ఢిల్లీ: కేంద్రమంత్రి, ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్త కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసి వాటి వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని అన్నారు. కులగణన వివరాలు వెల్లడిస్తే జరిగే పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరాగ్ పాశ్వాన్ పీటీఐ ఎడిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన.. దేశంలో ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలపై ఎటువంటి చర్చలు ఎన్డీయే కూటమిలో జరగటం లేదని స్పష్టం చేశారు.
‘మా ముందుకు ఇప్పటికీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ముసాయిదా రాలేదు. మేము ఆ ముసాయిదాను పరిశీలించాలి. ఎందుకంటే భారత్ భిన్నత్వం ఏకత్వం గల దేశం కావున, మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భాష, సంస్కృతి, జీవనశైలిలో చాలా వ్యత్యాలు ఉంటాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటంపై నాకు ఆశ్చర్యం కలుగుతోంది.
.. అయితే ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చకు వచ్చినప్రతిసారి హిందూ, ముస్లింల వ్యవహారంగా కనిస్తోంది. కానీ, ఇది అందరి మత విశ్వాసాలు, సంప్రదాయాలు, వివాహ పద్దతులకు సంబంధించింది. హిందు, ముస్లింలను వేరు చేసింది అస్సలే కాదు. ఇది అందరినీ ఏకం చేసేది మాత్రమే’ అని అన్నారు.
మరోవైపు.. ‘ప్రభుత్వం కులాల వారీగా చేపట్టే సంక్షేమ పథకాలకు కులగణన ఎంతో ఉపయోగపడుతంది. కోర్టులు కూడా కులాల వారీ జనాభా డేటాను పలసార్లు ప్రస్తావించింది. అయితే ఈ డేటాను ప్రభుత్వం తన వద్దనే ఉంచుకోవాలి. బయటకు విడుదల చేయవద్దు. అయితే కులగణన డేటాను బహిర్గతం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆలా చేయటం వల్ల సమాజంలో కులాల మధ్య విభజనకు దారి తీస్తుందనే ఆందోళన కలుగుతోంది’ అని కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment