మహాత్ముడి విజయానికి అదే మార్గం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సాంకేతికతను సాధనంగా మలచుకొని న్యాయానికి బాటలు వేయాలి
పేదలకూ న్యాయం అందించడానికికృషి చేయాలి... సామాజిక న్యాయ సాధనకు మీరే ఏజెంట్లు
‘నల్సార్’స్నాతకోత్సవంలో యువతకు పిలుపునిచ్చిన రాష్ట్రపతి
పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్,సీఎం రేవంత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహా, సీజే జస్టిస్ అలోక్ అరాధే
సాక్షి, హైదరాబాద్: న్యాయానికి సత్యం, కరుణ జోడించినప్పుడే అసలైన విజయం సాధించినట్లని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. ఈ ఆయుధంతోనే మహాత్మా గాంధీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వేచ్ఛ ప్రసాదించారని చెప్పారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే ఆదర్శమని రాజ్యాంగం చెబుతోందన్నారు. సాంకేతికతను సాధనంగా మలచుకుని సత్వర న్యాయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
మానవ శ్రేయస్సు కోసం జంతువులు, పక్షులూ అవసరమని, వాటి సంరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. నీటి వనరులను కూడా కాపాడాల్సిన అవసరం ఉందని, యువతరం దీని కోసం పాటుపడాలని ఆకాంక్షించారు. శనివారం శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ అలోక్ అరాధే హాజరయ్యారు.
మంత్రిగా పని చేసిన రోజులు గుర్తొచ్చాయి...
‘నల్సార్‌లో యానిమల్ లా సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఆనందదాయకం. ఇది 25 ఏళ్ల క్రితం ఒడిశా మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన నాటి సంగతిని గుర్తు చేసింది. జంతువుల రక్షణ, సంక్షేమం కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రయత్నాలు జరగాలి. ఆ దిశగా నల్సార్ ముందడుగు వేసింది. కృత్రిమ మేధ, సాంకేతికత న్యాయవ్యవస్థను ప్రభావితం చేయనుంది. ఆ మార్పులను ఎదుర్కొనేందుకు యువ న్యాయవాదులు సిద్ధంగా ఉండాలి.
వృత్తిలో రాణించడానికి, సామాజిక న్యాయం పెంపొందించడానికి సాంకేతికతను సాధనంగా మలచుకోవాలి. మన న్యాయ వ్యవస్థ ఈ నాటిది కాదు. చంద్రగుప్తుడు, చాణక్యుల సమయం నుంచే న్యాయాధికారులు ఉన్నారు. ఒకే వ్యక్తి ఉండకుండా ముగ్గురితో బెంచ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. కేసులు పరిష్కారమయ్యే వరకు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య వ్యక్తిగత భేటీకి అనుమతి ఉండేది కాదు. నిష్పక్షపాత న్యాయ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు’అని ముర్ము పేర్కొన్నారు.
పేదవాడికి న్యాయం అందడంలేదు
‘దేశానికి న్యాయం కోసం మహాత్మాగాంధీ న్యాయవాద వృత్తి వదులుకున్నారు. అయినా సత్యాగ్రహం, దోపిడీకి గురైన రైతులకు న్యాయం చేయడం కోసం ఓ న్యాయవాదిలా అడుగులు వేశారు. ఆర్థిక, ఇతర ఏ వైఫల్యాల కారణంగా ఏ పౌరుడికీ న్యాయం నిరాకరించకూడదు. దురదృష్టవశాత్తు ధనవంతుడికి లభించే న్యాయం పేదవాడికి అందడం లేదు. అట్టడుగు వర్గాలకు న్యాయం అందించడంపై యువ న్యాయవాదులు దృష్టి సారించాలి.
సామాజిక న్యాయ సాధనకు మీరే ఏజెంట్లు. న్యాయ నిపుణులుగా మీరు ఏ రంగం ఎన్నుకున్నా విలువలకు కట్టుబడండి. శక్తికి నిజం తోడైతే మరింత శక్తివంతమవుతారు. ఇక్కడ పతకాలు పొందిన వారిలో బాలికలు ఎక్కువగా ఉన్నా.. డిగ్రీలు పొందిన వారిలో తక్కువగా ఉన్నారు. ఇది మారాలి. మహిళా సాధికారతకు న్యాయవాదులు కృషి చేయాలి. జువెనైల్ జస్టిస్, న్యాయ సాయం, వైకల్యమున్న వారిపై శ్రద్ధ వహించడంలో నల్సార్ కృషి అభినందనీయం’అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు.
అనంతరం న్యాయ విద్య పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాలు, వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 592 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, రిజి్రస్టార్ విద్యుల్లత, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment