Justice Thakur
-
సత్వర న్యాయం కోసం సంస్కరణలు
సాక్షి, అమరావతి: సామాన్యులకు సత్వర న్యాయాన్ని అందించడంలో జాప్యాన్ని, అవరోధాలను అధిగమించేందుకు న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలను అమలు చేస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. గురువారం హైకోర్టులో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో జస్టిస్ ఠాకూర్ జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో భారతదేశ స్వాతంత్రోద్యమం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సైబర్ నేరాలు, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు వంటి సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ మన దేశం పురోగతి వైపు పరుగులు పెడుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిలిగినీడి చిదంబరం, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీహరి పాల్గొన్నారు. లోకాయుక్తలో.. కర్నూలు (సెంట్రల్, అగ్రికల్చర్): దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలులోని లోకాయుక్త కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజినీ, రిజి్రస్టార్ టి.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఏపీఈఆర్సీలో..కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్సీ) భవనంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. -
ఇది దేనికి సంకేతం?
అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న మోదీ సర్కారు అతి త్వరలో మన దేశం పేరును కూడా భారత్‌గా మార్చే ఆలోచనలో ఉందా? జీ 20 దేశాధినేతలకు తాజాగా కేంద్రం లాంఛనంగా పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి హోదాను ఇంగ్లీష్‌లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దేశం పేరు మార్పు దిశగా కేంద్రం నుంచి త్వరలో రానున్న ప్రకటనకు ఇది కచ్చితమైన ముందస్తు సంకేతమేనని అనుమానిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి జీ 20 దేశాధినేతలకు పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం పేర్కొనడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. కానీ మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న చర్చ నిజానికి చాలాకాలంగా జరుగుతున్నదే... కేంద్రంలో మోదీ సారథ్యంలోని – బీజేపీ సర్కారు కూడా దీన్ని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తూనే వచ్చింది, వస్తోంది. బ్రిటిష్ వలస వాసనలను సమూలంగా వదిలించుకోవాల్సిందేనని పదేపదే చెబుతోంది. ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోంది. 150 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ వంటి బ్రిటిష్ జమానా నాటి పేర్లకు భారత్ పేరు చేరుస్తూ తీసుకున్న తాజా నిర్ణయం అలాంటిదే. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లులు ప్రవేశపెడుతూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న మోదీ సర్కారు, మెజారిటీ ఓటర్ల భావోద్వేగాలతో ముడిపడ్డ ఇలాంటి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని పరిశీలకులు అప్పుడే అభిప్రాయపడ్డారు. ఆ అంచనాలు సత్య దూరం కాదనేందుకు తాజా ’ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ ఆహ్వానాలే నిదర్శనమని భావిస్తున్నారు. ఒకటో అధికరణాన్నే మార్చేయాలి! ఈ నేపథ్యంలో దేశం పేరు మార్పుకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగంలోని తొలి అధికరణే మన దేశాన్ని ’ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్య’ అని స్పష్టంగా పేర్కొంటోంది. అంటే, ఇండియా, భారత్ రెండింటినీ మన దేశ అధికారిక నామాలుగా ఒకటో అధికరణే గుర్తిస్తోందన్నది ఇక్కడ ఆసక్తికర అంశం. ఇప్పుడు వాటిలోంచి ఇండియాను తొలగిస్తూ, భారత్‌ను మాత్రమే ఏకైక అధికారిక నామంగా గుర్తించాలని కేంద్రం భావిస్తోందా అన్నది ఇక్కడ కీలకమైన అంశం. అలా జరగాలంటే ఆ మేరకు ఒకటో అధికరణాన్ని సవరించాల్సి ఉంటుంది. నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు ‘భారతా? ఇండియానా? మన దేశాన్ని భారత్ అని పిలుచుకుంటారా? భేషుగ్గా పిలుచుకోండి.అదే సమయంలో ఎవరన్నా ఇండియా అని పిలవాలని అనుకుంటే అలాగే పిలవనివ్వండి‘– 2016లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్య గట్టిగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న యోచనను సుప్రీంకోర్టు గట్టిగా వ్యతిరేకించడం విశేషం. ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్‌ను నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టింది. 2020లో కూడా ఇలాంటి మరో పిల్‌ను తిరస్కరించింది. దాన్ని విజ్ఞాపనగా మార్చి సరైన నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నాటి సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సూచించారు. జంబూ ద్వీపం నుంచి ఇండియా దాకా.. అతి ప్రాచీనమని భావించే జంబూ ద్వీపం మొదలుకుని భారత్, హిందూస్తాన్ నుంచి ఇండియా దాకా. ఎన్నో, మరెన్నో పేర్లు. మన దేశానికి ఉన్నన్ని పేర్లు ప్రపంచంలో మరే దేశానికీ లేవేమో! ఇంగ్లీష్ వాడకంలో మన దేశాన్ని ఇండియా అని, స్థానికులు భారత్ అని అంటారు. పాలక వర్గం ఇండియా అని, పాలిత (సామాన్య) వర్గం భారత్ అని అంటారు. జంబూ ద్వీపం పురాణాలు, ప్రాచీన గ్రంథాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అన్నారు. జంబూ అంటే నేరేడు పండు. అప్పట్లో మన దేశంలో ఆ చెట్లు విస్తారంగా ఉండేవి గనుక ఆ పేరు వచ్చిందని అంటారు. నాటి మన సువిశాల దేశపు ఆకృతి కూడా నేరేడు ఫలం మాదిరే ఉండేదని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. చైనా యాత్రికుడు ఫాహియాన్ కూడా మన దేశాన్ని అదే పేరుతో ప్రస్తావించడం విశేషం. ‘జంబూ ద్వీపం ఉత్తరాన విశాలంగా, దక్షిణాన సన్నగా ఉంటుంది. అక్కడి ప్రజల ముఖాలు అలాగే ఉంటాయి‘ అని తన యాత్రా చరిత్రలో రాసుకొచ్చాడు. హిందూస్తాన్, ఇండియా బ్రిటిష్ వలస పాలన దాకా మనకు హిందూస్తాన్ అనే పేరు వాడుకలో ఉండేది. తర్వాత బ్రిటిష్ వారు మన దేశం పేరును ఇండియాగా మార్చారు. ఈ రెండు పేర్లూ సింధు నది నుంచి వచ్చి నట్టు చెబుతారు. నాటి భారత ఉప ఖండానికి సింధు నది సరిహద్దుగా ఉండేది. దానికి ఈవలి వైపున ఉన్న దేశం అనే అర్థంలో తొలుత తురుషు్కలు ముఖ్యంగా పర్షియన్లు మనను హిందూస్తాన్ అని పిలిచారు. సింధులో ‘స’ అక్షరాన్ని వాళ్లు ‘హ’గా పలుకుతారు గనుక అలా పేరు పెట్టారు. అలా సనాతన ధర్మం పేరు హిందూ మతంగా మారింది. భారత్ భరతుడనే పౌరాణిక చక్రవర్తి పేరిట మన దేశానికి భారత్ అని పేరు వచ్చి నట్టు ఐతిహ్యం. విశ్వామిత్రుడు, మేనక సంతానంగా పుట్టి ముని కన్యగా పెరిగిన శకుంతలకు, మహారాజు దుష్యంతునికి పుట్టినవాడే భరతుడు. -
రెండోసారి ఆర్డినెన్స్ అన్యాయం
సుప్రీం కోర్టు మండిపాటు న్యూఢిల్లీ: ఒక ఆర్డినెన్స్‌ను తిరిగి ప్రకటించడం రాజ్యాంగాన్ని దగా చేయడం, ప్రజాస్వామిక శాసస ప్రక్రియను నాశనం చేయడమేనని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆర్డినెన్స్ ప్రకటనకు రాష్ట్రపతి లేదా గవర్నర్ తెలిపే సంతృప్తికి న్యాయసమీక్ష నుంచి రక్షణ లేదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బెంచ్ సోమవారం 6:1 మెజారిటీతో ఈ మేరకు తీర్పు చెప్పింది. ‘ఆర్డినెన్స్‌కు కూడా చట్టసభ చేసే చట్టానికి ఉన్నంత శక్తి ఉంటుంది. పార్లమెంటు లేదా రాష్ట్ర చట్టసభల ముందు ఆర్డినెన్స్‌ను ఉంచడం తప్పనిసరి. అలా చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన’ అని మెజారిటీ జడ్జీల తరఫున జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. బిహార్ సర్కార్ ఒక ఆర్డినెన్స్‌ను 4సార్లు ప్రకటించిన కేసును కోర్టు విచారిస్తోంది. -
ఇది పద్ధతి కాదు!
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టులకు జడ్జీల నియామకం, బదిలీలపై కొలీజియం తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అమలు చేయకపోవడంపై సుప్రీం కోర్టు మండిపడింది. దీనివల్ల న్యాయవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా స్పందించకపోతే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. న్యాయసేవలకు ఆటంకం కలిగేలా జడ్జీల నియామకంలో ప్రతిష్టంభన సహించేది లేదని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ ఠాకూర్... కొలీజియంకు కూడా నేతృత్వం వహిస్తున్నారు. 8 నెలల కిందటి నిర్ణయం... దేశంలోని 24 హైకోర్టుల్లో 478 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, వాటిల్లో 39లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని రాజ్యసభకు ప్రభుత్వం తెలపడంపై బెంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. 8 నెలల కిందట తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ ఆచరణలో పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. జడ్జీల నియామకానికి సంబంధించిన మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)లో న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్యనున్న భిన్నాభిప్రాయాలను సాకుగా చూపి ఖాళీల భర్తీ ప్రక్రియను పక్కన పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ‘ఎందుకీ జాప్యం? ఎందుకంత అపనమ్మకం? కొలీజియం 75 మంది పేర్లను ప్రతిపాదించింది. కానీ కేంద్రం నేటికీ స్పందించలేదు. హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల నియామకమూ పెండింగ్‌లోనే ఉంది. బదిలీలు లేవు. బదిలీ అయినవారూ కదల్లేదు. ఒకవేళ జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వారి పేర్లను కొలీజియానికి పంపండి, పునఃపరిశీలిస్తాం. జాప్యాన్ని సహించం’ అని తేల్చి చెప్పింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భాన్ని ప్రస్తావించిన జస్టిస్ ఠాకూర్... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం 40% సిబ్బందితోనే పనిచేస్తోందన్నారు. విచారణలో తీవ్ర జాప్యం వల్ల 13-14 ఏళ్ల నుంచి బాధితులు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. ఈ అంశంపై 4 వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏజీని ఆదేశించింది. కోర్టుల్లో అనేక కేసులు విచారణకు నోచుకోవడం లేదని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ మాజీ సైన్యాధికారి కల్నల్ అనిల్ కబోత్రా వేసిన పిల్‌ను కోర్టు విచారించింది. -
సుప్రీంకోర్టు సీజేను కలిసిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో ఈ భేటీ జరిగింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి విచ్చేసిన జస్టిస్ ఠాకూర్‌ను కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజనతో పాటు పలు న్యాయపర అంశాలపై ఇరువురూ చర్చించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న న్యాయపర సమస్యలకు త్వరలోనే పరిష్కార మార్గం చూపాలని కేసీఆర్ కోరారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం సందర్భంగా 45మంది న్యాయ విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, డిప్లమాలో ఉత్తీర్ణులైన 536మంది విద్యార్థులకు పట్టాలు అందచేశారు. చీఫ్ జస్టిస్ ఠాకూర్‌తో పాటు ఏపీ, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రమేష్ రంగనాథ్, నల్సార్ వర్శిటీ వీసీ ప్రొఫెసర్ ముస్తఫా, రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సీజేఐతో హైకోర్టు ఏసీజే భేటీ
న్యాయాధికారుల కేటాయింపు, హైకోర్టు విభజనపై చర్చ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి బొసాలే శనివారమిక్కడ ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య న్యాయాధికారుల కేటాయింపు వ్యవహారం, హైకోర్టు విభజన తదితర అంశాలపై వీరిరువురూ చర్చించినట్టు సమాచారం. తెలంగాణ న్యాయాధికారులు, కింది కోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని, లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో కక్షిదారులకు న్యాయాన్ని అందించేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని హైకోర్టు ప్రకటన జారీ చేసిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయాధికారుల కేటాయింపు, హైకోర్టు విభజనకు మౌలిక వసతుల కల్పన తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అనంతరం జస్టిస్ దిలీప్ బి బొసాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెహార్, జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ అశోక్భూషణ్ను వేర్వేరుగా కలిశారు. ఆదివారం ఉదయం తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనున్నట్టు సమాచారం. -
ఇళ్ల స్థలాల కేసు ఉపసంహరణకు సుప్రీం నో
పాలసీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి సాక్షి, న్యూఢిల్లీ: శాసనసభ్యులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుపై సుప్రీం కోర్టు విచారణలో ఉన్న పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నివేదించగా సుప్రీం కోర్టు ఇందుకు నిరాకరించింది. అయితే తెలంగాణ చేసిన మరో వినతి మేరకు హౌసింగ్ పాలసీ మార్పునకు అనుమతించిం ది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వద్దకు సంబంధిత పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. శాసనసభ్యులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించగా.. వీరికి ఎందుకు ఇవ్వాలంటూ కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ నేపథ్యం లో ఇళ్ల స్థలాలు ఇదివరకే ఉన్నవారికి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నిచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ కేసును తాము ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపున సీని యర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించగా.. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది దత్త,గుంటూరు ప్ర భాకర్, సొసైటీల తరపున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ వ్యతిరేకించారు. జస్టిస్ ఠాకూర్ జోక్యం చేసుకుంటూ హైకోర్టు తీర్పు సరిగానే ఉంది కదా అని వ్యాఖ్యానించారు. అందరికీ లభించాలన్నది తమ అభిమతమని, వారసత్వంగా సంక్రమించిన భూములున్న వారు ఈ లెక్కన స్థలం పొందే అవకాశం కోల్పోతారని వాదించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకుంటే తమ ప్ర యోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నా రు. హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వానికి డబ్బులు కూ డా చెల్లించాయని వివరించారు. సుప్రీంకోర్టు వీరి వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్ ఉపసంహరణకు నిరాకరించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ విధానంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా కోర్టు అనుమతించింది. విచారణలో ఉన్న కేసులో ఏపీ సర్కారును ప్రతివాదిగా కొనసాగేందుకు కూడా అనుమతించిం ది. అన్ని పక్షాల స్పందనలు, ప్రతిస్పందనలు అందిన తరువాత విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం పేర్కొంది. -
కాలంతోపాటు మారాల్సిందే!
‘కొలీజియం’పై సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్య న్యూఢిల్లీ: జడ్జీల నియామకంలో కొలీజియం వ్యవస్థను కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలంతోపాటు ఏ వ్యవస్థ అయినా మారాల్సిందేనన్నారు. ‘ఏ వ్యవస్థ కూడా స్తబ్దుగా ఉండలేదు. కాలంతోపాటు మార్పులు జరగడం అనివార్యం. పాత పద్ధతులే ఉత్తమం అనుకునే మన ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. సోమవారం జాతీయ న్యాయ సేవల అథారిటీ(నల్సా) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ఎల్ దత్తు, కాబోయే సీజేఐ టీఎస్ ఠాకూర్తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్న ‘నల్సా’పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. లోక్ అదాలత్‌ల ద్వారా గత రెండేళ్లలో 8.5 కోట్ల పెండింగ్ వ్యాజ్యాలు పరిష్కారమయ్యాయన్నారు. అయితే అంతటితో సంతృప్తి చెందితే మళ్లీ స్తబ్ధత ఆవరిస్తుందన్నారు. వినూత్నంగా ఆలోచిస్తే ఎంతటి అద్భుత ఫలితాలు రాబట్టవచ్చో ఈ అదాలత్ నిరూపించిందని పేర్కొన్నారు. ‘జస్టిస్ ఠాకూర్‌కు కాస్త సంశయంతోనే నేను ఒక మాట చెప్పదల్చుకున్నా.. ఒకరిని జడ్జిగా నియమించదల్చుకున్నప్పుడు ఆయన పేదలకు ఉచితంగా న్యాయసేవలందిచేందుకు ఎంత సమయం వెచ్చించారో తెలుసుకోండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, న్యాయం పొందేందుకు ప్రతి పౌరుడికి సమాన అవకాశం దక్కాలంటే సమర్థమైన, ప్రజాస్వామ్యయుత న్యాయవ్యవస్థ అవసరం ఉంటుందని సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గిస్తున్నాయి: జస్టిస్ ఠాకూర్ లోక్ అదాలత్‌ల ద్వారా కోర్టులపై ఒత్తిడి బాగా తగ్గిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. లోక్‌అదాలత్‌లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని, న్యాయవ్యవస్థపై ఉన్న భారాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 1.28 లక్షల లోక్‌అదాలత్‌లను నిర్వహించి 57 లక్షల కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. లోక్ అదాలత్‌ల ద్వారా పేదలకు ఎంతో కలుగుతోందని, 80 శాతం కేసులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నవేనని తెలిపారు. -
కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!
-
కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!
ప్రభుత్వానికి సీజే జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రతిపాదన న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్‌కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించిన ఫైలును న్యాయశాఖ సిద్ధం చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడుతాయి. జస్టిస్ ఠాకూర్ నియామకమైతే సుప్రీంకోర్టుకు 43వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అయితే 63 ఏళ్ల ఠాకూర్ చీఫ్ జస్టిస్‌గా సుమారు ఏడాది కాలమే పనిచేయనున్నారు. 2017 జనవరి 4న ఆయన రిటైర్ అవుతారు. అన్ని అంశాలపైనా పట్టు.. 1952 జనవరి 4న జస్టిస్ ఠాకూర్ జన్మించారు. 1972 అక్టోబర్‌లో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ హైకోర్టులో చాలాకాలం న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, పన్నులు, సేవలు, రాజ్యాంగ విషయాలు సహా అన్ని అంశాలపైనా వివిధ కేసుల్లో వాదనలు వినిపించారు. 1990లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1994 ఫిబ్రవరి 16న కశ్మీర్ హైకోర్టులో అదనపు జడ్జీగా నియామకం అయ్యారు. అదే ఏడాది మార్చిలో జడ్జిగా కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1995 సెప్టెంబర్‌లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. 2004లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2008 ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి... అదే ఏడాది ఆగస్టు 11న పంజాబ్-హరియాణా హైకోర్టుకు పూర్తిస్థాయి చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2009 నవంబర్ 17న సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు. జస్టిస్ ఠాకూర్ తండ్రి జస్టిస్ డీడీ ఠాకూర్ ప్రముఖ న్యాయవాదిగా, కశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించిన బెంచ్‌కి జస్టిస్ ఠాకూర్ నేతృత్వం వహించారు. సంచలం సృష్టించిన శారదా చిట్‌ఫండ్, ఎన్ఆర్హెచ్ఎం కుంభకోణాల కేసులనూ ఇదే ధర్మాసనం విచారిస్తోంది.