స్వాతంత్య్ర దినోత్సవాల్లో హైకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్
సాక్షి, అమరావతి: సామాన్యులకు సత్వర న్యాయాన్ని అందించడంలో జాప్యాన్ని, అవరోధాలను అధిగమించేందుకు న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలను అమలు చేస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. గురువారం హైకోర్టులో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో జస్టిస్ ఠాకూర్ జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల స్వాతంత్య్రోద్యమాల్లో భారతదేశ స్వాతంత్రోద్యమం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సైబర్ నేరాలు, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు వంటి సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ మన దేశం పురోగతి వైపు పరుగులు పెడుతోందన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిలిగినీడి చిదంబరం, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీహరి పాల్గొన్నారు.
లోకాయుక్తలో..
కర్నూలు (సెంట్రల్, అగ్రికల్చర్): దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలులోని లోకాయుక్త కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజినీ, రిజి్రస్టార్ టి.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ఏపీఈఆర్‌సీలో..
కర్నూలులోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్‌సీ) భవనంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీఈఆర్‌సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment