teanage girls
-
Hetvi Khimsuriya: బంగారంలాంటి బిడ్డ
గుజరాత్‌లోని వడోదరకు చెందిన హెత్వి ఖిమ్సూరియా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పీఎం నేషనల్ చైల్డ్ అవార్డ్ (ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–పీఎంఆర్బీపి) అందుకుంది. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా ఇచ్చే పురస్కారం ఇది. పదమూడు సంవత్సరాల హెత్వి సెరిబ్రల్ పాల్సీని అధిగమించి పెయింటింగ్, పజిల్ సాల్వింగ్‌లో అసా«ధారణ ప్రతిభ చూపుతోంది. తనకు వచ్చే పెన్షన్‌ను దివ్యాంగుల సంక్షేమ నిధికి ఇస్తోంది. తన ఆర్ట్‌పై యూట్యూబ్ చానల్ నడుపుతోంది.... వడోదరలోని 8–గ్రేడ్ స్టూడెంట్ హెత్వి ఖిమ్సూరియాకు పురస్కారాలు కొత్త కాదు. ప్రశంసలు కొత్తకాదు. గత సంవత్సరం ఫ్రీహ్యాండ్ పెయింటింగ్, క్రాఫ్ట్, పజిల్ సాల్వింగ్‌లో చూపుతున్న ప్రతిభకు ‘గుజరాత్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. ‘వరల్డ్స్ ఫస్ట్ సీపీ గర్ల్ విత్ ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్’ టైటిల్ సాధించింది. వంద ఎడ్యుకేషనల్ పజిల్స్ సాల్వ్ చేసిన ఫస్ట్ సీపీ గర్ల్‌గా ఆమెను ‘ది లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్లు సాధించిన హెత్వి గీసిన చిత్రాలు యాభై ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి. చిత్రకళలపై పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి ‘స్పెషల్ చైల్డ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ–హెత్వి ఖిమ్సూరియా’ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. హెత్వి విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ‘అయ్యో! మీ అమ్మాయి’ అంటూ ఎంతోమంది సానుభూతి చూపే సమయాల్లో ‘బాధ పడాల్సిన అవసరం ఏముంది. మా అమ్మాయి బంగారం. భవిష్యత్‌లో ఎంత పేరు తెచ్చుకుంటుందో చూడండి’ అనేవారు. ఆ మాట అక్షరాలా నిజమైంది. చిన్నప్పటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. హెత్విని చూసుకోవడానికి ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. రంగులు, పజిల్స్‌తో బేసిక్స్ ప్రారంభించారు. రంగులు, పజిల్స్ అంటే హెత్విలో ఇష్టం ఏర్పడేలా చేశారు. బొమ్మలు వేస్తున్నప్పుడు, పజిల్స్ పరిష్కరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి కళ్లలో శక్తి కనిపిస్తుంది. ఆ శక్తితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని తల్లిదండ్రులలో నింపింది. హెత్వి మోములో ఎప్పుడూ చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వే ఈ చిన్నారి బలం. హెత్వి ఖిమ్సూరియా మర్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. -
Manuka Paudel: పాడాలి... వినపడుతుంది
'శక్తి లేదనిపిస్తుంది. ప్రయత్నించాలి. కాళ్లలో బలం లేదనిపిస్తుంది. కదలాలి. ఎవరూ తోడు నిలవడం లేదనిపిస్తుంది. ఒంటరిగా పోరాడాలి. లేదని ఓడేది మనిషే. ఉందని గెలిచేది మనిషే. మేనుకా పౌడెల్‌కు చూపు లేదు. నేపాల్ నుంచి ఇండియాకు పాటను నమ్ముకుని వచ్చింది. తన పాటతో ఎందరినో కదిలించింది. ఇండియన్ ఐడెల్ కంటెస్టెంట్‌గా ఎంపికై ఇప్పుడు ‘సలార్’లో పాడి దేశం మొత్తానికి వినపడుతోంది.' స్ఫూర్తిదాయకమైన ఈ గాయని గురించి.. ‘ఓ పాలన్ హారే నిర్గుణ్ ఔర్ న్యారే తుమ్రె బిన్ హమ్రా కోనొ నహీ’... ‘లగాన్’లోని ఈ పాటను మేనుకా పౌడెల్ (25) పాడుతున్నప్పుడు, ఆ పాటలోని ఆర్తికి, అర్పణకి, ఆరాధనకి న్యాయ నిర్ణేతల్లో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడుస్తూనే ఉంది. మరో జడ్జి విశాల్ దద్లానీ పరిస్థితీ అంతే. ఇంకో జడ్జయిన ప్రముఖ గాయకుడు కుమార్ షాను ‘వహ్వా’లు కొడుతూనే ఉండిపోయాడు. కన్ను తెరిచినా, కన్ను మూసినా చీకటి తప్ప, గాఢాంధకారం తప్ప, ఓడించాలని చూసే నలుపు తప్ప మరేమీ ఎరగని ఆమె తన పాటతో దివ్వె వెలిగించింది. వెలుతురు చూస్తోంది. వెలుతురు చూపిస్తోంది. నేపాల్‌కు చెందిన అంధురాలు మేనుకా పౌడెల్‌కు ఆడిషన్స్ రౌండ్లో గోల్డెన్ మైక్ దొరికింది. ఇండియన్ ఐడెల్ సీజన్ 14లో ఇంకా ఆమె టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ ఉంది. ముఖేష్ స్పెషల్‌లో ముఖేష్ తనయుడు నితిన్ ముఖేష్ సమక్షాన ‘ఏ ప్యార్ కా నగ్మా హై’ పాడితే ఆయన ఎంతో సంతోషించాడు. దర్శకుడు మహేశ్ భట్ సమక్షంలో ‘జఖ్మ్’ సినిమాలోని ‘గలి మే ఆజ్ చాంద్ నిక్లా’ పాటను పాడితే ఆయన స్పందిస్తూ ‘హృదయం దగ్గర ఒక కన్ను ఉంటుందని నువ్వు నిరూపించావు’ అన్నాడు. వాద్యాలు చూడకుండా, పాటను అక్షరాల్లో చూడకుండా, అంత పెద్ద సెట్‌ను చూడకుండా, తన ఎదుట ఉన్న జడ్జిలు ఎలా ఉంటారో చూడకుండా మేనుకా పౌడెల్ ఎంతో నిబ్బరంతో పాటలు పాడటం వల్ల కోట్లమంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతకుముందు రియాల్టీ షోలలో కొంతమంది అంధులు పాడటానికి ప్రయత్నించారు కానీ ఇలా నిలువలేదు. మేనుకా పౌడెల్ గొంతులోని మాధుర్యం చివరకు ఆమెను‘సలార్’ లో పాడే వరకూ తీసుకెళ్లింది. ‘సలార్’ హిందీ వెర్షన్‌లోని ‘సూరజ్ హీ ఆజ్ తన్కే’ పాటను మేనుకా పౌడెల్ పాడింది. దీనివల్ల ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఒక భారీ సినిమాతో జరిగిందని చెప్పాలి. ఇదంతా ఆమె పాడాలి అనుకోవడం వల్ల. ఓడాలి అని అనుకోకపోవడం వల్ల. నేపాల్ అమ్మాయి మేనుకా పౌడెల్ది నేపాల్‌లోని జాపా. పుట్టుకతో చూపు లేకపోయినా తల్లిదండ్రులు ఆ లోటు తెలియనీకుండా పెంచారు. బాల్యం నుంచి గానం పట్ల ఆమె ఆసక్తిని ప్రోత్సహించారు. తండ్రి మలేసియాలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లగా ఇంటి బాధ్యత ఇప్పుడు మేనుక మీదే ఉంది. ముంబైలోని సురేష్ వాడ్కర్ అకాడెమీలో కొన్నాళ్లు పాడటం నేర్చుకున్న మేనుక గాయనిగా తన ప్రతిభను చాటేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. సాయిబాబా భజనలు పాడుతూ ఉపాధి పొందింది. ‘సాయిబాబా నా కుటుంబ సభ్యుడు’ అని చెప్పుకుంటుంది. బహుశా ఆ సాయి దయ వల్లే ఆమెకు ఇప్పుడు గొప్ప గుర్తింపు లభించింది. ఆమె పాటను మీరు ఇండియన్ ఐడల్‌లో వినచ్చు. -
Shanya Gill: పన్నెండు సంవత్సరాల వయసులోనే ఫైర్–డిటెక్షన్ డివైజ్ ఆవిష్కరణ
సైన్స్ పాఠాలను కూడా చందమామ కథల్లా ఆసక్తిగా వింటుంది శణ్య గిల్. ఆ ఆసక్తి వృథా పోలేదు. చిన్నవయసులోనే ఆవిష్కర్తను చేసింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్వెంటర్స్ ఛాలెంజ్–2023లో పన్నెండు సంవత్సరాల శణ్య గిల్ తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ ప్రథమ స్థానంలో నిలిచింది... కాలిఫోర్నియా(యూఎస్)లో సిక్త్స్–గ్రేడ్ చదువుతుంది శణ్య. సైన్స్, సైంటిస్ట్‌లు తనకు బాగా ఇష్టం. సైన్స్‌లో కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. శణ్య గిల్ ఇంటికి సమీపంలోని ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగి భారీ నష్టం సంభవించింది. ఇంటా బయటా ఈ ప్రమాదానికి సంబంధించిన రకరకాల మాటలు ఎక్కడో ఒక చోట వినేది శణ్య గిల్. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఒక పరికరం తయారు చేయాలనుకుంది. రకరకాల ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలు వృథా పోలేదు. కంప్యూటర్‌కు అనుసంధానించిన థర్మల్ కెమెరాను ఉపయోగించి సమర్థవంతమైన ఫైర్–డిటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది శణ్య. శణ్య తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ సాధారణ సంప్రదాయ స్మోక్ డిటెక్టర్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. నష్టం జరగకుండా అప్రమత్తం చేస్తుంది. ‘రెస్టారెంట్ అగ్నిప్రమాదం ప్రభావంతో అమ్మ రకరకాలుగా భయపడేది. కిచెన్‌లోని స్టవ్ ఆఫ్ అయిందో లేదో అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్ చేసేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. మరోవైపు ఎక్కడ చూసినా ఆ అగ్నిప్రమాదానికి సంబంధించే మాట్లాడుకునేవారు. ఇదంతా చూసిన తరువాత అగ్నిప్రమాదాలను నివారించే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను తయారు చేసిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా ఎంతో మందిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చు’ అంటుంది శణ్య గిల్. శణ్యకు సైన్స్‌తోపాటు ఆటలు, క్రాఫ్టింగ్, కోడింగ్ అంటే ఇష్టం. జూనియర్లకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. బయో మెడికల్ ఇంజనీర్ కావాలనేది శణ్య గిల్ లక్ష్యం. -
ధైర్యం పలికిన పేరు... దేవాన్షి! ఆమె ఒక సైన్యంలా..!
పద్నాలుగు సంవత్సరాల వయసులో యాసిడ్ దాడికి గురైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేవాన్షీ యాదవ్. తాను బాధితురాలిగా ఉన్నప్పుడు ఒంటరి. ఇప్పుడు మాత్రం తానే ఒక సైన్యం. ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సోసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి న్యాయసహాయం అందించడం నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడం వరకు బాధితుల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న దేవాన్షి గురించి... కష్టాలన్నీ కలిసికట్టుగా వచ్చాయా! అన్నట్లుగా దేవాన్షీ యాదవ్ నెలల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పద్నాలుగు సంవత్సరాల వయసులో కుటుంబ స్నేహితుడిగా భావించే ఒకడు లైంగిక వేధింపులకు, యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు మాత్రం దేవాన్షినే బోనులో నిలబెట్టారు. ‘మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా’ లాంటి మాటలు తనను ఎంతో బాధ పెట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ పట్టణానికి చెందిన 31 సంవత్సరాల దేవాన్షి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి కష్టాలెన్నో కనిపిస్తాయి. అయితే వాటిని గుర్తు చేసుకుంటూ బాధను గుండెలో పెట్టుకోలేదు. తనలాంటి కష్టాలు వచ్చిన వారికి అండగా నిలబడాలనుకుంది. అలా మొదలైందే ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ. లైంగిక వేధింపులకు గురవుతున్న వారి నుంచి గృహహింస బాధితుల వరకు ఎంతోమందికి ఈ సంస్థ తరపున అండగా నిలబడింది దేవాన్షి. ‘ధైర్యసాహసాలలో మా అమ్మే నాకు స్ఫూర్తి. నాకు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. ఒకవైపు భర్త చనిపోయిన బాధ, మరోవైపు బిడ్డను ఎలా పోషించాలనే బాధ, అయోమయం ఆమెను చుట్టుముట్టాయి. ఆరోజు ఆమె ధైర్యం కోల్పోయి ఉంటే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. జీవితంలో ప్రతి సందర్భంలో ధైర్యంతో ముందుకు వెళ్లింది. తల్లిగా ప్రేమానురాగాలను పంచడమే కాదు ధైర్యం అనే విలువైన బహుమతిని ఇచ్చింది’ అంటుంది దేవాన్షి. భారమైన జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి, శక్తిమంతం కావడానికి సామాజిక సేవా కార్యక్రమాలు దేవాన్షికి ఎంతో ఉపయోగపడ్డాయి. దేవాన్షి దగ్గరకు సహాయం కోసం వచ్చే బాధితుల్లో ఏ కోశానా ధైర్యం కనిపించదు. అలాంటి వారిలో ధైర్యం నింపడం అనేది తాను చేసే మొదటి పని. తనని కుటుంబ సభ్యురాలిగా భావించుకునేలా ఆత్మీయంగా ఉండడం రెండో పని. కౌన్సెలింగ్ ద్వారా వారికి భవిష్యత్ పట్ల ఆశ రేకెత్తించడం మూడోపని. ‘ఈ సమాజం నన్ను చిన్నచూపు చూస్తుంది. నాకు ఎవరూ అండగా లేరు’ అనుకున్న ఎంతోమందికి ‘నాకు ఎవరి అండా అక్కర్లేదు. ఒంటరిగా పోరాడగలను. నా కోసం నేను పోరాడలేనా!’ అనే ధైర్యాన్ని ఇచ్చింది. ‘ఇంకేముంది నా భవిష్యత్ బుగ్గిపాలు అయింది’ అని జీవనాసక్తి కోల్పోయిన వారిలో ‘కష్టాలు నీ ఒక్కరికే కాదు. అందరికీ వస్తాయి. అదిగో నీ భవిష్యత్’ అంటూ ఆశావాహ దృక్పథాన్ని కలిగించింది. ‘పదా... పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం’ అని దేవాన్షి అన్నప్పుడు... ‘అమ్మో! నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం’ అన్నది ఒక బాధితురాలు. ‘తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతున్నాడు. ఏ తప్పూ చేయని నువ్వెందుకు భయపడడం’ అని దేవాన్షి అనగానే ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు బయలు దేరింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో! సంస్థ అడుగులు మొదలుపెట్టిన కొత్తలో... ‘మీవల్ల ఏమవుతుంది’ అన్నట్లుగా ఎంతోమంది వ్యంగ్యంగా మాట్లాడేవారు. వారికి తన పనితీరుతోనే సమాధానం ఇచ్చింది దేవాన్షి. ‘దేవాన్షీ చాలా పట్టుదల గల వ్యక్తి. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యదు. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నేను దేవాన్షి దగ్గరకు వచ్చాను. ఆమె నాకు ఆశ్రయం ఇచ్చింది. విషయం తెలుసుకున్న అత్తింటి వారు దేవాన్షిని బెదిరించడానికి వీధిరౌడీలను పంపించారు. ఆమె ధైర్యాన్ని చూసి వారు తోక ముడవడానికి ఎంతో సమయం పట్టలేదు’ అంటుంది బరేలీకి చెందిన రత్న. బరేలీ పట్టణానికి చెందిన వారే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మహిళలు దేవాన్షి సహాయం కోసం రావడం ప్రారంభించారు. ‘మా దగ్గరకు వచ్చేవాళ్లలో 60 నుంచి 70 శాతం గృహహింస బాధితులే. వారికి అండగా నిలిచినప్పుడు సహజంగానే బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే నేను వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. మీకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? అనే ప్రశ్న అడుగుతుంటారు. ఒకప్పుడు నేను మీలాగే భయపడేదాన్ని... అంటూ నాకు ఎదురైన చేదు అనుభవాలను వారితో పంచుకుంటాను. అమ్మ నుంచి ధైర్యం ఎలా పొందానో చెబుతాను. ధైర్యం అనేది ఒకరు దయతో ఇచ్చేది కాదు. అది అందరిలోనూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటున్నామా? లేదా? అనేదే ముఖ్యం అని చెబుతుంటాను’ అంటుంది దేవాన్షీ యాదవ్. ‘అత్తింటి బాధలు తట్టుకోలేక బయటికి వచ్చాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా బతకగలను’ అని దిక్కులు చూస్తున్న ఎంతోమందికి సంస్థ ద్వారా దిక్కు చూపించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుపడింది. ‘మంచిపని చేస్తే ఆ ఫలితం తాలూకు ఆనందమే కాదు అపారమైన శక్తి కూడా లభిస్తుంది. ఆ శక్తి మరిన్ని మంచిపనులు చేయడానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది’ అంటుంది దేవాన్షీ యాదవ్. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
టీనేజి బాలికల్లో పెరుగుతున్న అబార్షన్లు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో టీనేజి బాలికల అబార్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2014-15 సంవత్సరంలో అంతకుముందు కంటే ఇది ఏకంగా 67 శాతం పెరిగిందట. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం సుమారు 31 వేల మంది మహిళలు అబార్షన్ చేయించుకోడానికి రాగా, వాళ్లలో 1600 మంది 19 ఏళ్ల లోపువారేనని తేలింది. ముంబైలో లైసెన్సు ఉన్న అబార్షన్ కేంద్రాలన్నింటి నుంచి బీఎంసీ ప్రతియేటా సమాచారం సేకరిస్తుంది. 2013-14 సంవత్సరంలో 15 ఏళ్లలోపు బాలికలు 111 మంది అబార్షన్లు చేయించుకున్నారు. 2014-15 సంవత్సరంలో వీరి సంఖ్య 185కు పెరిగింది. 15-19 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్యలో కూడా 47 శాతం పెరుగుదల కనిపించింది. ప్రధానంగా అంధేరీ ఈస్ట్, అంధేరి వెస్ట్ ప్రాంతాల్లో ఎక్కువ అబార్షన్లు జరుగుతున్నాయి. సుమారు 6వేల కేసులు ఇక్కడే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ అంకెలు చూస్తే షాకింగ్‌గా ఉన్నాయని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ సుచిత్రా పండిట్ అన్నారు. అప్పుడే స్కూలు నుంచి బయటకు వచ్చిన పిల్లలు కూడా తమకు అబార్షన్లు చేయాలంటూ క్లినిక్‌లకు రావడం దారుణంగా అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది అమ్మాయిలైతే.. తమకు గర్భనిరోధక మందులు కావాలంటూ వస్తున్నారని ఆమె చెప్పారు.