governance rule
-
Delhi liquor scam: ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన
న్యూఢిల్లీ: జైలులో ఉన్నా, బయట ఉన్నా ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని చెప్పిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ దిశగా తొలి ఉత్తర్వు జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నుంచి శనివారం రాత్రి ఆదేశాలు అందాయని ఢిల్లీ నీటి మంత్రి అతీషి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ పంపించిన నోట్‌ను చూసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. అరెస్టై ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల బాగు కోసం ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తగినన్ని వాటర్ ట్యాంకర్లు పంపించాలంటూ కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కొన్నారు. వేసవి ఎండలు ముదురుతుండడంతో నీటి సరఫరాను మెరుగుపర్చాలని చెప్పారని అన్నారు. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీతోపాటు సంబంధిత అధికారులకు సీఎం ఈడీ కస్టడీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయం తీసుకోవాలని సూచించారని మంత్రి అతీషి చెప్పారు. కస్టడీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ జారీ చేసిన ఉత్తర్వుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించింది. ఈ ఉత్తర్వు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ పీఎంఎల్ఏ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌కు అనుగుణంగా ఉందా? లేదా? అనేది పరిశీలించనున్నట్లు ఈడీ అధికార వర్గాలు ఆదివారం తెలియజేశాయి. -
పెట్టుబడులు తిరిగివ్వాలని స్టార్టప్‌లు భావించడం లేదు
న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి తీసుకున్న పెట్టుబడులను తిరిగి ఇచ్చేయడం తమ బాధ్యతని అంకుర సంస్థల వ్యవస్థాపకులు భావించడం లేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్‌లలో గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్లు పడిపోతుండటం మొదలైన వాటన్నింటికీ ఇదే కారణమని వారు చెబుతున్నారు. బైజూస్, భారత్‌పే వంటి టాప్ స్టార్టప్స్ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలువురు మదుపుదారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘వ్యవస్థాపకులు తాము తీసుకున్న పెట్టుబడులను బాధ్యతగా తిరిగి ఇచ్చేయాలని భావించకపోతుండటమే కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్ల పతనానికి దారి తీస్తోంది‘ అని 100ఎక్స్డాట్వీసీ వ్యవస్థాపకుడు యజ్ఞేష్ సంఘ్రాజ్కా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల సమస్యలు చాలా కాలంగా ఉన్నవేనని, ఇవి స్టార్టప్‌లకే పరిమితం కాకుండా సాధారణంగా లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లోనూ కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, లాభాలు, వృద్ధిపై అత్యుత్సాహం చూపించే క్రమంలో స్టార్టప్‌లు కీలకమైన గవర్నెన్స్, నిబంధనల పాటింపు వంటి ప్రక్రియలను ఒకోసారి విస్మరిస్తుంటాయని సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ చెప్పారు. వ్యవస్థాపకులు లాభాలపై దృష్టి పెట్టాలి కానీ గవర్నెన్స్‌ను పట్టించుకోవడం మానేయకూడదు అని ఆయన సూచించారు. ప్రతి స్టార్టప్ .. కస్టమర్ల కోసం టెక్నాలజీని తయారు చేయడంపైనే పూర్తిగా దృష్టి పెడుతుందే తప్ప తమ సంస్థలో అంతర్గతంగా పాటించాల్సిన వాటికోసం టెక్నాలజీని రూపొందించుకోవడంపై అంతగా శ్రద్ధ చూపించదని యూనికస్ కన్సల్టెక్ సహ వ్యవస్థాపకుడు సందీప్ ఖేతాన్ తెలిపారు. అయితే, దేశీయంగా 95 శాతం స్టార్టప్‌లు నిజాయితీగా, నిబంధనలను పాటించే విధంగానే ఉంటున్నాయని ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ అభిప్రాయపడ్డారు. -
ఢిల్లీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్‌లు సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి అధికారాలు కట్టబెట్టిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసు బిల్లు చట్టంగా మారింది. ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వివాదాస్పద బిల్లులైన ఢిల్లీ సర్వీసు బిల్లు, డిజిటల్ డేటా బిల్లుల్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఆమోదించారు. వీటితో పాటు జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు , జన విశ్వాస్ (సవరణ) బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశారు. వీటిలో ఢిల్లీ పాలనాధికారాల బిల్లు (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు), డిజిటల్ డేటా (డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు) బిల్లులపై పార్లమెంటులో విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నీ కేంద్రానికే కట్టబెడుతూ ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుని మొదట లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించాయి. ఇప్పుడు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అదే విధంగా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లులో విపక్ష పార్టీలు కొన్ని సవరణలు సూచించినా ప్రభుత్వం చేపట్టలేదు. బిల్లులో కేంద్ర ప్రభుత్వం సహా కొందరికి మినహాయింపులు ఇవ్వడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. -
20 నుంచి పార్లమెంట్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో సభా వ్యవహారాలు, వివిధ అంశాలపై ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని అన్ని పారీ్టలను కోరుతున్నా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 రోజులపాటు పార్లమెంట్ సమావేశం కానుంది. సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో కొత్త భవనానికి మారుతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయతి్నస్తున్న వేళ ఈ సమావేశాలు వాడీవేడిగా సాగుతాయని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి( యూసీసీ)బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెడుతూ ఢిల్లీలో పరిపాలనాధికారాలపై పట్టుబిగించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా, ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి
ముంబై: బ్యాంకుల్లో కార్పొరేట్గవర్నెన్స్ (పాలన) మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే క్రమంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా తమ మూలధన నిధులను బలోపేతం చేసుకోవాలని, తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ‘భారత్‌లో బ్యాంకింగ్ ధోరణులు, పురోగతి 2020–21’ పేరుతో వార్షిక నివేదికను ఆర్బీఐ మంగళవారం విడుదల చేసింది. ‘‘కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం వల్ల కార్పొరేట్, గృహాలు ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, ఆర్బీఐ కలసికట్టుగా ఆర్థిక స్థిరత్వ సవాళ్లను కట్టడి చేయగలిగాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో వచ్చే సవాళ్లకు తగ్గట్టు బ్యాంకులు బ్యాలన్స్‌షీట్లను బలోపేతం చేసుకోవాలి’’అని అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధిపైనే.. ఇకమీదట బ్యాంకు బ్యాలన్స్ షీట్లు పుంజుకోవడం అన్నది ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. 2021–22లో ఇప్పటి వరకు చూస్తే రుణ వృద్ధి పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆరు నెలల్లో డిపాజిట్లు 10 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 11 శాతం మేర ఉంది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్పీఏల నిష్పత్తి 2020 మార్చి నాటికి 8.2 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 7.3 శాతానికి తగ్గింది. 2021 సెప్టెంబర్ నాటికి 6.9 శాతానికి దిగొచ్చింది’’ అని వివరించింది. సవాళ్లను అధిగమించేందుకు వ్యూహాత్మక విధానం భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు శ్రద్ధతో కూడిన వ్యూహాత్మక విధానం అనుసరణీయమని ఆర్బీఐ పేర్కొంది. వాతావణం మార్పులు, టెక్నాలజీ ఆవిష్కరణలు, కరోనా మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నివేదికలో ప్రస్తావించింది. వాతావరణ మార్పుల తాలూకు సంస్థాగత ప్రభావం ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంపై ఏ మేరకు ఉంటుందో మదింపు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు రుణాలు (గ్రీన్ ఫైనాన్స్), ద్రవ్యోల్బణం, వృద్ధి తదితర స్థూల ఆర్థిక అంశాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వివరించింది. ఎన్బీఎఫ్సీలు నిలదొక్కుకోగలవు రానున్న రోజుల్లో బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) నిలదొక్కుకుని బలంగా ముందుకు సాగుతాయన్న విశ్వాసాన్ని ఆర్బీఐ వ్యక్తం చేసింది. టీకాలు విస్తృతంగా ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థ పుంజకుంటూ ఉండడం అనుకూలిస్తుందని పేర్కొంది. కరోనా మహమ్మారి ఎన్‌బీఎఫ్‌సీల సామర్థ్యాన్ని పరీక్షించినప్పటికీ.. ఈ రంగం బలంగా నిలబడి, తగినంత వృద్ధితో కొనసాగుతున్నట్టు తెలిపింది. కోపరేటివ్ బ్యాంకులు విస్తరించాలి కరోనా మహమ్మారి కాలంలో పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకింగ్ (కోపరేటివ్ బ్యాంకులు) రం గం బలంగా నిలబడినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే కొద్దీ ఇవి మరింత బలోపేతమై, విస్తరించాల్సి ఉందని పేర్కంది. వీటి నిధుల స్థాయి, లాభాలు మెరుగుపడినట్టు తెలిపింది. ప్రాథమిక నమూనాలోనే డిజిటల్ కరెన్సీ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విషయంలో తొలినాళ్లలో ప్రాథమిక నమూనాతోనే వెళ్లడం సరైనదన్న అభిప్రాయంతో ఆర్బీఐ ఉంది. ‘సమగ్రంగా పరీక్షించాలి. అప్పుడే ద్రవ్య విధానం, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం పరిమితంగా ఉంటుంది’ అని పేర్కొంది. నగదుకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, బలమైన, సౌకర్యవంతమైన సాధనంగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. పౌరులకు, ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మక సీబీడీసీని అందించడంపైనే భారత చెల్లింపుల పురోగతి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రూ.36,342 కోట్ల మోసాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్ రంగంలో మోసాలకు సంబంధించి 4,071 కేసులు నమోదయ్యాయి. మోసపోయిన మొత్తం రూ.36,342 కోట్లుగా ఉందని ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. వీటిల్లో రుణ మోసాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మోసపూరిత కేసులు 3,499తో పోలిస్తే పెరిగాయి. కానీ, గతేడాది మోసాల విలువ రూ.64,261 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గింది. వీటిని మరింత వివరంగా చూస్తే.. ‘‘2021–22 మొదటి ఆరు నెలల్లో రుణ మోసాలకు సంబంధించి 1,802 కేసులు నమోదు అయ్యాయి. వీటితో ముడిపడిన మొత్తం రూ.35,060 కోట్లు. కార్డు, ఇంటర్నెట్ రూపంలో మోసాలకు సంబంధించి నమోదైన కేసులు 1,532. వీటి విలువ రూ.60 కోట్లే’’ అని నివేదిక తెలియజేసింది. డిపాజిట్లకు సంబంధించి 208 మోసాలు నమోదైనట్టు, వీటి విలువ రూ.362 కోట్లుగా పేర్కొంది. -
గవర్నెన్స్ లోపాలే రాణా ఉద్వాసనకు కారణం
ముంబై: యస్ బ్యాంక్ సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ నిరాకరించడానికి గవర్నెన్స్ లోపాలు, నిబంధనలను పాటించడంలో వైఫల్యాలే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న అప్పటి చైర్మన్ అశోక్ చావ్లాకు రాసిన లేఖలో ఆర్బీఐ ఈ విషయాలు పేర్కొన్నట్లు వివరించాయి. రుణాల నిర్వహణ విధానాలకు సంబంధించి బ్యాంక్‌లో పెద్ద యెత్తున అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆ లేఖలో పేర్కొంది. అలాగే, రాణా కపూర్ జీతభత్యాలు భారీగా పెంచే ప్రతిపాదనపై కూడా ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఈవోల బోనస్‌లను తగ్గించాలంటూ బ్యాంక్‌ల బోర్డులకు గతంలో ఇచ్చిన సూచనలకు ఇది విరుద్ధంగా ఉందని తెలిపింది. ప్రస్తుత ఎండీ, సీఈవో సారథ్యంలో యస్ బ్యాంక్ పాలన, నిర్వహణ, పర్యవేక్షణ విషయాలపై తమకున్న అనుమానాలకు ఈ పరిణామాలు ఊతమిచ్చేవిగా ఉన్నాయని లేఖలో ఆర్బీఐ పేర్కొంది. ఇవే కాక గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా యస్ బ్యాంక్ పలు మార్గదర్శకాలను తీవ్ర స్థాయిలో ఉల్లంఘించిందని పేర్కొంటూ.. సీఈవోగా కపూర్ కొనసాగింపును తిరస్కరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా కొత్త సీఈవోను నియమించాలని ఆదేశించింది. చావ్లా ఈ మధ్యే బోర్డు నుంచి తప్పుకోగా.. ఆర్బీఐ లేఖలోని అంశాలపై స్పందించేందుకు యస్ బ్యాంక్ నిరాకరించింది. బ్యాంకు, ఆర్బీఐకి మధ్య జరిగే ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ గోప్యనీయమైనవని పేర్కొంది. అయితే, ఆర్బీఐ లేవనెత్తిన పలు అంశాలను ఇప్పటికే పరిష్కరించినట్లు, ఇదే విషయం ఆర్బీఐకి కూడా తెలియజేసినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1 7న ఆర్బీఐ లేఖ పంపించడానికి ముందే చాలా అంశాలు పరిష్కృతమైనట్లు వివరించాయి. రాణా కపూర్ పదవీకాలాన్ని ఆర్బీఐ కుదించినప్పట్నుంచి యస్ బ్యాంక్‌లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైర్మన్ అశోక్ చావ్లాతో పాటు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు గణనీయంగా పతనమవుతోంది. ఏకంగా 40 శాతం క్షీణించి ప్రస్తుతం 33 నెలల కనిష్ట స్థాయుల్లో ట్రేడవుతోంది. -
కార్పొరేట్ కంపెనీల కోసమే పాలన
బొబ్బిలి: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పాలన కార్పొరేట్ కం పెనీల కోసమే అన్నట్లు సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఒక్క కుమారుడే అని, పేదలు మాత్రం పది మందికి కనాలా అని ప్రశ్నించారు. సీపీఐ జిల్లా 11వ మహాసభల సందర్భంగా స్థానిక లక్ష్మీ థియేటరులో సోమవారం ప్రతినిధుల సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలైనా అమలు చేయడం లేదని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనపై ప్రత్యేక ప్యాకేజీకి రూ.23 వేల 5 వందల కోట్లు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే రూ.350 కోట్లు ఇచ్చారని, 13 జిల్లాల్లోనూ 10 కిలోమీటర్ల తారు రోడ్డు వేయడానికి మాత్రం ఈ నిధులు సరిపోతాయన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అడిగితే ఇప్పటివరకూ అతీగతీ లేదన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని బీరాలు పలికిన నాయకులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. చిన్న ఖాతాదారులు బ్యాంకుల్లో అప్పు తీసుకుని కట్టని పరిస్థితుల్లో ఉంటే పేపర్లలో ఫొటోలతో సహా ప్రకటనలు ఇస్తారని మరి నల్లధనం దాచుకున్న వారి పేర్లను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రిలయన్స, ఆదాని కంపెనీలు మాత్రమే లాభపడ్డాయని అన్నారు. వీటన్నింటిపై రాష్ట్ర, జాతీయ మహాసభల్లో చర్చలు చేస్తామన్నారు. రాష్ట్ర విభజనపై ప్రత్యేక ప్యాకేజీ సాధనకు ఈ నెల 18న అన్ని మండల, జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన రుణమాఫీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా వాగ్దానాలు చేయడం ఆపడం లేదని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా 32 విమానాశ్రయాలు మూతపడ్డాయని ఆ శాఖ మంత్రి అశోక్ చెబుతుంటే రాష్ట్రంలో 13 జిల్లాల్లో 14 విమానశ్రయాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో ప్రత్యమ్నాయ రాజకీయాలు రావాలని,అందుకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు,వామపక్షాలు కలిసి ముందుకు సాగాలనే ఆలోచన చేస్తున్నాయన్నారు. పతాకావిష్కరణ చేసిన కార్యకర్త జిల్లా 11వ మహాసభలు రెండో రోజున ఉదయం పార్టీ పతాకావిష్కరణను కార్యకర్తతో చేయించారు. శ్రీకాకుళం పోరాట ఉద్యమంలో పాల్గొని 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన అర్జునరావు చేతులమీదుగా ఈ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సభల్లో అమరులైన వారికి సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు, ఏరియా కార్యదర్శి కండాపు ప్రసాదరావు, ఆల్లి అప్పలనాయుడు, ఒమ్మి రమణ, ముల్లు వెంకటరమణ, మునకాల శ్రీనివాస్‌తో పాటు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.