కార్పొరేట్ కంపెనీల కోసమే పాలన | CPI state secretary K. Rama Krishna fire on TDP Government | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ కంపెనీల కోసమే పాలన

Published Tue, Feb 17 2015 12:15 AM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

కార్పొరేట్ కంపెనీల కోసమే పాలన - Sakshi

కార్పొరేట్ కంపెనీల కోసమే పాలన

 బొబ్బిలి: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పాలన కార్పొరేట్ కం పెనీల కోసమే అన్నట్లు సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఒక్క కుమారుడే అని, పేదలు మాత్రం పది మందికి కనాలా అని ప్రశ్నించారు. సీపీఐ జిల్లా 11వ మహాసభల సందర్భంగా స్థానిక లక్ష్మీ థియేటరులో సోమవారం ప్రతినిధుల సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలైనా అమలు చేయడం లేదని అన్నారు.
 
  ప్రధాన మంత్రి మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనపై ప్రత్యేక ప్యాకేజీకి రూ.23 వేల 5 వందల కోట్లు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే రూ.350 కోట్లు ఇచ్చారని, 13 జిల్లాల్లోనూ 10 కిలోమీటర్ల తారు రోడ్డు వేయడానికి మాత్రం ఈ నిధులు సరిపోతాయన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అడిగితే ఇప్పటివరకూ అతీగతీ లేదన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని బీరాలు పలికిన నాయకులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. చిన్న ఖాతాదారులు బ్యాంకుల్లో అప్పు తీసుకుని కట్టని పరిస్థితుల్లో ఉంటే పేపర్లలో ఫొటోలతో సహా ప్రకటనలు ఇస్తారని మరి నల్లధనం దాచుకున్న వారి పేర్లను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రిలయన్‌‌స, ఆదాని కంపెనీలు మాత్రమే లాభపడ్డాయని అన్నారు. వీటన్నింటిపై రాష్ట్ర, జాతీయ మహాసభల్లో చర్చలు చేస్తామన్నారు. రాష్ట్ర విభజనపై ప్రత్యేక ప్యాకేజీ సాధనకు ఈ నెల 18న అన్ని మండల, జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.
 
 చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన రుణమాఫీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా వాగ్దానాలు చేయడం ఆపడం లేదని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా 32 విమానాశ్రయాలు మూతపడ్డాయని ఆ శాఖ మంత్రి అశోక్ చెబుతుంటే రాష్ట్రంలో 13 జిల్లాల్లో 14 విమానశ్రయాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో ప్రత్యమ్నాయ రాజకీయాలు రావాలని,అందుకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు,వామపక్షాలు కలిసి ముందుకు సాగాలనే ఆలోచన చేస్తున్నాయన్నారు.
 
 పతాకావిష్కరణ చేసిన కార్యకర్త
 జిల్లా 11వ మహాసభలు రెండో రోజున ఉదయం పార్టీ పతాకావిష్కరణను కార్యకర్తతో చేయించారు. శ్రీకాకుళం పోరాట ఉద్యమంలో పాల్గొని 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన అర్జునరావు చేతులమీదుగా ఈ పతాకాన్ని ఆవిష్కరించారు.   ఈ సభల్లో అమరులైన వారికి సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు, ఏరియా కార్యదర్శి కండాపు ప్రసాదరావు, ఆల్లి అప్పలనాయుడు, ఒమ్మి రమణ, ముల్లు వెంకటరమణ, మునకాల శ్రీనివాస్‌తో పాటు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement