Birth and death registration
-
ఢిల్లీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్‌లు సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి అధికారాలు కట్టబెట్టిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసు బిల్లు చట్టంగా మారింది. ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వివాదాస్పద బిల్లులైన ఢిల్లీ సర్వీసు బిల్లు, డిజిటల్ డేటా బిల్లుల్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఆమోదించారు. వీటితో పాటు జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు , జన విశ్వాస్ (సవరణ) బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశారు. వీటిలో ఢిల్లీ పాలనాధికారాల బిల్లు (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు), డిజిటల్ డేటా (డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు) బిల్లులపై పార్లమెంటులో విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నీ కేంద్రానికే కట్టబెడుతూ ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుని మొదట లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించాయి. ఇప్పుడు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అదే విధంగా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లులో విపక్ష పార్టీలు కొన్ని సవరణలు సూచించినా ప్రభుత్వం చేపట్టలేదు. బిల్లులో కేంద్ర ప్రభుత్వం సహా కొందరికి మినహాయింపులు ఇవ్వడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. -
జనన, మరణ నమోదులోనూ ‘ట్రాన్స్‌జెండర్’
మూడో కాలం ఏర్పాటుకు ఉత్తర్వులు హైదరాబాద్: జనన, మరణ నమోదు పత్రాల్లో పురుషులు, స్త్రీలతోపాటు కొత్తగా ఇతరులు అనే మూడో విభాగం (కాలం) చేరనుంది. ఓటర్ల జాబితాలో పురుషులు, స్త్రీలు అనే విభాగాలు మాత్రమే ఉండగా కొంత కాలం కిందటే ఇతరులు (ట్రాన్స్‌జెండర్) అనే కొత్త విభాగం నమోదు కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆరంభించిన విషయం విదితమే. ఇదే తరహాలో ఇక నుంచి జనన, మరణాల రికార్డుల్లో పురుషులు/ స్త్రీలు/ ఇతరులు అనే కాలాలను ముద్రించి నమోదు చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు జనన, మరణాల నమోదు, సర్టిఫికెట్ల జారీకి ఉన్న దరఖాస్తు నమూనాలను మార్చాలంటూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జనన మరణ నమోదు పత్రాల్లో లింగం అనే కాలానికి ఎదురుగా రెండు గడులు మాత్రమే ఉన్నాయి. పురుషులైతే ఒకటో కాలంలో స్త్రీలైతే రెండో కాలంలో అధికారులు టిక్ పెట్టే విధానం ప్రస్తుతం ఉంది. ఇతరులు అయితే ఏ విభాగం కింద చేర్చాలో తెలియని పరిస్థితి ఉంది. అందువల్ల లింగానికి ఎదురుగా మూడో కాలం కూడా ముద్రించి ట్రాన్స్‌జెండర్స్‌ను ఇతరులు కింద నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు భారత ప్రభుత్వ రిజిసాట్రరు జనరల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జనన, మరణాల నమోదు పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రాలు (ఫారం 5), మరణ ధ్రువీకరణ పత్రాలు (ఫారం -6)లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు జనన మరణాల ప్రధాన ముఖ్య రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. -
జనన, మరణ నమోదులో జిల్లా వెనుకంజ
అద్దంకి: జనన మరణ నమోదు విషయంలో జిల్లా వెనుకబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ గుంటూరు కార్యాలయ డిప్యూటీ డైరక్టరు కే శివశంకర్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లాలో జనన మరణనమోదు ప్రక్రియ 90 శాతం పూర్తైదని చెప్పారు. ఇక్కడ మాత్రం రెండేళ్లుగా ఆగిపోయిందని తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏడు మండలాల స్థాయి పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ ఎంలు, మునిసిపల్ సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 2013కు సంతమాగులూరు, అద్దంకి మండలాల లె క్కలు మాత్రమే అందాయని తెలిపారు. జనన, మరణ వివరాలు నమోదు చేసి ఆ రికార్డులను ఉన్నతాధికారులకు పంపకుంటే ఉపయోగం లేదని చెప్పారు. దీనివల్ల భారీ తేడాలు వస్తాయన్నారు. భారత ప్రభుత్వ జనన, మరణ చట్టం- 1970 ప్రకారం నెలలోగా ఉచితంగా ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలన్నారు. కుదరకుంటే శాశ్వత చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలని చెప్పారు. ఇవి విదేశాల్లోనూ చెల్లుబాటవుతాయని చెప్పారు. ఎలాంటి సెక్షన్ ప్రకారం మంజూరు చేశారో ఆ సెక్షన్‌ను ఉదహరిస్తూ నోటీసు ఇవ్వాలని చెప్పారు. కొన్ని సార్లు ధ్రువీకరణ పత్రంపై ఆధారపడి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి, ఉన్నత ఉద్యోగాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. జనన , మరణ నమోదు ఫైలును ప్రతి నెలా ఐదో తేదీ లోగా సంబంధిత అధికారులకు పంపాలని సూచించారు. జీఓ నంబరు 161 ఉంది.. 2000 జనవరి ఒకటో తేదీకి ముందు జరిగిన జనన, మరణ నమోదు రిజిస్టరు కార్యాలయంలో నమోదై.. బిడ్డ పేరును 15 సంవత్సరాల వయసు వచ్చే లోపుగా నమోదు చేయించుకోని వారు.. తిరిగి నమోదు చేసుకొనేలా జీఓ నంబరు 161 ద్వారా అవకాశం కల్పించామని డీడీ శివశంకరు బాబు తెలిపారు. జిల్లా స్టాటిటికల్ అధికారి శ్రీధర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో టీ వెంకటేశ్వర్లు, ఎంపీహెచ్‌ఈవో ఏ నాగేశ్వరరావు, అద్దంకి, పంగులూరు, సంతమాగులూరు, మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ, కొరిశపాడు, జే పంగులూరు మండలాల సిబ్బంది పాల్గొన్నారు.