అందుకే అంకుర సంస్థల్లో గవర్నెన్స్ లోపాలు
ఇన్వెస్టర్ల మనోగతం
న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి తీసుకున్న పెట్టుబడులను తిరిగి ఇచ్చేయడం తమ బాధ్యతని అంకుర సంస్థల వ్యవస్థాపకులు భావించడం లేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్‌లలో గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్లు పడిపోతుండటం మొదలైన వాటన్నింటికీ ఇదే కారణమని వారు చెబుతున్నారు. బైజూస్, భారత్‌పే వంటి టాప్ స్టార్టప్స్ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలువురు మదుపుదారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
‘వ్యవస్థాపకులు తాము తీసుకున్న పెట్టుబడులను బాధ్యతగా తిరిగి ఇచ్చేయాలని భావించకపోతుండటమే కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్ల పతనానికి దారి తీస్తోంది‘ అని 100ఎక్స్‌డాట్‌వీసీ వ్యవస్థాపకుడు యజ్ఞేష్ సంఘ్‌రాజ్‌కా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల సమస్యలు చాలా కాలంగా ఉన్నవేనని, ఇవి స్టార్టప్‌లకే పరిమితం కాకుండా సాధారణంగా లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లోనూ కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, లాభాలు, వృద్ధిపై అత్యుత్సాహం చూపించే క్రమంలో స్టార్టప్‌లు కీలకమైన గవర్నెన్స్, నిబంధనల పాటింపు వంటి ప్రక్రియలను ఒకోసారి విస్మరిస్తుంటాయని సోరిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ చెప్పారు. వ్యవస్థాపకులు లాభాలపై దృష్టి పెట్టాలి కానీ గవర్నెన్స్‌ను పట్టించుకోవడం మానేయకూడదు అని ఆయన సూచించారు.
ప్రతి స్టార్టప్ .. కస్టమర్ల కోసం టెక్నాలజీని తయారు చేయడంపైనే పూర్తిగా దృష్టి పెడుతుందే తప్ప తమ సంస్థలో అంతర్గతంగా పాటించాల్సిన వాటికోసం టెక్నాలజీని రూపొందించుకోవడంపై అంతగా శ్రద్ధ చూపించదని యూనికస్ కన్సల్టెక్ సహ వ్యవస్థాపకుడు సందీప్ ఖేతాన్ తెలిపారు. అయితే, దేశీయంగా 95 శాతం స్టార్టప్‌లు నిజాయితీగా, నిబంధనలను పాటించే విధంగానే ఉంటున్నాయని ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్‌చందానీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment