భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన సాయిని భరత్ అనే యువ చేనేత కళాకారుడు (Weaver) రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, వేర్వేరు రంగులు కలిగిన ఇక్కత్‌పట్టు చీరను (ikkat silk saree) నేసి ఔరా అనిపించారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆయన మొదటి సారిగా రెండు వేర్వేరు రంగులు, డిజైన్లు కలిగిన ఇక్కత్ దుపట్టాను మగ్గంపై తయారు చేశారు. ఎంతో కళాత్మకంగా దుపట్టాను రూపొందించినందుకు గాను 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ (National Merit Certificate) అందుకున్నారు.
ఎంటెక్ చేసిన సాయిని భరత్.. అదే స్ఫూర్తితో ఇక్కత్ కీర్తిని ద్విగుణీకృతం చేయాలని రెండున్నర ఏళ్లు కష్టపడి, ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి ఒక చీరకు వేర్వేరు డిజైన్లు, రంగులు వచ్చేలా అభివృద్ధి చేశారు. అనంతరం టై అండ్ డై డిజైనింగ్, మగ్గంతో పాటు వీవింగ్‌లో సైతం ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని వినియోగించి 15 రోజులు మగ్గంపైనేసి రెండు వైపులా వేర్వేరు డిజైన్లు, రంగులు కలిగిన ఉల్టా లేని పట్టు చీరను తయారు చేశారు.
ప్రస్తుతం ఆయన కొత్త డిజైన్లతో 3 శాంపిల్ ఇక్కత్ పట్టుచీరలను రూపొందించారు. వీటికి పేటెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కత్‌లో సాధ్యం కాని ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి.. పరిశ్రమకు కొత్త ఇమేజ్ తీసుకొస్తున్న భరత్ ప్రతిభను పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు ప్రశంసిస్తున్నారు. పట్టుచీరలే కాకుండా భవిష్యత్తులో ఫర్నిషింగ్ వస్త్రాలనూ (Furnishing Cloth) రూపొందించనున్నట్లు భరత్ తెలిపారు.
చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం
హైదరాబాద్: చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్కా దేవదాసు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం చిక్కడపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత, జౌళి శాఖలను వేరు చేయాలని, చేనేతకు రెండు వేల కోట్ల నిధులను విడుదల చేయాలన్నారు.
చదవండి: ప్రాణం తీసిన చీర గొడవ
గత సంవత్సరం ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉపాధి లభించకపోవడంతో 27 మంది చేనేతే కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇ చ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నేతలు శ్రీనివాస్, సుదర్శన్, నాగమూర్తి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment