పద్నాలుగు సంవత్సరాల వయసులో యాసిడ్ దాడికి గురైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేవాన్షీ యాదవ్. తాను బాధితురాలిగా ఉన్నప్పుడు ఒంటరి. ఇప్పుడు మాత్రం తానే ఒక సైన్యం. ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సోసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి న్యాయసహాయం అందించడం నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడం వరకు బాధితుల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న దేవాన్షి గురించి...
కష్టాలన్నీ కలిసికట్టుగా వచ్చాయా! అన్నట్లుగా దేవాన్షీ యాదవ్ నెలల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పద్నాలుగు సంవత్సరాల వయసులో కుటుంబ స్నేహితుడిగా భావించే ఒకడు లైంగిక వేధింపులకు, యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు మాత్రం దేవాన్షినే బోనులో నిలబెట్టారు. ‘మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా’ లాంటి మాటలు తనను ఎంతో బాధ పెట్టాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ పట్టణానికి చెందిన 31 సంవత్సరాల దేవాన్షి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి కష్టాలెన్నో కనిపిస్తాయి. అయితే వాటిని గుర్తు చేసుకుంటూ బాధను గుండెలో పెట్టుకోలేదు. తనలాంటి కష్టాలు వచ్చిన వారికి అండగా నిలబడాలనుకుంది. అలా మొదలైందే ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ. లైంగిక వేధింపులకు గురవుతున్న వారి నుంచి గృహహింస బాధితుల వరకు ఎంతోమందికి ఈ సంస్థ తరపున అండగా నిలబడింది దేవాన్షి.
‘ధైర్యసాహసాలలో మా అమ్మే నాకు స్ఫూర్తి. నాకు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. ఒకవైపు భర్త చనిపోయిన బాధ, మరోవైపు బిడ్డను ఎలా పోషించాలనే బాధ, అయోమయం ఆమెను చుట్టుముట్టాయి. ఆరోజు ఆమె ధైర్యం కోల్పోయి ఉంటే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. జీవితంలో ప్రతి సందర్భంలో ధైర్యంతో ముందుకు వెళ్లింది. తల్లిగా ప్రేమానురాగాలను పంచడమే కాదు ధైర్యం అనే విలువైన బహుమతిని ఇచ్చింది’ అంటుంది దేవాన్షి.
భారమైన జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి, శక్తిమంతం కావడానికి సామాజిక సేవా కార్యక్రమాలు దేవాన్షికి ఎంతో ఉపయోగపడ్డాయి. దేవాన్షి దగ్గరకు సహాయం కోసం వచ్చే బాధితుల్లో ఏ కోశానా ధైర్యం కనిపించదు. అలాంటి వారిలో ధైర్యం నింపడం అనేది తాను చేసే మొదటి పని. తనని కుటుంబ సభ్యురాలిగా భావించుకునేలా ఆత్మీయంగా ఉండడం రెండో పని. కౌన్సెలింగ్ ద్వారా వారికి భవిష్యత్ పట్ల ఆశ రేకెత్తించడం మూడోపని.
‘ఈ సమాజం నన్ను చిన్నచూపు చూస్తుంది. నాకు ఎవరూ అండగా లేరు’ అనుకున్న ఎంతోమందికి ‘నాకు ఎవరి అండా అక్కర్లేదు. ఒంటరిగా పోరాడగలను. నా కోసం నేను పోరాడలేనా!’ అనే ధైర్యాన్ని ఇచ్చింది. ‘ఇంకేముంది నా భవిష్యత్ బుగ్గిపాలు అయింది’ అని జీవనాసక్తి కోల్పోయిన వారిలో ‘కష్టాలు నీ ఒక్కరికే కాదు. అందరికీ వస్తాయి. అదిగో నీ భవిష్యత్’ అంటూ ఆశావాహ దృక్పథాన్ని కలిగించింది.
‘పదా... పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం’ అని దేవాన్షి అన్నప్పుడు... ‘అమ్మో! నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం’ అన్నది ఒక బాధితురాలు. ‘తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతున్నాడు. ఏ తప్పూ చేయని నువ్వెందుకు భయపడడం’ అని దేవాన్షి అనగానే ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు బయలు దేరింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో!
సంస్థ అడుగులు మొదలుపెట్టిన కొత్తలో... ‘మీవల్ల ఏమవుతుంది’ అన్నట్లుగా ఎంతోమంది వ్యంగ్యంగా మాట్లాడేవారు. వారికి తన పనితీరుతోనే సమాధానం ఇచ్చింది దేవాన్షి. ‘దేవాన్షీ చాలా పట్టుదల గల వ్యక్తి. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యదు. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నేను దేవాన్షి దగ్గరకు వచ్చాను. ఆమె నాకు ఆశ్రయం ఇచ్చింది. విషయం తెలుసుకున్న అత్తింటి వారు దేవాన్షిని బెదిరించడానికి వీధిరౌడీలను పంపించారు.
ఆమె ధైర్యాన్ని చూసి వారు తోక ముడవడానికి ఎంతో సమయం పట్టలేదు’ అంటుంది బరేలీకి చెందిన రత్న. బరేలీ పట్టణానికి చెందిన వారే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మహిళలు దేవాన్షి సహాయం కోసం రావడం ప్రారంభించారు. ‘మా దగ్గరకు వచ్చేవాళ్లలో 60 నుంచి 70 శాతం గృహహింస బాధితులే. వారికి అండగా నిలిచినప్పుడు సహజంగానే బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే నేను వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. మీకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? అనే ప్రశ్న అడుగుతుంటారు.
ఒకప్పుడు నేను మీలాగే భయపడేదాన్ని... అంటూ నాకు ఎదురైన చేదు అనుభవాలను వారితో పంచుకుంటాను. అమ్మ నుంచి ధైర్యం ఎలా పొందానో చెబుతాను. ధైర్యం అనేది ఒకరు దయతో ఇచ్చేది కాదు. అది అందరిలోనూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటున్నామా? లేదా? అనేదే ముఖ్యం అని చెబుతుంటాను’ అంటుంది దేవాన్షీ యాదవ్.
‘అత్తింటి బాధలు తట్టుకోలేక బయటికి వచ్చాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా బతకగలను’ అని దిక్కులు చూస్తున్న ఎంతోమందికి సంస్థ ద్వారా దిక్కు చూపించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుపడింది. ‘మంచిపని చేస్తే ఆ ఫలితం తాలూకు ఆనందమే కాదు అపారమైన శక్తి కూడా లభిస్తుంది. ఆ శక్తి మరిన్ని మంచిపనులు చేయడానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది’ అంటుంది దేవాన్షీ యాదవ్.
(చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!)
Comments
Please login to add a commentAdd a comment