ఢిల్లీ: మణిపూర్ అంశంపై తనతో చర్చించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ ఇచ్చారు. బుధవారం ఉదయం విపక్ష ఎంపీలతో భేటీ కానున్నారు. మణిపూర్ అంశంపై జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే అక్కడ పర్యటించాలని వాళ్లు ఆమెను కోరే అవకాశాలూ లేకపోలేదు.
మణిపూర్ వ్యవహారంపై తమ ఆందోళనను పట్టించుకోవాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఉదయం 11.30 సమయంలో తనను కలవాలని ఆమె వాళ్లకు సూచించారు.
ఇండియా కూటమిలో 21 పార్టీల ఎంపీలు రెండురోజులపాటు మణిపూర్‌లో పర్యటించారు. అల్లర్లు-హింసకు నెలవైన కొండాలోయ ప్రాంతాల్లో తిరిగి.. అక్కడి బాధితులను కలిశారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణ టైంలో మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికీని కలిసి శాంతి భద్రతలను తిరిగి నెలకొనేలా చూడాలంటూ మెమొరాండం సమర్పించారు కూడా.
ఈ క్రమంలో ఇండియా కూటమి ఎంపీల మణిపూర్ పర్యటనపైనా బీజేపీ మండిపడింది. ఇటు పార్లమెంట్ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తూ.. డ్రామాలు ఆడుతోందంటూ ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో పార్లమెంట్‌లో మణిపూర్ హింసపై సుదీర్ఘ చర్చ జరగాలని.. ప్రధాని ప్రసంగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభను సజావుగా జరగనివ్వకుండా నినాదాలతో హెరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ అంశంపైనా అవిశ్వాసం ప్రకటించగా.. 8,9 తేదీల్లో చర్చ జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment