అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న మోదీ సర్కారు అతి త్వరలో మన దేశం పేరును కూడా భారత్‌గా మార్చే ఆలోచనలో ఉందా? జీ 20 దేశాధినేతలకు తాజాగా కేంద్రం లాంఛనంగా పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి హోదాను ఇంగ్లీష్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దేశం పేరు మార్పు దిశగా కేంద్రం నుంచి త్వరలో రానున్న ప్రకటనకు ఇది కచ్చితమైన ముందస్తు సంకేతమేనని అనుమానిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి
జీ 20 దేశాధినేతలకు పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం పేర్కొనడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. కానీ మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న చర్చ నిజానికి చాలాకాలంగా జరుగుతున్నదే...
- కేంద్రంలో మోదీ సారథ్యంలోని – బీజేపీ సర్కారు కూడా దీన్ని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తూనే వచ్చింది, వస్తోంది. బ్రిటిష్ వలస వాసనలను సమూలంగా వదిలించుకోవాల్సిందేనని పదేపదే చెబుతోంది. ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోంది.
- 150 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ వంటి బ్రిటిష్ జమానా నాటి పేర్లకు భారత్ పేరు చేరుస్తూ తీసుకున్న తాజా నిర్ణయం అలాంటిదే.
- ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లులు ప్రవేశపెడుతూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.
- త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న మోదీ సర్కారు, మెజారిటీ ఓటర్ల భావోద్వేగాలతో ముడిపడ్డ ఇలాంటి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని పరిశీలకులు అప్పుడే అభిప్రాయపడ్డారు. ఆ అంచనాలు సత్య దూరం కాదనేందుకు తాజా ’ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ ఆహ్వానాలే నిదర్శనమని భావిస్తున్నారు.
ఒకటో అధికరణాన్నే మార్చేయాలి!
ఈ నేపథ్యంలో దేశం పేరు మార్పుకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది ఆసక్తికరంగా మారింది.
- రాజ్యాంగంలోని తొలి అధికరణే మన దేశాన్ని ’ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్య’ అని స్పష్టంగా పేర్కొంటోంది.
- అంటే, ఇండియా, భారత్ రెండింటినీ మన దేశ అధికారిక నామాలుగా ఒకటో అధికరణే గుర్తిస్తోందన్నది ఇక్కడ ఆసక్తికర అంశం.
- ఇప్పుడు వాటిలోంచి ఇండియాను తొలగిస్తూ, భారత్‌ను మాత్రమే
ఏకైక అధికారిక నామంగా గుర్తించాలని కేంద్రం భావిస్తోందా అన్నది ఇక్కడ కీలకమైన అంశం.
అలా జరగాలంటే ఆ మేరకు ఒకటో అధికరణాన్ని సవరించాల్సి ఉంటుంది.
నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు
‘భారతా? ఇండియానా? మన దేశాన్ని భారత్ అని పిలుచుకుంటారా? భేషుగ్గా పిలుచుకోండి.అదే సమయంలో ఎవరన్నా ఇండియా అని పిలవాలని అనుకుంటే అలాగే పిలవనివ్వండి‘– 2016లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్య
గట్టిగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు
- మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న యోచనను సుప్రీంకోర్టు గట్టిగా వ్యతిరేకించడం విశేషం. ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్‌ను నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టింది.
- 2020లో కూడా ఇలాంటి మరో పిల్‌ను తిరస్కరించింది. దాన్ని విజ్ఞాపనగా మార్చి సరైన నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నాటి సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సూచించారు.
జంబూ ద్వీపం నుంచి ఇండియా దాకా..
అతి ప్రాచీనమని భావించే జంబూ ద్వీపం మొదలుకుని భారత్, హిందూస్తాన్ నుంచి ఇండియా దాకా. ఎన్నో, మరెన్నో పేర్లు. మన దేశానికి ఉన్నన్ని పేర్లు ప్రపంచంలో మరే దేశానికీ లేవేమో!
- ఇంగ్లీష్ వాడకంలో మన దేశాన్ని ఇండియా అని, స్థానికులు భారత్ అని అంటారు. పాలక వర్గం ఇండియా అని, పాలిత (సామాన్య) వర్గం భారత్ అని అంటారు.
జంబూ ద్వీపం
పురాణాలు, ప్రాచీన గ్రంథాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అన్నారు. జంబూ అంటే నేరేడు పండు. అప్పట్లో మన దేశంలో ఆ చెట్లు విస్తారంగా ఉండేవి గనుక ఆ పేరు వచ్చిందని అంటారు. నాటి మన సువిశాల దేశపు ఆకృతి కూడా నేరేడు ఫలం మాదిరే ఉండేదని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. చైనా యాత్రికుడు ఫాహియాన్ కూడా మన దేశాన్ని అదే పేరుతో ప్రస్తావించడం విశేషం. ‘జంబూ ద్వీపం ఉత్తరాన విశాలంగా, దక్షిణాన సన్నగా ఉంటుంది. అక్కడి ప్రజల ముఖాలు అలాగే ఉంటాయి‘ అని తన యాత్రా చరిత్రలో రాసుకొచ్చాడు.
హిందూస్తాన్, ఇండియా
బ్రిటిష్ వలస పాలన దాకా మనకు హిందూస్తాన్ అనే పేరు వాడుకలో ఉండేది. తర్వాత బ్రిటిష్ వారు మన దేశం పేరును ఇండియాగా మార్చారు. ఈ రెండు పేర్లూ సింధు నది నుంచి వచ్చి నట్టు చెబుతారు. నాటి భారత ఉప ఖండానికి సింధు నది సరిహద్దుగా ఉండేది. దానికి ఈవలి వైపున ఉన్న దేశం అనే అర్థంలో తొలుత తురుషు్కలు ముఖ్యంగా పర్షియన్లు మనను హిందూస్తాన్ అని పిలిచారు. సింధులో ‘స’ అక్షరాన్ని వాళ్లు ‘హ’గా పలుకుతారు గనుక అలా పేరు పెట్టారు. అలా సనాతన ధర్మం పేరు హిందూ మతంగా మారింది.
భారత్
భరతుడనే పౌరాణిక చక్రవర్తి పేరిట మన దేశానికి భారత్ అని పేరు వచ్చి నట్టు ఐతిహ్యం. విశ్వామిత్రుడు, మేనక సంతానంగా పుట్టి ముని కన్యగా పెరిగిన శకుంతలకు, మహారాజు దుష్యంతునికి పుట్టినవాడే భరతుడు.
Comments
Please login to add a commentAdd a comment