సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.
ఈ సమావేశాల్లో సభా వ్యవహారాలు, వివిధ అంశాలపై ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని అన్ని పారీ్టలను కోరుతున్నా’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్‌లో మొత్తం 17 రోజులపాటు పార్లమెంట్ సమావేశం కానుంది. సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, సమావేశాల మధ్యలో కొత్త భవనానికి మారుతాయని తెలుస్తోంది.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయతి్నస్తున్న వేళ ఈ సమావేశాలు వాడీవేడిగా సాగుతాయని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి( యూసీసీ)బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెడుతూ ఢిల్లీలో పరిపాలనాధికారాలపై పట్టుబిగించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా, ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ నూతన భవనాన్ని మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment