‘కొలీజియం’పై సుప్రీం తీర్పు నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్య
న్యూఢిల్లీ: జడ్జీల నియామకంలో కొలీజియం వ్యవస్థను కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలంతోపాటు ఏ వ్యవస్థ అయినా మారాల్సిందేనన్నారు. ‘ఏ వ్యవస్థ కూడా స్తబ్దుగా ఉండలేదు. కాలంతోపాటు మార్పులు జరగడం అనివార్యం. పాత పద్ధతులే ఉత్తమం అనుకునే మన ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. సోమవారం జాతీయ న్యాయ సేవల అథారిటీ(నల్సా) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, కాబోయే సీజేఐ టీఎస్ ఠాకూర్‌తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్న ‘నల్సా’పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. లోక్ అదాలత్‌ల ద్వారా గత రెండేళ్లలో 8.5 కోట్ల పెండింగ్ వ్యాజ్యాలు పరిష్కారమయ్యాయన్నారు. అయితే అంతటితో సంతృప్తి చెందితే మళ్లీ స్తబ్ధత ఆవరిస్తుందన్నారు. వినూత్నంగా ఆలోచిస్తే ఎంతటి అద్భుత ఫలితాలు రాబట్టవచ్చో ఈ అదాలత్ నిరూపించిందని పేర్కొన్నారు. ‘జస్టిస్ ఠాకూర్‌కు కాస్త సంశయంతోనే నేను ఒక మాట చెప్పదల్చుకున్నా.. ఒకరిని జడ్జిగా నియమించదల్చుకున్నప్పుడు ఆయన పేదలకు ఉచితంగా న్యాయసేవలందిచేందుకు ఎంత సమయం వెచ్చించారో తెలుసుకోండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, న్యాయం పొందేందుకు ప్రతి పౌరుడికి సమాన అవకాశం దక్కాలంటే సమర్థమైన, ప్రజాస్వామ్యయుత న్యాయవ్యవస్థ అవసరం ఉంటుందని సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు పేర్కొన్నారు.
ఒత్తిడిని తగ్గిస్తున్నాయి: జస్టిస్ ఠాకూర్
లోక్ అదాలత్‌ల ద్వారా కోర్టులపై ఒత్తిడి బాగా తగ్గిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. లోక్‌అదాలత్‌లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని, న్యాయవ్యవస్థపై ఉన్న భారాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 1.28 లక్షల లోక్‌అదాలత్‌లను నిర్వహించి 57 లక్షల కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. లోక్ అదాలత్‌ల ద్వారా పేదలకు ఎంతో కలుగుతోందని, 80 శాతం కేసులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నవేనని తెలిపారు.
కాలంతోపాటు మారాల్సిందే!
Published Tue, Nov 10 2015 2:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement