కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్! | Justice TS Thakur as the new CJI | Sakshi
Sakshi News home page

కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!

Published Thu, Nov 5 2015 4:25 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్! - Sakshi

కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!

 ప్రభుత్వానికి సీజే జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు ప్రతిపాదన
 
 న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్‌కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించిన ఫైలును న్యాయశాఖ సిద్ధం చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడుతాయి. జస్టిస్ ఠాకూర్ నియామకమైతే సుప్రీంకోర్టుకు 43వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అయితే 63 ఏళ్ల ఠాకూర్ చీఫ్ జస్టిస్‌గా సుమారు ఏడాది కాలమే పనిచేయనున్నారు. 2017 జనవరి 4న ఆయన రిటైర్ అవుతారు.

 అన్ని అంశాలపైనా పట్టు..
 1952 జనవరి 4న జస్టిస్ ఠాకూర్ జన్మించారు. 1972 అక్టోబర్‌లో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ హైకోర్టులో చాలాకాలం న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, పన్నులు, సేవలు, రాజ్యాంగ విషయాలు సహా అన్ని అంశాలపైనా వివిధ కేసుల్లో వాదనలు వినిపించారు. 1990లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1994 ఫిబ్రవరి 16న కశ్మీర్ హైకోర్టులో అదనపు జడ్జీగా నియామకం అయ్యారు. అదే ఏడాది మార్చిలో జడ్జిగా కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1995 సెప్టెంబర్‌లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.

2004లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2008 ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి... అదే ఏడాది ఆగస్టు 11న పంజాబ్-హరియాణా హైకోర్టుకు పూర్తిస్థాయి చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు.  2009 నవంబర్ 17న సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు. జస్టిస్ ఠాకూర్ తండ్రి జస్టిస్ డీడీ ఠాకూర్ ప్రముఖ న్యాయవాదిగా, కశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించిన బెంచ్‌కి జస్టిస్ ఠాకూర్ నేతృత్వం వహించారు. సంచలం సృష్టించిన శారదా చిట్‌ఫండ్, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కుంభకోణాల కేసులనూ ఇదే ధర్మాసనం విచారిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement