రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్‌బీపి) అందుకుంటున్న హెత్వి ఖిమ్సూరియా
గుజరాత్‌లోని వడోదరకు చెందిన హెత్వి ఖిమ్సూరియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పీఎం నేషనల్ చైల్డ్ అవార్డ్ (ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–పీఎంఆర్‌బీపి) అందుకుంది. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారం ఇది.
పదమూడు సంవత్సరాల హెత్వి సెరిబ్రల్ పాల్సీని అధిగమించి పెయింటింగ్, పజిల్ సాల్వింగ్‌లో అసా«ధారణ ప్రతిభ చూపుతోంది. తనకు వచ్చే పెన్షన్‌ను దివ్యాంగుల సంక్షేమ నిధికి ఇస్తోంది. తన ఆర్ట్‌పై యూట్యూబ్ చానల్ నడుపుతోంది....
వడోదరలోని 8–గ్రేడ్ స్టూడెంట్ హెత్వి ఖిమ్సూరియాకు పురస్కారాలు కొత్త కాదు. ప్రశంసలు కొత్తకాదు. గత సంవత్సరం ఫ్రీహ్యాండ్ పెయింటింగ్, క్రాఫ్ట్, పజిల్ సాల్వింగ్‌లో చూపుతున్న ప్రతిభకు ‘గుజరాత్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. ‘వరల్డ్స్ ఫస్ట్ సీపీ గర్ల్ విత్ ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్’ టైటిల్ సాధించింది. వంద ఎడ్యుకేషనల్ పజిల్స్ సాల్వ్ చేసిన ఫస్ట్ సీపీ గర్ల్‌గా ఆమెను ‘ది లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్‌లు సాధించిన హెత్వి గీసిన చిత్రాలు యాభై ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి. చిత్రకళలపై పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి ‘స్పెషల్ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ–హెత్వి ఖిమ్సూరియా’ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించింది.
హెత్వి విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది.
కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ‘అయ్యో! మీ అమ్మాయి’ అంటూ ఎంతోమంది సానుభూతి చూపే సమయాల్లో ‘బాధ పడాల్సిన అవసరం ఏముంది. మా అమ్మాయి బంగారం. భవిష్యత్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడండి’ అనేవారు. ఆ మాట అక్షరాలా నిజమైంది.
చిన్నప్పటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
హెత్విని చూసుకోవడానికి ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది.
రంగులు, పజిల్స్‌తో బేసిక్స్ ప్రారంభించారు. రంగులు, పజిల్స్ అంటే హెత్విలో ఇష్టం ఏర్పడేలా చేశారు. బొమ్మలు వేస్తున్నప్పుడు, పజిల్స్ పరిష్కరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్లలో శక్తి కనిపిస్తుంది. ఆ శక్తితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులలో నింపింది.
హెత్వి మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే ఈ చిన్నారి బలం.
హెత్వి ఖిమ్సూరియా మర్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment