చెరువులో కారు బోల్తా..
సరదాగా షికారుకని వెళ్లిన ఆరుగురు స్నేహితులు
మధ్యలో ఆగి మద్యం తాగి.. ఆపై కల్లు తాగేందుకు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి ప్రయాణం
జలాల్‌పురం సమీపంలో మూల మలుపు, పొగ మంచుతో రోడ్డు సరిగా కనబడక ఇబ్బంది
సడెన్ బ్రేక్ వేసిన యువకుడు.. అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులో పలీ్టకొట్టిన కారు
ఈదుకుంటూ బయటపడిన ఒకరు.. నీట మునిగి మృతి చెందిన ఐదుగురు
మృతులంతా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందినవారే..
భూదాన్ పోచంపల్లి: వారంతా 25 ఏళ్లలోపు యువకులు.. కలసి తిరిగే స్నేహితులు.. సరదాగా షికారుకు బయలుదేరారు.. మధ్యలో మద్యం తాగారు.. ఆపై కల్లుతాగాలనే కోరిక పుట్టింది.. దానికోసం వెళుతుంటే, పొగమంచులో దారి సరిగా కనిపించక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పురం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది. మృతులంతా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ ప్రాంతానికి చెందినవారే.
ఆరుగురు కలసి వెళ్లి..
ఎల్‌బీ నగర్ ప్రాంతంలోని సిరినగర్ కాలనీకి చెందిన తీగుళ్ల వంశీగౌడ్ (23), ఇంద్రపల్లి హర్షవర్ధన్ (22), వీరమల్ల విఘ్నేశ్వర్(20), ఆర్టీసీ కాలనీకి చెందిన కలకోటి అక్షయ్‌కుమార్ అలియాస్ బల్లు (19), వాస్తుకాలనీకి చెందిన జెల్ల వినయ్ (21), బోడుప్పల్ జ్యోతినగర్ కాలనీకి చెందిన మేడబోయిన మణికంఠయాదవ్ (21) స్నేహితులు. శుక్రవారం రాత్రి వీరంతా ఎల్‌బీ నగర్‌లో కలసి పార్టీ చేసుకొందామని అనుకున్నారు. తీగుళ్ల వంశీగౌడ్ తన ఇంటి వద్ద ఓ స్నేహితుడు పెట్టివెళ్లిన కారు ఉండటంతో.. దానిని తీసుకొని శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బయలుదేరారు.
మార్గమధ్యలో అంబర్‌పేట వద్ద మద్యం తాగారు. అక్కడే రెండు గంటల పాటు గడిపారు. ఆ సమయంలో వారికి ఈతకల్లు తాగాలని కోరిక పుట్టింది. దీనితో సుమారు 3.30 గంటల సమయంలో భూదాన్ పోచంపల్లికి వచ్చారు. ఇంకా చీకటిగానే ఉండటంతో అక్కడే టీ తాగారు. టిఫిన్ చేసి వద్దామనుకుని కొత్తగూడెం ఎక్స్ రోడ్డు వద్దకు వెళ్లారు. టిఫిన్ సెంటర్లు తెరవకపోవడంతో తిరిగి పోచంపల్లికి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న వంశీ కారు నడుపుతున్నాడు. అయితే మధ్యలో అటవీ ప్రాంతం కావడం, తెల్లవారుజాము సమయం కావడంతో పొగమంచు దట్టంగా కప్పుకొంది. దానితో రోడ్డు సరిగా కనిపించక వంశీ ఒక్కసారిగా కారు హ్యాండ్ బ్రేక్ వేశాడు. వేగంగా ఉన్న కారు దీనితో అదుపుతప్పి పక్కనే ఉన్న జలాల్‌పురం చెరువులోకి బోల్తా కొట్టింది.
ఈత రాక, బయటపడలేక..
కారులో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్న మణికంఠ కారు సైడ్ అద్దం కొద్దిగా తెరిచి ఉంటడంతో దానిని కాలుతో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కారు నడుపుతున్న వంశీ, వెనుక సీట్లో కూర్చున్న అక్షయ్, వినయ్, హర్షవర్ధన్, విఘ్నేశ్వర్ నీట మునిగి ప్రాణాలు వదిలారు. ఒడ్డుకు చేరిన మణికంఠ రోడ్డుపై వెళ్తున్న పాల వ్యాపారిని ఆపి ప్రమాదం గురించి చెప్పాడు. ఆ వ్యాపారి 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక ఎస్సై భాస్కర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. నీట మునిగిన కారును జేసీబీతో వెలికితీయించి.. అందులోని మృతదేహాలను బయటికి తీశారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అంతా పేద కుటుంబాల వారే
జల సమాధి అయిన ఐదుగురు యువకులు కూడా పేద కుటుంబాలకు చెందినవారే. ఇందులో వంశీగౌడ్ ఇంటర్ పూర్తి చేసి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అతడి తండ్రి శంకర్ ఆటోడ్రైవర్‌కాగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ఇక అక్షయ్‌కుమార్ ఇంటర్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి తండ్రి నర్సింహాచారి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. జెల్ల వినయ్ ఇంటర్ చదివాడు. అతడి తండ్రి జగన్నాథం చేనేత కారి్మకుడు. హర్షవర్ధన్ డిగ్రీ పూర్తి చేశాడు. ర్యాపిడో బైక్ నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వీరమల్ల విఘ్నేశ్వర్ ఇంటర్ పూర్తి చేశాడు. అతడి తండ్రి సత్యనారాయణ ఆర్టీసీ కండక్టర్ అని తెలిసింది.
అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చాను
పార్టీ చేసుకొందామని ఫ్రెండ్స్ చెబితే రాత్రి ఎల్‌బీ నగర్‌కు వచ్చాం. వంశీ కారు తీసుకొచ్చాడు. ఆరుగురం కలసి రాత్రి 12 గంటలకు బయలుదేరాం. రామోజీ ఫిల్మ్‌సిటీ వద్ద ఏదో యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ జామైతే గంటపైగా అక్కడే ఉన్నాం. కల్లు దొరుకుతుందని రాత్రి 3.30 గంటలకు పోచంపల్లికి వచ్చాం. ఇంకా తెల్లరకపోయేసరికి టిఫిన్ చేయడానికి కొత్తగూడెం ఎక్స్‌రోడ్డుకు వచ్చి తిరిగి పోచంపల్లికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనబడక సడన్‌గా హ్యాండ్ బ్రేక్ వేసిండు. కారు పల్టీ కొట్టి చెరువులో బోల్తా పడింది. డోర్లు తెరుచుకోలేదు. ముందు సీట్లో ఉన్న నేను కారు సైడ్ అద్దాన్ని కాలితో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాను. డోర్లు తెరుచుకుని ఉంటే అంతా ఎలాగోలా బయటపడేవారు. – మణికంఠ యాదవ్, (ప్రాణాలతో బయటపడిన యువకుడు)
రాత్రి 11 గంటల దాకా ఇంటివద్దే ›ఉన్నాడు
మేం ముగ్గురం అన్నదమ్ములం. వంశీ రెండోవాడు. పెళ్లిళ్లకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. రాత్రి 11 గంటల వరకు అంతా ఇంటి వద్దే ఉన్నారు. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లారు. ఉదయం నేను జిమ్‌కు వెళ్తుంటే తెలిసినవారు మీ తమ్ముడు చనిపోయాడని, స్నాప్‌చాట్‌లో ఫొటోలు వచ్చాయని చెప్పడంతో చూసి షాక్ అయ్యాం.
– తిగుళ్ల ఉదయ్‌కుమార్ (మృతుడు వంశీ సోదరుడు)
Comments
Please login to add a commentAdd a comment