ఇది పద్ధతి కాదు!
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టులకు జడ్జీల నియామకం, బదిలీలపై కొలీజియం తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అమలు చేయకపోవడంపై సుప్రీం కోర్టు మండిపడింది. దీనివల్ల న్యాయవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా స్పందించకపోతే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. న్యాయసేవలకు ఆటంకం కలిగేలా జడ్జీల నియామకంలో ప్రతిష్టంభన సహించేది లేదని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ ఠాకూర్... కొలీజియంకు కూడా నేతృత్వం వహిస్తున్నారు.
8 నెలల కిందటి నిర్ణయం... దేశంలోని 24 హైకోర్టుల్లో 478 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, వాటిల్లో 39లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని రాజ్యసభకు ప్రభుత్వం తెలపడంపై బెంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. 8 నెలల కిందట తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ ఆచరణలో పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. జడ్జీల నియామకానికి సంబంధించిన మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)లో న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్యనున్న భిన్నాభిప్రాయాలను సాకుగా చూపి ఖాళీల భర్తీ ప్రక్రియను పక్కన పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ‘ఎందుకీ జాప్యం? ఎందుకంత అపనమ్మకం? కొలీజియం 75 మంది పేర్లను ప్రతిపాదించింది. కానీ కేంద్రం నేటికీ స్పందించలేదు.
హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల నియామకమూ పెండింగ్‌లోనే ఉంది. బదిలీలు లేవు. బదిలీ అయినవారూ కదల్లేదు. ఒకవేళ జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వారి పేర్లను కొలీజియానికి పంపండి, పునఃపరిశీలిస్తాం. జాప్యాన్ని సహించం’ అని తేల్చి చెప్పింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భాన్ని ప్రస్తావించిన జస్టిస్ ఠాకూర్... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం 40% సిబ్బందితోనే పనిచేస్తోందన్నారు. విచారణలో తీవ్ర జాప్యం వల్ల 13-14 ఏళ్ల నుంచి బాధితులు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. ఈ అంశంపై 4 వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏజీని ఆదేశించింది. కోర్టుల్లో అనేక కేసులు విచారణకు నోచుకోవడం లేదని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ మాజీ సైన్యాధికారి కల్నల్ అనిల్ కబోత్రా వేసిన పిల్‌ను కోర్టు విచారించింది.