నకిలీ రూ.2వేల నోటును చూపిస్తున్న బాధితుడు లింగస్వామి, నకిలీ రూ. 2వేల నోటు ఇదే
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే అందులో రూ.2వేల నకిలీ నోటు రావడంతో బాధితుడు ఖంగుతిన్న సంఘటన భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు దుర్గం లింగస్వామి తెలిపిన వివరాల ప్రకారం..దేశ్‌ముఖిలోని నిజాం ఇంజనీరింగ్ కళాశాలలో ఇండిక్యాష్ ప్రైవేట్ ఏటీఎం ఏర్పాటు చేశారు. లింగస్వామి ఏటీఎం నుంచి రూ. 10వేల చొప్పున రెండు సార్లు మొత్తం రూ. 20వేలు డ్రా చేశాడు. అనంతరం నోట్లను లెక్కిస్తుండగా అందులో రూ. 2వేల నకిలీ నోటు కనిపించింది.
నిశితంగా పరిశీలించగా ‘భారతీయ బచ్చోంక బ్యాంకు, దో హాజార్ అంక్ ’ అని ఆ నోట్‌పై రాసి ఉంది. వెంటనే బాధితుడు ఏటీఎంలోని స్క్రీన్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయగా రిజర్వు బ్యాంకును సంప్రదించాలని వారు సలహా ఇచ్చారు. నకిలీ నోటు వల్ల తాను రూ.2వేలు నష్టపోయానని బాధితుడు వాపోయాడు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment