సీజేఐగా జస్టిస్‌ ఖన్నా బాధ్యతల స్వీకరణ | sanjeev khanna takes oath as cji of india | Sakshi
Sakshi News home page

సీజేఐగా జస్టిస్‌ ఖన్నా బాధ్యతల స్వీకరణ

Published Mon, Nov 11 2024 10:05 AM | Last Updated on Tue, Nov 12 2024 5:10 AM

sanjeev khanna takes oath as cji of india

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం 

రాష్ట్రపతి భవన్‌లో ముర్ము చేతుల మీదుగా కార్యక్రమం 

ఉపరాష్ట్రపతి, ప్రధాని, మాజీ సీజేఐలు తదితరుల హాజరు 

మే 13 దాకా సీజేఐగా కొనసాగనున్న జస్టిస్‌ ఖన్నా

సాక్షి, న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆంగ్లంలో దైవసాక్షిగా ఆయన పదవీస్వీకార ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ,           కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్, మాజీ సీజేఐలు జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం వారంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఈ మేరకు ఎక్స్‌లో కూడా పోస్టు చేశారు. సీజేఐగా ఆదివారం రిటైరైన జస్టిస్‌ చంద్రచూడ్‌ స్థానంలో జస్టిస్‌ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 183 రోజుల పాటు పదవిలో కొనసాగుతారు. 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. అయితే కృష్ణమీనన్‌ మార్గ్‌లోని సీజేఐ అధికారిక నివాసంలోకి మారకూడదని జస్టిస్‌ ఖన్నా నిర్ణయించుకున్నారు. పదవీ కాలం తక్కువగా ఉండడంతో ప్రస్తుత నివాసంలోనే కొనసాగనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు  ఖర్గే ఆయనకు శుభాకాంక్షలు    తెలిపారు.

కీలక తీర్పుల్లో భాగస్వామి 
జస్టిస్‌ ఖన్నా 1960 మే 14న న్యాయమూర్తుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి దేవ్‌రాజ్‌ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రాథమిక హక్కులపై ఆయన పెదనాన్న జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా ఇచ్చిన తీర్పు భారత న్యాయ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది! తండ్రి తనను అకౌంటెంట్‌గా చూడాలనుకున్నా జస్టిస్‌ ఖన్నా న్యాయవాద వృత్తికేసి మొగ్గుచూపేందుకు పెదనాన్న స్ఫూర్తే కారణమంటారు. ఆయన 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. ఈ ఆరేళ్లలో 117 తీర్పులిచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. 

తొలి రోజే 45 కేసుల విచారణ! 
సీజేఐగా తొలి రోజే జస్టిస్‌ ఖన్నా 45 కేసులను విచారించారు. న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తానని జస్టిస్‌ ఖన్నా పేర్కొన్నారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించే అవకాశం దక్కడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘న్యాయ వ్యవస్థ పాలన యంత్రాంగంలో అంతర్భాగమే. అయినా అది స్వతంత్ర వ్యవస్థ. రాజ్యాంగానికి కాపలాదారుగా, ప్రాథమిక హక్కుల పరిరక్షకురాలిగా న్యాయ వ్యవస్థ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేలా చూసేందుకు కృషి చేస్తా’’ అని తెలిపారు. న్యాయ వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.

పెదనాన్న కోర్టు గదిలోనే... 
జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా న్యాయమూర్తిగా తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టులోని రెండో నంబర్‌ గదిలో ఆయన నిలువెత్తు చిత్రపటం ఇప్పటికీ సమున్నతంగా వేలాడుతూ ఉంటుంది. సోమవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కూడా సీజేఐగా తన తొలి రోజు కేసుల విచారణను అదే గదిలో చేపట్టడం విశేషం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన కెరీర్‌ మొదలైంది కూడా ఇదే కోర్టు గదిలో! సీజేఐగా ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలని మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ తదితర న్యాయవాదులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విచారణకు కేసుల సీక్వెన్సింగ్‌కు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు బార్‌ నేత ఒకరు లేవనెత్తగా ఆ అంశం తన దృష్టిలో ఉందని, దాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. లెటర్‌ ఆఫ్‌ సర్క్యలేషన్‌ ద్వారా కూడా వాయిదాలు కోరే విధానాన్ని పునరుద్ధరించాలన్న ఒక లాయర్‌ విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు నూతన సీజేఐ పేర్కొన్నారు. 
 


 

పెదనాన్నకు ఇందిర  నిరాకరించిన పీఠంపై... 
అది 1976. ఎమర్జెన్సీ రోజులు. సుప్రీంకోర్టు సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా హరిద్వార్‌లో గంగా తీరాన సోదరితో కలిసి సేదదీరుతున్నారు. ‘‘నేనో తీర్పు ఇవ్వబోతున్నా. దానివల్ల బహుశా నాకు సీజేఐ పదవి చేజారవచ్చు’’ అని ఆమెతో అన్నారు. సరిగ్గా అలాగే జరిగింది. ప్రధాని ఇందిరాగాంధీ సిఫార్సు మేరకు పౌరుల ప్రాథమిక హక్కులను సస్పెండ్‌ చేస్తూ నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ఉత్తరు్వలిచ్చారు. వాటిని పలు రాష్ట్రాల హైకోర్టులు కొట్టేశాయి. ఆ తీర్పులను ఇందిర సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

 అది పౌరుల హక్కులకు సంబంధించి కీలక ప్రశ్నలు లేవనెత్తిన ఏడీఎం జబల్‌పూర్‌ వర్సెస్‌ శివకాంత్‌ శుక్లా కేసుగా చరిత్రలో నిలిచిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సమర్థిస్తూ సీజేఐ ఏఎన్‌ రే సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4–1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. జస్టిస్‌ ఖన్నా ఒక్కరే దానితో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలోనైనా సరే, ప్రాథమిక హక్కులను నిషేధించే అధికారం కేంద్రానికి లేదంటూ మైనారిటీ తీర్పు వెలువరించారు. ఇది భారత న్యాయ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. 

ప్రాథమిక హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును అనివార్యంగా ఉటంకిస్తారు. అప్పట్లో విదేశీ మీడియా కూడా జస్టిస్‌ ఖన్నా తీర్పును ఎంతగానో కొనియాడింది. అత్యంత నిర్భీతితో కూడిన తీర్పులిచ్చిన భారత న్యాయమూర్తుల్లో అగ్రగణ్యులుగా జస్టిస్‌ ఖన్నా నిలిచిపోయారు. దీనిపై ఆగ్రహించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తి అయిన ఆయన్ను కాదని జస్టిస్‌ హమీదుల్లా బేగ్‌ను 15వ సీజేఐగా ఎంపిక చేశారంటారు. అందుకు నిరసనగా అదే రోజున న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అరుదైన వ్యక్తిత్వం జస్టిస్‌ ఖన్నాది. 

అలా 48 ఏళ్ల క్రితం చేజారిన అత్యున్నత న్యాయ పీఠం తాజాగా ఆయన కుమారుని వరసయ్యే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు దక్కింది. ఈ ఉదంతంపై చర్చోపచర్చలతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. దీన్ని ప్రకృతి చేసిన న్యాయంగా నెటిజన్లు అభివరి్ణస్తున్నారు. జబల్‌పూర్‌ కేసులో మెజారిటీ తీర్పు వెలువరించిన నలుగురు న్యాయమూర్తుల్లో తాజా మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్‌ తండ్రి జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ కూడా ఉండటం విశేషం. ఆయన జస్టిస్‌ బేగ్‌ అనంతరం 16వ సీజేఐ అయ్యారు. ఇక జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా ఎమర్జెన్సీ అనంతరం లా కమిషన్‌ చైర్మన్‌గా సేవలందించారు. అనంతరం చరణ్‌సింగ్‌ మంత్రివర్గంలో కేంద్ర న్యాయ మంత్రిగా నియమితులైనా మూడు రోజులకే రాజీనామా చేశారు. 1982లో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసి జైల్‌సింగ్‌ చేతిలో ఓడిపోయారు. 

చదవండి:  ట్రంప్‌ విజయంపై భారత్‌ ఆందోళన?.. జైశంకర్‌ రిప్లై ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement