జనన, మరణ నమోదులోనూ ‘ట్రాన్స్‌జెండర్’
మూడో కాలం ఏర్పాటుకు ఉత్తర్వులు
హైదరాబాద్: జనన, మరణ నమోదు పత్రాల్లో పురుషులు, స్త్రీలతోపాటు కొత్తగా ఇతరులు అనే మూడో విభాగం (కాలం) చేరనుంది. ఓటర్ల జాబితాలో పురుషులు, స్త్రీలు అనే విభాగాలు మాత్రమే ఉండగా కొంత కాలం కిందటే ఇతరులు (ట్రాన్స్‌జెండర్) అనే కొత్త విభాగం నమోదు కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆరంభించిన విషయం విదితమే. ఇదే తరహాలో ఇక నుంచి జనన, మరణాల రికార్డుల్లో పురుషులు/ స్త్రీలు/ ఇతరులు అనే కాలాలను ముద్రించి నమోదు చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు జనన, మరణాల నమోదు, సర్టిఫికెట్ల జారీకి ఉన్న దరఖాస్తు నమూనాలను మార్చాలంటూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జనన మరణ నమోదు పత్రాల్లో లింగం అనే కాలానికి ఎదురుగా రెండు గడులు మాత్రమే ఉన్నాయి.
పురుషులైతే ఒకటో కాలంలో స్త్రీలైతే రెండో కాలంలో అధికారులు టిక్ పెట్టే విధానం ప్రస్తుతం ఉంది. ఇతరులు అయితే ఏ విభాగం కింద చేర్చాలో తెలియని పరిస్థితి ఉంది. అందువల్ల లింగానికి ఎదురుగా మూడో కాలం కూడా ముద్రించి ట్రాన్స్‌జెండర్స్‌ను ఇతరులు కింద నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు భారత ప్రభుత్వ రిజిసాట్రరు జనరల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జనన, మరణాల నమోదు పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రాలు (ఫారం 5), మరణ ధ్రువీకరణ పత్రాలు (ఫారం -6)లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు జనన మరణాల ప్రధాన ముఖ్య రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.