ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పరేడ్
ఢిల్లీ పర్యటనపై కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ భేటీ
కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు ఎండగట్టాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పార్టీ బీ–ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్‌ఎస్ జాతీయస్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లనుంది.
ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాల్లో పురోగతితోపాటు, పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలను ఇద్దరు నేతలు కేసీఆర్‌తో చర్చించినట్టు సమాచారం.
ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని..
ఇప్పటివరకు ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, వారిపై అనర్హత వేటు వేయా లని అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్‌ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడాన్ని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించింది. గతంలో సుప్రీంకోర్టులో వివిధ పార్టీల తరపున ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం వాదించిన న్యాయవాదులతో ఢిల్లీలో సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది.
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ అడగాలని..
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్‌గాంధీ మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శిస్తున్న బీఆర్‌ఎస్ ఈ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ అడగాలని బుధవారం కేసీఆర్‌తో జరిగిన భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment