మయూర్‌భంజ్ నుంచి రాష్ట్రపతి కుమార్తె!
బీజేడీ టికెట్ కోసం పోటీపడుతున్నపద్మిణీ, చంద్రశేఖర్
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఏ క్షణంలోనైనా జాబితా వెలువడుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఈసారి తన అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బిశ్వేశ్వర్ టుడుని బీజేపీ ఈసారి బరిలోకి దింపే అవకాశం లేనట్లు సమాచారం. మళ్లీ నామినేట్ చేసే అవకాశం లేదు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల ఇతిశ్రీని పోటీకి దింపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నేతలు ఈ విషయమై గుంభనం ప్రదర్శిస్తున్నారు. ఇతిశ్రీ తన తల్లి ద్రౌపది ముర్ము అత్యున్నత పదవిని చేపట్టినప్పటి నుంచి తరచూ ఒడిశా పర్యటనలు చేస్తున్నారు. తల్లి పరపతి, పలుకుబడి కుమార్తె అభ్యర్థిత్వానికి పట్టం గట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఎన్నికల పోరులో ఇతిశ్రీ ఆరంగేట్రం చేయడం రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఓటర్లకు ప్రత్యేక సందేశం ఇస్తుందని భావిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో గిరిజన వర్గం ఓటర్లు 22 శాతానికి పైబడి ఉన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత ఒడిశాలో గిరిజనుల జనాభా అధికంగా ఉంది. ద్రౌపది ముర్ముకు సర్వోన్నత రాష్ట్రపతి పట్టం గట్టడం ద్వారా గిరిజనుల సాధికారత పట్ల బీజేపీ ఇప్పటికే తన నిబద్ధతను ప్రదర్శించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బిశ్వేశ్వర్ టుడు 25,256 ఓట్ల ఆధిక్యతతో బిజూ జనతా దళ్ (బీజేడీ) అభ్యర్థి దేబాషిస్ మరాండిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
జయపురం: అధికార బీజేడీ తరఫున పోటీచేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎలాగైనా టికెట్ పొందేందుకు పైరవీ ప్రారంభించారు. జయపురం సబ్ డివిజన్‌లో ఎస్టీలకు కేటాయించి కొట్‌పాడ్ నియోజకవర్గంలో అధికార బీజేడీ తరఫున టికెట్ పొందేందుకు సిటింగ్ ఎమ్మెల్యే పద్మిణీ ధియాన్, మాజీ ఎమ్మెల్యే, జిల్లా స్వతంత్ర పరిషత్ అధ్యక్షుడు చంద్రశేఖర మఝి పోటీపడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేడీ తరఫున పోటీలోకి దిగిన పద్మిణీ దియాన్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర మఝిపై 2631 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
సీఎం నవీన్ పట్నాయక్ మంత్రి మండలిలో కొలువు సాధించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కొట్‌పాడ్‌లో ఆమె విజయం సాధించడం వల్లే ఆమెను మంత్రి పదవి వరించినట్లు పరిశీలకులు చెబుతారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి 31,321 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన చంద్రశేఖర మఝి.. 2019లో కేవలం 2631 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేడీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో బీజేడీ తరఫున టికెట్ ఇస్తామనే హామీ ఉండటం వల్లే పార్టీలో చేరినట్లు కొందరి మాట. తన మాదిరిగానే కాంగ్రెస్‌ను వీడి బీజేడీలో చేరిన మాజీ ఎంపీ ప్రదీప్ మఝిఎంపీ టికెట్ ఇస్తారని, ఈసారి సిటింగ్ ఎంపీ రమేష్ మఝి మొండిచెయ్యి తప్పదనే ప్రచారం జరగుతోంది. అయితే సిటింగ్ ఎమ్మెల్యే అయిన తనకే కచ్చితంగా టికెట్ వస్తుందని పద్మిణీ దియాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిలో టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment