గ్రామ స్వరాజ్యం నుంచి సమసమాజం వరకు.. | Paint Artist Venkat Made Abstract Painting On YS Jagan Political Life, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

CM Jagan Abstract Painting: గ్రామ స్వరాజ్యం నుంచి సమసమాజం వరకు..

Published Sun, May 12 2024 9:48 AM | Last Updated on Sun, May 12 2024 2:00 PM

Abstract painting On YS Jagan Political life

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత, రాజకీయ జీవితం, పాలనపై ఆబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌

జననేత జీవితాన్ని ఆవిష్కరించిన చిత్రరాజం

రెండు నెలలపాటు శ్రమించి రూపొందించిన ప్రముఖ చిత్రకారుడు కందునూరి వెంకటేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తూ మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట కొమ్ములవంచకు చెందిన ప్రముఖ చిత్ర కారుడు కందునూరి వెంకటేశ్‌ గీసిన ఆబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. వైఎస్‌ జగన్‌ బాల్యం, విద్యా భ్యాసం మొదలు వివాహం, వ్యాపారం, రాజకీయ ప్రస్థానం దాకా... తండ్రి వైఎస్సార్‌ అకాల మరణం మొదలుకొని నాటి ప్రభుత్వం అక్రమ కేసులు మోపడం, ఓదార్పు యాత్ర, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపన, సీఎంగా ఏపీని అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు వరకు అనేక అంశాలను ఒకే చిత్రంలో వెంకటేశ్‌ ఆవిష్కరించారు.

జగన్‌ పాలనను చిత్రిక పట్టి..
ఐదున్నర అడుగుల పొడవు, ఐదున్నర అడుగుల వెడల్పు  ఉండే కాన్వాస్‌పై సుమారు 2 నెలలపాటు ఆయిల్‌ కలర్స్‌తో ఈ ఆబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌కు వెంకటేశ్‌ ప్రాణప్రతిష్ట చేశారు. ‘ధర్మాన్ని ఆచరించేవాళ్లు భయాన్ని ఎరుగరు. ధర్మమే ధైర్యంగా జగన్‌ పరిపాలిస్తున్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల ఆశయాలను, కలలను సాకారం చేసిన జననేత స్ఫూర్తి దాయక జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఆబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ గీయడం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తా’ అని వెంకటేశ్‌ చెప్పారు. గ్రామ స్వరాజ్యం నుంచి సమసమాజం దిశగా రాష్ట్రాన్ని నడిపించడమే ధ్యేయంగా సాగుతున్న వైఎస్‌ జగన్‌ పరిపాలనకు చిత్రిక పట్టినట్లు చెప్పారు.

సచివాలయ పల్లకీ.. సంక్షేమ బోయలు
‘రాజకీయ రంగంలో మాట తప్పడం, మడమ తిప్పడం సహజంగా కనిస్తాయి. కానీ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ ఫలాలను సామాన్యుల దరికి చేర్చారు. అందుకే ఈ చిత్రంలో గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా సచివాల యం అనే పల్లకీని మోసేందుకు సంక్షేమ పథకాల బోయలను ఏర్పాటు చేశా. ఈ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరుస్తున్న వాలంటీర్లను పథకాలకు కాపలాగా ఉన్న సైనికుడికి ప్రతీకగా పెట్టా. గాంధీ మహాత్ముడి అడుగు జాడల్లో నడుస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశించినట్లుగా సమసమాజం దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు’ అని వెంకటేశ్‌ చెప్పారు.


అణగారిన వర్గాల అభ్యున్నతికి జగన్‌ అందిస్తున్న పథకాల స్ఫూర్తితో..
‘వై.ఎస్‌. జగన్‌ జీవితాన్ని ఆవిష్కరిస్తూ గీసిన చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని. ముఖ్యమంత్రిగా జగన్‌ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలు నేను ఈ చిత్రం గీసేందుకు స్ఫూర్తినిచ్చాయి.’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిస్ట్‌ వెంకటేశ్‌ జేఎన్‌టీయూలో ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొదలుకొని వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల చిత్రాలను గీశారు. అగ్ర హీరోలు అమితాబచ్చన్, రజనీ కాంత్, ప్రభాస్‌ వంటి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌లో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు.  

పగిడిపాల ఆంజనేయులు

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement