మేనుకా పౌడెల్ - నేపాల్(జాపా)
'శక్తి లేదనిపిస్తుంది. ప్రయత్నించాలి. కాళ్లలో బలం లేదనిపిస్తుంది. కదలాలి. ఎవరూ తోడు నిలవడం లేదనిపిస్తుంది. ఒంటరిగా పోరాడాలి. లేదని ఓడేది మనిషే. ఉందని గెలిచేది మనిషే. మేనుకా పౌడెల్‌కు చూపు లేదు. నేపాల్ నుంచి ఇండియాకు పాటను నమ్ముకుని వచ్చింది. తన పాటతో ఎందరినో కదిలించింది. ఇండియన్ ఐడెల్ కంటెస్టెంట్‌గా ఎంపికై ఇప్పుడు ‘సలార్’లో పాడి దేశం మొత్తానికి వినపడుతోంది.' స్ఫూర్తిదాయకమైన ఈ గాయని గురించి..
‘ఓ పాలన్ హారే నిర్గుణ్ ఔర్ న్యారే తుమ్రె బిన్ హమ్రా కోనొ నహీ’... ‘లగాన్’లోని ఈ పాటను మేనుకా పౌడెల్ (25) పాడుతున్నప్పుడు, ఆ పాటలోని ఆర్తికి, అర్పణకి, ఆరాధనకి న్యాయ నిర్ణేతల్లో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడుస్తూనే ఉంది. మరో జడ్జి విశాల్ దద్లానీ పరిస్థితీ అంతే. ఇంకో జడ్జయిన ప్రముఖ గాయకుడు కుమార్ షాను ‘వహ్వా’లు కొడుతూనే ఉండిపోయాడు. కన్ను తెరిచినా, కన్ను మూసినా చీకటి తప్ప, గాఢాంధకారం తప్ప, ఓడించాలని చూసే నలుపు తప్ప మరేమీ ఎరగని ఆమె తన పాటతో దివ్వె వెలిగించింది. వెలుతురు చూస్తోంది. వెలుతురు చూపిస్తోంది.
నేపాల్‌కు చెందిన అంధురాలు మేనుకా పౌడెల్‌కు ఆడిషన్స్ రౌండ్‌లో గోల్డెన్ మైక్ దొరికింది. ఇండియన్ ఐడెల్ సీజన్ 14లో ఇంకా ఆమె టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ ఉంది. ముఖేష్ స్పెషల్‌లో ముఖేష్ తనయుడు నితిన్ ముఖేష్ సమక్షాన ‘ఏ ప్యార్ కా నగ్మా హై’ పాడితే ఆయన ఎంతో సంతోషించాడు. దర్శకుడు మహేశ్ భట్ సమక్షంలో ‘జఖ్మ్’ సినిమాలోని ‘గలి మే ఆజ్ చాంద్ నిక్‌లా’ పాటను పాడితే ఆయన స్పందిస్తూ ‘హృదయం దగ్గర ఒక కన్ను ఉంటుందని నువ్వు నిరూపించావు’ అన్నాడు.
వాద్యాలు చూడకుండా, పాటను అక్షరాల్లో చూడకుండా, అంత పెద్ద సెట్‌ను చూడకుండా, తన ఎదుట ఉన్న జడ్జిలు ఎలా ఉంటారో చూడకుండా మేనుకా పౌడెల్ ఎంతో నిబ్బరంతో పాటలు పాడటం వల్ల కోట్లమంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతకుముందు రియాల్టీ షోలలో కొంతమంది అంధులు పాడటానికి ప్రయత్నించారు కానీ ఇలా నిలువలేదు. మేనుకా పౌడెల్ గొంతులోని మాధుర్యం చివరకు ఆమెను‘సలార్’ లో పాడే వరకూ తీసుకెళ్లింది. ‘సలార్’ హిందీ వెర్షన్‌లోని ‘సూరజ్ హీ ఆజ్ తన్‌కే’ పాటను మేనుకా పౌడెల్ పాడింది. దీనివల్ల ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఒక భారీ సినిమాతో జరిగిందని చెప్పాలి. ఇదంతా ఆమె పాడాలి అనుకోవడం వల్ల. ఓడాలి అని అనుకోకపోవడం వల్ల.
నేపాల్ అమ్మాయి
మేనుకా పౌడెల్‌ది నేపాల్‌లోని జాపా. పుట్టుకతో చూపు లేకపోయినా తల్లిదండ్రులు ఆ లోటు తెలియనీకుండా పెంచారు. బాల్యం నుంచి గానం పట్ల ఆమె ఆసక్తిని ప్రోత్సహించారు. తండ్రి మలేసియాలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లగా ఇంటి బాధ్యత ఇప్పుడు మేనుక మీదే ఉంది. ముంబైలోని సురేష్ వాడ్‌కర్ అకాడెమీలో కొన్నాళ్లు పాడటం నేర్చుకున్న మేనుక గాయనిగా తన ప్రతిభను చాటేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. సాయిబాబా భజనలు పాడుతూ ఉపాధి పొందింది. ‘సాయిబాబా నా కుటుంబ సభ్యుడు’ అని చెప్పుకుంటుంది. బహుశా ఆ సాయి దయ వల్లే ఆమెకు ఇప్పుడు గొప్ప గుర్తింపు లభించింది. ఆమె పాటను మీరు ఇండియన్ ఐడల్‌లో వినచ్చు.
Comments
Please login to add a commentAdd a comment