టీనేజి బాలికల్లో పెరుగుతున్న అబార్షన్లు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో టీనేజి బాలికల అబార్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2014-15 సంవత్సరంలో అంతకుముందు కంటే ఇది ఏకంగా 67 శాతం పెరిగిందట. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం సుమారు 31 వేల మంది మహిళలు అబార్షన్ చేయించుకోడానికి రాగా, వాళ్లలో 1600 మంది 19 ఏళ్ల లోపువారేనని తేలింది. ముంబైలో లైసెన్సు ఉన్న అబార్షన్ కేంద్రాలన్నింటి నుంచి బీఎంసీ ప్రతియేటా సమాచారం సేకరిస్తుంది.
2013-14 సంవత్సరంలో 15 ఏళ్లలోపు బాలికలు 111 మంది అబార్షన్లు చేయించుకున్నారు. 2014-15 సంవత్సరంలో వీరి సంఖ్య 185కు పెరిగింది. 15-19 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్యలో కూడా 47 శాతం పెరుగుదల కనిపించింది. ప్రధానంగా అంధేరీ ఈస్ట్, అంధేరి వెస్ట్ ప్రాంతాల్లో ఎక్కువ అబార్షన్లు జరుగుతున్నాయి. సుమారు 6వేల కేసులు ఇక్కడే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ అంకెలు చూస్తే షాకింగ్గా ఉన్నాయని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ సుచిత్రా పండిట్ అన్నారు. అప్పుడే స్కూలు నుంచి బయటకు వచ్చిన పిల్లలు కూడా తమకు అబార్షన్లు చేయాలంటూ క్లినిక్లకు రావడం దారుణంగా అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది అమ్మాయిలైతే.. తమకు గర్భనిరోధక మందులు కావాలంటూ వస్తున్నారని ఆమె చెప్పారు.