరి మాట్లాడుతూ.. ప్రభుత్వం పవర్‌లూమ్‌ను ప్రోత్సహించడం వల్ల భవిష్యత్‌లో చేనేత పరిశ్రమ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత పండరీనాథ్ రాసిన ఆచార్య దివంగత కొండా లక్ష్మణ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ చేనేత సంఘాల ఫెడరేషన్ ప్రతినిధి బి. శ్యామసుందరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, చేనేత నాయకులు కొంగరి భాస్కర్, తడ్క వెంకటేశం, పెండెం రఘు, సజయ, లలిత, దస్తకార్ ఆంధ్ర ప్రతినిధి పాలాది నిర్మల, డివిజన్ జెఏసీ కన్వీనర్ పూస శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. అసెంబ్లీ రూల్ 80 ప్రకారం తీర్మానాన్ని తిరస్కరించాలి : కోదండరాం అసెంబ్లీ రూల్ 78 ప్రకారం రాష్ట్ర సమస్యలు, బిల్లులపై తీర్మానం పెట్టాలని తెలంగాణ జెఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. 77 రూల్ ప్రకారం పది రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని, ఈ రెండు పూర్తి కాకపోతే రూల్ 80 ప్రకారం స్పీకర్ ఆ తీర్మానాన్ని తిరస్కరించాలన్నారు. కానీ సీఎం తీర్మానాన్ని తిరస్కరించలేమని ముఖ్యంత్రి అంటే ఒక వ్యవస్థ అని స్పీకర్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు.అసెంబ్లీలో జరిగే అన్నింటికి తానే నెంబర్‌వన్ అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అన్ని సమూహాలు ఏకమై తెలంగాణ ఉద్యమం ద్వారా నాయకులు ఎదిగారని సీపీఐ నాయకుడు నారాయణ చెప్పడం హర్షణీయమన్నారు. అందరి అకాంక్షను వ్యక్తికరించే విధంగా అభివృద్ధి న మూనా రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.