
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్‌లు సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి అధికారాలు కట్టబెట్టిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసు బిల్లు చట్టంగా మారింది. ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వివాదాస్పద బిల్లులైన ఢిల్లీ సర్వీసు బిల్లు, డిజిటల్ డేటా బిల్లుల్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఆమోదించారు. వీటితో పాటు జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు , జన విశ్వాస్ (సవరణ) బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశారు.
వీటిలో ఢిల్లీ పాలనాధికారాల బిల్లు (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు), డిజిటల్ డేటా (డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు) బిల్లులపై పార్లమెంటులో విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నీ కేంద్రానికే కట్టబెడుతూ ఆర్డినెన్స్ తెచ్చింది.
దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుని మొదట లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించాయి. ఇప్పుడు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అదే విధంగా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లులో విపక్ష పార్టీలు కొన్ని సవరణలు సూచించినా ప్రభుత్వం చేపట్టలేదు. బిల్లులో కేంద్ర ప్రభుత్వం సహా కొందరికి మినహాయింపులు ఇవ్వడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment