ఢిల్లీలో తాగునీటి సమస్యపై తొలి ఉత్తర్వు జారీ
న్యూఢిల్లీ: జైలులో ఉన్నా, బయట ఉన్నా ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని చెప్పిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ దిశగా తొలి ఉత్తర్వు జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి నుంచి శనివారం రాత్రి ఆదేశాలు అందాయని ఢిల్లీ నీటి మంత్రి అతీషి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ పంపించిన నోట్‌ను చూసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. అరెస్టై ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల బాగు కోసం ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తగినన్ని వాటర్ ట్యాంకర్లు పంపించాలంటూ కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కొన్నారు. వేసవి ఎండలు ముదురుతుండడంతో నీటి సరఫరాను మెరుగుపర్చాలని చెప్పారని అన్నారు.
ఈ విషయంలో చీఫ్ సెక్రటరీతోపాటు సంబంధిత అధికారులకు సీఎం ఈడీ కస్టడీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయం తీసుకోవాలని సూచించారని మంత్రి అతీషి చెప్పారు. కస్టడీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ జారీ చేసిన ఉత్తర్వుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించింది. ఈ ఉత్తర్వు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ పీఎంఎల్‌ఏ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌కు అనుగుణంగా ఉందా? లేదా? అనేది పరిశీలించనున్నట్లు ఈడీ అధికార వర్గాలు ఆదివారం తెలియజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment