శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ‘గవర్నర్‌గా రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో మహిళా మంత్రులెవరూ లేరు. కానీ ఉదయం గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసి సాయంత్రం ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణం చేయించడం సంతోషకరంగా భావించా’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం కోటా కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెచ్చినందుకు కృతజ్ఞతగా శనివారం రాజ్‌భవన్‌లో వివిధ రంగాల మహిళా ప్రముఖులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
వెన్ను చూపితే ఇంకా వేగం పెంచుతా...
‘ఏదైనా అడ్డంకులొస్తే భావోద్వేగానికి గురై పనిచేయడం మానేసే అలవాటును మహిళలు వీడాలని గవర్నర్ తమిళిసై సూచించారు. గౌరవం లభించినా, లభించకపోయినా ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వంతో తన ప్రొటోకాల్ వివాదాన్ని మళ్లీ ప్రస్తావించారు. ‘ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ధైర్యంగా పని చేసుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు.
మీరొచ్చి నాకు పుష్పాన్ని ఇస్తే స్వీకరిస్తా. వెన్ను చూపిస్తే మాత్రం ఇంకా వేగంతో ముందుకుపోతా. దారిలో ముళ్లుంటే తీసి పడేసి ముందుకు సాగుతా. నాపై రాళ్లు రువ్వితే వాటితోనే కోటను నిర్మించుకుంటా. నన్ను పిన్నులతో గుచ్చినా వచ్చే ఆ రక్తంతోనే నా జీవిత చరిత్ర రాసుకుంటా. నన్ను ఎవరూ ఆపలేరు. నియంత్రించలేరు. విమర్శలు, అవమానాలను పట్టించుకోను. ఇదే నా సందేశం’అని గవర్నర్ తమిళిసై అన్నారు.
బీజేపీలో నాడే 33% మహిళా కోటా..
బీజేపీలో మహిళా కోటాను అమలు చేయడంతో చాలా మంది ప్రతిభావంతులైన మహిళలు ఆ పార్టీలో చేరారని గవర్నర్ తమిళిసై అన్నారు. తాను గతంలో బీజేపీలో పనిచేసిన విషయం అందరికీ తెలుసని, ఈ విషయాన్ని దాచుకోనని చెప్పారు. ఇప్పుడు పరిపాలనపరమైన పదవికి మారానని గుర్తుచేశారు. నాటి బీజేపీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ పార్టీ పదవుల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించి పార్టీ శాసనాన్ని ఆ మేరకు సవరించారని తెలిపారు.
దీంతో చాలా మంది మహిళలు బీజేపీలో చేరారన్నారు. మహిళా రిజర్వేషన్లతో ఇకపై మహిళలూ రాజకీయాల్లో వచ్చేందుకు ఉత్సాహం లభిస్తుందన్నారు. ఈస్ట్రోజన్ (మహిళల హార్మోన్లు) చాలా శక్తివంతమైనదని, మహిళలు గొప్ప పాలనాదక్షులు అని తెలిపారు. రిజర్వేషన్లు 33 శాతమే కావచ్చని, 50% అవకాశాల కోసం కష్టపడాలని సూచించారు.
రిజర్వేషన్లు బినామీలు, భార్యల కోసం కాదు
ప్రధాని మోదీ బలమైన నాయకత్వంతోనే మహిళా రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని, ఇవి సమాజానికి ఉపయోగపడాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. బినామీలు, కుమార్తెలు, భార్యలు, తల్లులను రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం రిజర్వేషన్లను వాడకూడదని కోరారు. తాను రాజకీయ నేత కుమార్తె అయినప్పటికీ ఎన్నడూ ఆ కార్డును వాడుకోలేదన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి పైకి వచ్చినట్లు చెప్పారు.
మహిళల చేతిలోకి పాలన వస్తే పేదరికం, అనారోగ్యం కనుమరుగు అవుతాయన్నారు. మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా బిల్లుకు ఆమోదం తెలపడం గొప్ప విషయమన్నారు. రాజకీయాల్లో మహిళలు పురుషుల కంటే 10–20 రేట్లు ఎక్కువగా పనిచేస్తేనే పదవుల కోసం కేవలం పేర్లను పరిశీలిస్తారని, ఇస్తారో లేదో గ్యారెంటీ లేదని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు 50 రేట్లు అధికంగా పనిచేయాల్సి ఉంటుందనేది తన అభిప్రాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment