భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: చేనేత పరిశ్రమను జీవనోపాధి కోసమే కాకుండా సమాజ అవసరంగా గుర్తించాలని తెలంగాణ జెఏసీ ైచైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని పద్మశాలి వేదిక వద్ద జాతీయ చేనేత సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నాడు మహాత్మాగాంధీ చేనేతను పునాదిగా చేసుకొని ఉద్యమం నడిపారని గుర్తు చేశారు.
భారత జాతీయ కాంగ్రెస్ జెండాలో చరఖా ఏర్పాటు చేశారని, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం పోచంపల్లి చేనేత వస్త్రాలను ధరించేవారని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన చేనేతను నేటి ప్రభుత్వాలు విస్మరించడం వల్లే పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రూపాయలకు దొరికే కరెంట్‌ను ప్రభుత్వం ఆంధ్రాప్రాంతానికి చెందిన ఏడు ప్రైవేట్ సంస్థల వద్ద అధిక ధరకు కొనుగోలు చేసి ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చెల్లిస్తుందని ఆరోపించారు. అదే లక్షల మంది ఉపాధి పొందుతున్న చేనేతకు ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు.
మన సంస్కృతికి చిహ్నమైన చేనేత పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావడానికి నిపుణులతో సమగ్ర ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమా మెల్కోటే మాట్లాడుతూ చేనేతతో గిట్టుబాటులేక యువత ఈ రంగానికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. మనిషికి నాగరికతను నేర్పిన చేనేతకు ఎల్లప్పుడు విశిష్ట స్థానం ఉంటుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ రీజినల్ డిప్యూటీ డైరక్టర్ పూర్ణచందర్‌రావు తెలిపారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు మెంబర్ తడక యాదగిరి మాట్లాడుతూ.. ప్రభుత్వం పవర్‌లూమ్‌ను ప్రోత్సహించడం వల్ల భవిష్యత్‌లో చేనేత పరిశ్రమ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం ప్రముఖ రచయిత పండరీనాథ్ రాసిన ఆచార్య దివంగత కొండా లక్ష్మణ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ చేనేత సంఘాల ఫెడరేషన్ ప్రతినిధి బి. శ్యామసుందరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, చేనేత నాయకులు కొంగరి భాస్కర్, తడ్క వెంకటేశం, పెండెం రఘు, సజయ, లలిత, దస్తకార్ ఆంధ్ర ప్రతినిధి పాలాది నిర్మల, డివిజన్ జెఏసీ కన్వీనర్ పూస శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.
అసెంబ్లీ రూల్ 80 ప్రకారం తీర్మానాన్ని తిరస్కరించాలి : కోదండరాం
అసెంబ్లీ రూల్ 78 ప్రకారం రాష్ట్ర సమస్యలు, బిల్లులపై తీర్మానం పెట్టాలని తెలంగాణ జెఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. 77 రూల్ ప్రకారం పది రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని, ఈ రెండు పూర్తి కాకపోతే రూల్ 80 ప్రకారం స్పీకర్ ఆ తీర్మానాన్ని తిరస్కరించాలన్నారు. కానీ సీఎం తీర్మానాన్ని తిరస్కరించలేమని ముఖ్యంత్రి అంటే ఒక వ్యవస్థ అని స్పీకర్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు.అసెంబ్లీలో జరిగే అన్నింటికి తానే నెంబర్‌వన్ అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అన్ని సమూహాలు ఏకమై తెలంగాణ ఉద్యమం ద్వారా నాయకులు ఎదిగారని సీపీఐ నాయకుడు నారాయణ చెప్పడం హర్షణీయమన్నారు. అందరి అకాంక్షను వ్యక్తికరించే విధంగా అభివృద్ధి న మూనా రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
చేనేతను సమాజ అవసరంగా గుర్తించాలి : కోదండరాం
Published Fri, Jan 31 2014 4:10 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement