Ministry of Justice
-
కొత్త ట్రిబ్యునల్‌పై న్యాయ సలహా కోరిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 ప్రకారం విచారించేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్ర జల శక్తి శాఖ న్యాయ శాఖ సలహా కోరినట్లు తెలిసింది. అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకున్న నేపథ్యంలో దీనిపై ఏవిధంగా ముందుకెళ్లాలో తెలపాలని న్యాయ శాఖ కార్యదర్శి అనూప్‌కుమార్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర న్యాయ శాఖ ఇచ్చే సూచనల మేరకు జలశక్తి శాఖ ఈ విషయంలో ముందుకు వెళ్లనుంది. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను.. విభజన చట్టంలోని సెక్షన్–89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్–3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేసేలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని గత నెల 16న రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, న్యాయ నిపుణుల సలహాతో ట్రిబ్యునల్ ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటామని అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇచ్చిన హామీని లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. -
ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ అడ్వొకేట్ ప్యానల్ నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానెల్ నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూపూడి వెంకట కృష్ణకుమార్, దాట్ల దివ్య, వెన్న హేమంత్‌కుమార్, జీవీఎంవీ ప్రసాద్, కిలారు కృష్ణభూషణ్ చౌదరిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్ -
గూగుల్ గుత్తాధిపత్యంపై అమెరికాలో కేసు
వాషింగ్టన్: ఆన్లైన్ సెర్చి, అడ్వర్టైజింగ్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని టెక్ దిగ్గజం గూగుల్‌పై అమెరికా న్యాయ శాఖ దావా వేసింది. పోటీ సంస్థలను దెబ్బతీసేందుకు, వినియోగదారులకు హాని చేసేందుకు తన గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకుందని ఆరోపించింది. ‘గూగుల్ అనేది ఇంటర్నెట్కు ప్రధాన ద్వారంలాంటిది. సెర్చి అడ్వరై్టజింగ్ దిగ్గజం. అయితే, పోటీ సంస్థలకు హానికరమైన అనుచిత విధానాలతో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసింది‘ అని అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్ రోసెన్ తెలిపారు. టెక్నాలజీ పరిశ్రమలో ఇలాంటి కేసులను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫోన్లలో గూగుల్‌ను డిఫాల్ట్ సెర్చి ఇంజిన్‌లా ఉంచేందుకు మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలకు గూగుల్ భారీగా చెల్లింపులు జరుపుతోందని, ఇందుకోసం ప్రకటనకర్తల నుంచి వచ్చే నిధులను వెదజల్లుతోందని పిటీషన్లో న్యాయశాఖ ఆరోపించింది. 11 రాష్ట్రాలు కూడా ఈ పిటిషన్లో భాగంగా చేరాయి. మరోవైపు, న్యాయ శాఖ దావా లోపభూయిష్టమైనదని గూగుల్ వ్యాఖ్యానించింది. -
1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 1.66 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఏడాదికి కనీసం 165 కేసులను పరిష్కరిస్తాయని వెల్లడించింది. వీటిలో 389 కోర్టులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసులను ప్రత్యేకంగా విచారిస్తాయని తెలిపింది. ఇందుకోసం మొత్తం రూ. 767.25 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. -
‘న్యాయ గడియారాలు’...!
న్యాయపరమైన వ్యవహారాలు, ప్రక్రియల్లో మరింత సమర్థతను పెంచడంలో భాగంగా దేశంలోని మొత్తం 24 హైకోర్టులలో ‘న్యాయ గడియారాలు’ ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్య ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి న్యాయవ్యవస్థలో సమర్థత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మనదేశంలో కేసుల పరిష్కారానికి సంబంధించిన న్యాయప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతూ కక్షిదారులకు విసుగు చెందేంత స్థాయి వరకు వెళ్లడం మనకు తెలిసిందే. న్యాయ విభాగం జవాబుదారీతనం, సమర్థతపై దేశవ్యాప్త చర్చ సాగుతున్న నేపథ్యంలో... ఈ విషయంలో కోర్టుల మధ్య పరస్పరం కేసుల పరిష్కారంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడంతో పాటు పౌరుల పట్ల న్యాయస్థానాలు మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించేలా చేయొచ్చునని ప్రభుత్వం అంచనావేస్తోంది. గతేడాది నవంబర్ 26న ‘నేషనల్ లా డే’ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వివిధ న్యాయస్థానాల ఆవరణలో న్యాయ గడియారాలుంచాలని చేసిన సూచనకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ గడియారాల్లో (ఎల్ఈడీ మెసేజ్ డిస్ప్లే బోర్డుల్లో) పెండింగ్ కేసుల సంఖ్య ప్రదర్శిస్తారు. ప్రతీరోజు కోర్టులు పరిష్కరించిన కేసులు, ఇలాంటి కేసుల సంఖ్య ఆధారంగా ఒక్కో న్యాయస్థానం సాధించిన ర్యాంక్ ఎంతో అందులో చూపుతారు. కొత్తఢిల్లీలోని న్యాయశాఖ కార్యాలయంలో ఇప్పటికే ఇలాంటి గడియారాన్ని ఏర్పాటుచేశారు. దేశంలోని న్యాయస్థానాల్లో అధికసంఖ్యలో కేసులు పరిష్కరించిన వాటిని గురించి ఇందుల్లో ప్రదర్శిస్తారు. దీనికి కొనసాగింపుగా దేశంలోని అన్ని హైకోర్టుల్లో వీటిని అమర్చుతారు. ఆ తర్వాత కింది కోర్టుల్లోనూ వీటిని నెలకొల్పనున్నారు. పరిష్కరించే కేసుల విషయంలో న్యాయస్థానాల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు, పనితీరు ఆధారంగా హైకోర్టులకు ర్యాంక్‌లిచ్చేందుకు ఈ గడియారాలు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి చెబుతున్నారు. భవిష్యత్‌లో అన్ని సబార్డినేట్ కోర్టులలో సైతం వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జడ్జీల కంటే కోర్టు గదుల సంఖ్య తక్కువ..
న్యూఢిల్లీ: దేశంలో కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే జడ్జీల సంఖ్య కంటే అక్కడ ఉన్న గదుల సంఖ్య తక్కువ ఉన్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. జిల్లా కోర్టులు, వాటి అధీనంలో పనిచేసే(సబ్ ఆర్డినేట్) కోర్టుల్లో జడ్జీలు, గదుల సంఖ్యలను సమం చేస్తే దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగవుతుందని అభిప్రాయపడింది. దేశంలో మొత్తం 17,576 కోర్టు రూమ్‌లు, 14,363 రెసిడెన్షియల్ యూనిట్లు ఉండగా.. జడ్జీల సంఖ్య 22,288 ఉందని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు నివేదిక ఇచ్చింది. -
కోర్టు కాంప్లెక్స్ కోసం కోటి తిప్పలు
►రెవెన్యూ, న్యాయశాఖల మధ్య తెగని పంచాయితీ ►స్థలం కేటాయింపు విషయమై జిల్లా జడ్జి చర్చలు ►స్థలం విషయంలో కొలిక్కి రాని వైనం రాజంపేట : రాజంపేటలో కోర్టు క్లాంపెక్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక విషయంలో రెవెన్యూ, న్యాయశాఖలు తమ తమ స్థాయిలో సిగపట్లు పడుతున్నాయి. భిన్న వాదనలతో రెవెన్యూశాఖ, న్యాయవాదుల మధ్య సయోధ్య కుదరలేదని స్పష్టమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు కాంప్లెక్స్ ఒప్పంద వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవడంతో రాజంపేట బార్ అసోసి యేషన్ హైకోర్టును ఆశ్రయిం చిన విష యం విదితమే. ఈ నేపథ్యంలో కోర్టు క్లాంపెక్స్ భవనాల నిర్మాణానికి సంబంధించి కదలిక మొదలైందనే భావనకు న్యాయవాదులు వచ్చినప్పటికి మళ్లీ స్థలం ఎంపిక సమస్యతో పీఠముడిపడింది. కోర్టు కాంప్లెక్స్ ఒప్పందం ఇలా.. చాలీచాలని రీతిలో రాజంపేట కోర్టు భవనాలు ఉన్నాయనే ఉద్దేశంతో రాజం పేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు క్లాంపెక్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఇందు లో భాగంగా నూతనంగా భవనాలు నిర్మించుకోవాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాజంపేట కోర్టులో జూ నియర్, సీనియర్, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టుకు ఉన్న భవనాలు అన్ని విధాలుగా అసౌకర్యంగా ఉండటంతో న్యాయవాదులు నూతనంగా కో ర్టు కాంప్లెక్స్ కోసం కోర్టు ఆవరణంలో ఉన్న తహసీల్దారు కార్యాలయం కలుపుకొని, సబ్ కలెక్టరేట్లో ఉన్న న్యాయమూర్తుల నివాస గృహాలను తీసుకొనే విధంగా ముందు ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో రెవెన్యూ, న్యాయ శాఖల మధ్య ఒప్పందం అమలుకాకపోవడానికి అనేక కారణాలు లేకపోలేదు. పరిశీలనలో కొన్ని స్థలాలు ► సబ్ కలెక్టరేట్ క్యాంపస్‌లో ఉత్తర భాగంలో మూడు ఎకరాల స్థలం ఖాళీ గా ఉంది. ఈ స్థలాన్ని పరిశీలించారు. ►మళ్లీ జిల్లా జడ్జికి రెవెన్యూశాఖ అధికారులు కడప–రేణిగుంట జాతీయరహదారిలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చూపించారు. ► అలాగే డిగ్రీ కళాశాల (వత్తలూరు) సమీపంలో త్రిభుజాకారంలో ఉన్న స్థలాన్ని చూపించారు. మళ్లీ ప్రస్తుతం కోర్టు క్యాంపస్‌లో ఉన్న స్థలం (గతంలో చేసుకున్న కోర్టు కాంప్లెక్స్ ఒప్పందం) మేరకు కావాలనే డిమాండ్‌ను న్యాయవాదులు తెరపైకి తీసుకొచ్చారు. జిల్లా జడ్జి సుదీర్ఘ చర్చలు.. రెండురోజుల క్రితం స్థానిక జడ్జిలు, న్యాయవాదులు, ఆర్డీవో వీరబ్రహ్మంతో జిల్లా జడ్జి సమావేశమయ్యారు. స్థలం కేటాయింపు విషయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ స్థలం కోర్టు క్లాంపెక్స్‌కు ఖరారు అయితే రూ.15కోట్ల వ్యయంతో భవనాలను నిర్మించేందుకు న్యాయశాఖ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదని పలువురు న్యాయవాదులు పేర్కొంటున్నారు. -
ఒప్పందం అమలు ఎన్నడో!
భవనాల అప్పగింతపై రెండు శాఖల మధ్య వివాదం హైకోర్టు రిజిస్ట్రార్ ఆరా.. రాజంపేట: రాజంపేట కోర్టు క్లాంపెక్స్ ఒప్పందం పంచాయతీ ఎంతకీ తెగడంలేదు. ఈ విషయంలో రెవెన్యూ, న్యాయశాఖల మధ్య నెలకొన్న పరిస్ధితులు కొలిక్కిరాలేదు. మూడేళ్ల కిందట కలెక్టరు, అప్పటి జిల్లా జడ్జి రాజంపేట కోర్టు ఆవరణ పరిశీలించి, ప్రత్యేకంగా కోర్టు క్లాంపెక్స్‌ను ఏర్పాటుచేసుకొనే దిశగా చర్చించారు. గత కలెక్టరు కేవీ రమణ అఫిషియల్క్లబ్ను కోర్టుకు ఇచ్చేవిధంగా ముందుకొస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ క్లబ్ భవనాలు కోర్టుకు సరిపడవని న్యాయవాదులు, క్లబ్ ప్రభుత్వ ఆస్తికాదని తమదేనని సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. రెవెన్యూశాఖపై హైకోర్టులో రిట్ దాఖలు చేసేందుకు సన్నద్ధులయ్యారు. రాజంపేట సబ్‌కలెక్టరు (ఆర్డీవో) కార్యాల యంలో న్యాయశాఖకు సంబంధించిన భవనాలను రెవెన్యూశాఖకు అప్పగించడం, ప్ర స్తుతం కోర్టు ఆవరణలో ఉన్న రెవెన్యూ భవనాలను న్యాయశాఖకు అప్పగించే విధంగా ఒప్పందం కుదిరింది. ఆ విధంగా రాజంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉన్న న్యాయశాఖ భవనాలను ఆ పరిధిలోనే ఉంచేశారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న తహశీల్దారు కార్యాలయం, రెవెన్యూ భవనాలను న్యాయశాఖకు అప్పగించలేదు. ఇదే విషయంపై హైకోర్టు రెవెన్యూ శాఖను ప్రశ్నించినట్లు తెలిసింది. హైకోర్టు రిజిస్ట్రారు ఈ వ్యవహారంపై ఆరా తీశారు. ఈ విషయాన్ని రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు ‘సాక్షి’కి ధృవీకరించారు. తాము గత కొన్నాళ్లుగా కోర్టు క్లాంపెక్స్ ఒప్పందం అమలు హైకోర్టు జడ్జి నుంచి జిల్లా జడ్జిల వరకు విన్నవిస్తూవస్తూనే ఉన్నామని స్పష్టంచేశారు. రెవెన్యూశాఖ తమ భవనాలు అప్పగించలేదని, ఒప్పందం ప్రకారం ఆర్డీవోకార్యాలయంలోని న్యాయశాఖ భవనాలు ఇచ్చేసినట్లు వెల్లడించారు. ఇరుకుగదితో ఇక్కట్లు రాజంపేటలో 1906కు ముందే సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉన్నట్లుగా గ్రామపటం చూపిస్తోంది. ప్రభుత్వస్ధలం కాబట్టే 1911లో వచ్చిన ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రత్యేకంగా చూపలేదు. విలేజ్ కీ మ్యాప్ ప్రకారం పోలీసుస్టేషన్, తహశీల్దారు ఆఫీసు, సబ్‌ట్రెజరీ, సబ్‌జైలు కార్యాలయాలు ఒకవైపు, మరోవైపు కోర్టు ఉంది. 1983లో ఎన్టీఆర్ బర్తరఫ్ సందర్భంగా జరిగిన అల్లర్లలో తహశీల్దారు, కోర్టుభవనం దగ్ధమయ్యాయి. 2000లో ప్రస్తుతం ఉన్న నూతనభవనం నిర్మించారు. 2007లో జిల్లా అదనపు కోర్టు తాత్కాలిక పాస్ట్‌ట్రాక్ కోర్టుగా మంజూరు చేశారు. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదనక ఏడీజే గా అవతరించింది. ఉన్నతస్ధాయి న్యాయస్ధానం స్థానిక జూనియర్ సివిల్ జడ్జికోర్టులోని ఇరుకైన గదిలో నడుస్తోంది. కలెక్టరు కోనశశిధర్ హయాంలో.. గతంలో జిల్లా కలెక్టరుగా పనిచేసిన కోన శశిధర్, అప్పటి జిల్లా న్యాయమూర్తి కలిసి తహశీల్దారు కార్యాలయ భవనాన్ని కోర్టు సముదాయాలకు ఇచ్చేట్లుగా, దీనికి బదులుగా సీనియర్ సివిల్ జడ్జి బంగాళాలోకి తహశీల్దారు కార్యాలయాన్ని బదలాయింపుచేసే విధంగా ఒప్పుకొని ఉత్తర్వులు ఇచ్చారు. రాయచోటి, కోడూరు వంటి ప్రాంతాల్లో కోర్టులకు నూతన భవనాలు పూర్తయినా రాజంపేటలో మాత్రం ఇరుకుగదుల్లో నిర్వహించుకోవాల్సిన దుస్ధితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం న్యాయవ్యవస్థకు ఇబ్బందులు కలుగజేయడమే కాక కక్షిదారులకు అసౌకర్యంగా ఉంది. తక్షణం అధికారులు, పాలకులు, న్యాయవాదసంఘాలు స్పందించి సమస్యను పరిష్కరించాలని న్యాయవాదులు, కక్షిదారులు కోరుతున్నారు. -
స్థానికతకు న్యాయశాఖ ఆమోదం
* త్వరలో కేంద్రం ఉత్తర్వులు జారీ * 2017 జూన్ రెండో తేదీలోపు వెళ్లినవారంతా స్థానికులే సాక్షి, హైదరాబాద్: నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులతో పాటు ఇతరులు, వారి పిల్లలకు స్థానికత కల్పించేందుకు కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధిత ఫైలును హోంశాఖ గతంలోనే న్యాయశాఖ పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే. న్యాయశాఖ ఆమోదం తెలపడంతో త్వరలోనే స్థానికత కల్పించే ఉత్తర్వులను కేంద్రం జారీ చేయనుంది. న్యాయశాఖ నుంచి సంబంధిత ఫైలు కేంద్ర హోంశాఖకు చేరిందని, ఆ ఫైలును కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్ర విభజన తేదీ జూన్ 2, 2014 నుంచి 2017జూన్2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వలసవెళ్లే కుటుంబాలన్నిటికీ స్థానికత కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 7వ తేదీన కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తుది ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి విదితమే. -
సీఈఐబీకి ఆర్బీఐ బ్యాంకుల తనిఖీ వివరాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ను నిరోధించేందుకు, బ్యాంకింగ్ చట్టాల ఉల్లంఘనను కట్టడి చేసే దిశగా బ్యాంకుల తనిఖీల నివేదికల వివరాలను సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ)కి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి సీఈఐబీ, ఆర్బీఐ త్వరలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనున్నాయి. సీఈఐబీ.. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (ఈఐసీ)తో సమావేశాల్లో అనేక మార్లు ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ.. చట్టపరమైన ఆటంకాల పేరుతో తనిఖీ నివేదికల వివరాలు సీఈఐబీకి ఇచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో ఈ అంశం న్యాయ శాఖ వద్దకు చేరింది. బ్యాంకుల తనిఖీల నివేదికల వివరాలను సీఈఐబీ వంటి ఏజెన్సీలకు ఇచ్చే విషయంలో ఆర్బీఐని నిరోధించే నిబంధనలేమీ లేవని న్యాయశాఖ తేల్చి చెప్పింది. -
కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!
-
కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!
ప్రభుత్వానికి సీజే జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రతిపాదన న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్‌కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకానికి సంబంధించిన ఫైలును న్యాయశాఖ సిద్ధం చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడుతాయి. జస్టిస్ ఠాకూర్ నియామకమైతే సుప్రీంకోర్టుకు 43వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అయితే 63 ఏళ్ల ఠాకూర్ చీఫ్ జస్టిస్‌గా సుమారు ఏడాది కాలమే పనిచేయనున్నారు. 2017 జనవరి 4న ఆయన రిటైర్ అవుతారు. అన్ని అంశాలపైనా పట్టు.. 1952 జనవరి 4న జస్టిస్ ఠాకూర్ జన్మించారు. 1972 అక్టోబర్‌లో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ హైకోర్టులో చాలాకాలం న్యాయవాదిగా పనిచేశారు. సివిల్, క్రిమినల్, పన్నులు, సేవలు, రాజ్యాంగ విషయాలు సహా అన్ని అంశాలపైనా వివిధ కేసుల్లో వాదనలు వినిపించారు. 1990లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1994 ఫిబ్రవరి 16న కశ్మీర్ హైకోర్టులో అదనపు జడ్జీగా నియామకం అయ్యారు. అదే ఏడాది మార్చిలో జడ్జిగా కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1995 సెప్టెంబర్‌లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. 2004లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2008 ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి... అదే ఏడాది ఆగస్టు 11న పంజాబ్-హరియాణా హైకోర్టుకు పూర్తిస్థాయి చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2009 నవంబర్ 17న సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు. జస్టిస్ ఠాకూర్ తండ్రి జస్టిస్ డీడీ ఠాకూర్ ప్రముఖ న్యాయవాదిగా, కశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించిన బెంచ్‌కి జస్టిస్ ఠాకూర్ నేతృత్వం వహించారు. సంచలం సృష్టించిన శారదా చిట్‌ఫండ్, ఎన్ఆర్హెచ్ఎం కుంభకోణాల కేసులనూ ఇదే ధర్మాసనం విచారిస్తోంది. -
ఆ అభ్యర్థులకు ఉద్యోగాలేవీ?
♦ డీఎస్సీల్లో నష్టపోయినవారికి ఉద్యోగాలిస్తామన్న సీఎం కేసీఆర్ ♦ 8 నెలలు గడిచినా ముందుకు కదలని ఫైలు ♦ జీఏడీ, న్యాయశాఖ పరిశీలన పేరుతో జాప్యం ♦ పోస్టింగ్‌లు ఇస్తారన్న ఆశతో వేల మంది ఎదురుచూపులు ♦ అధికారులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1996 నుంచి 2012 వరకు నిర్వహించిన ఆరు డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయడంలో అడుగు ముందుకు పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఫలితం లేదు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వేలాది మంది ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నా స్పందన రావడం లేదు. అభ్యర్థులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ అప్పులపాలు అవుతున్నారు. గత జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. తరువాత ఒకసారి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీతో పాటు 2012 వరకు నిర్వహించిన 5 డీఎస్సీల్లో నష్టపోయిన వారికి కూడా ఉద్యోగాలివ్వాలని నిర్ణయించారు. కానీ అది ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. ఆరునెలలుగా ఫైలు జీఏడీ, న్యాయశాఖ పరిశీలనలో ఉందంటూ దాటవేస్తున్నారు. ఎన్నెన్నో అక్రమాలు.. డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది 1998 డీఎస్సీకి చెందినవారే. అప్పట్లో చేపట్టిన 40 వేల టీచర్ పోస్టుల భర్తీలో అనేక అక్రమాలు జరిగాయి. బీఎడ్ లేని వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎస్జీటీ పోస్టుల్లో పండిట్లను నియమించారు. రాతపరీక్షలో 4 మార్కులు వచ్చిన వారికి కూడా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. ముఖ్యంగా ఈ డీఎస్సీలో 85 మార్కులకు రాతపరీక్ష నిర్వహించగా, 15 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు. తొలుత ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ వారికి 40 మార్కులను అర్హతగా నిర్ణయించినా... పోస్టుల సంఖ్యకంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారంటూ అర్హత మార్కులను 45, 40, 35కు కుదించారు. నియామకాల సందర్భంగా దీనిని వినియోగించుకుని తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి ఉద్యోగాలిచ్చారు. దీంతో రాతపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు తమకు ఇంటర్వ్యూలో కావాలని తక్కువ మార్కులు వేసి పోస్టులకు ఎంపిక కాకుండా చేశారంటూ ఆందోళనకు దిగారు. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అర్హత మార్కులను తగ్గించడం సరైంది కాద ని, రాతపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని 1999లో ట్రిబ్యునల్ ఆదేశించింది. దానిని సవాలు చేస్తూ 2000వ సంవత్సరంలో విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా దానిని అమలు చేయని విద్యాశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించినా... హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలుచేయలేదు. తిరిగి 2010 వరకు ట్రిబ్యునల్, హైకోర్టులో మళ్లీ కేసు కొనసాగింది. ఆ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని, నియామక తేదీ నుంచి సీనియారిటీ, ప్రయోజనాలు కల్పించాలని 2011 నవంబర్ 8న ఆదేశాలు వచ్చినా... ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో చీవాట్లు తిన్న విద్యాశాఖ చివరకు ఆ పోస్టులు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. ఇప్పుడు వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా... అది ఆచరణకు నోచుకోలేదు. -
న్యాయమంత్రిత్వశాఖ లక్ష్యంగా బాంబుదాడి
కాబుల్: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఏకంగా ప్రభుత్వానికి చెందిన ఉన్నత వ్యక్తుల కార్యాలయాలే లక్ష్యంగా బాంబుదాడి జరిపారు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మంగళవారం కాబూల్‌లోని న్యాయమంత్రిత్వశాఖకు చెందిన పార్కింగ్ ప్రాంతాన్ని ఎంచుకొని ఉగ్రవాదులు బాంబులు అమర్చి వాటిని పేల్చివేశారు. దీంతో విధులకు హాజరైన పలువురు ప్రభుత్వాధికారులు గాయాలతో రక్తసిక్తమవ్వగా.. ఐదుగురు మృతిచెందారు. గతవారం రోజుల్లో ఇది రెండో అతిపెద్ద సంఘటన. ఈ ఘటన మరోసారి భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారి ఒకరు స్పందిస్తూ దేశంలో న్యాయవ్యవస్థలో పనిచేసే ముఖ్య అధికారులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్ ఉగ్రవాదులు ఈ చర్యకుపాల్పడ్డారని చెప్పారు. -
నేర నిరూపణ శాతం తక్కువగా ఉంది
రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ పోలీసు, న్యాయశాఖ సమన్వయ లోపమే ఇందుకు కారణం త్వరలో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో పోలీసు, న్యాయశాఖ మధ్య సమన్వం లోపించడం వల్ల నేర నిరూపణ శాతం తక్కువగా ఉంటోందని హోం శాఖ మంత్రి కె.జె.జార్ట్ అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులోని కావేరి భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఉద్దేశించి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నేరారోపణ ఎదుర్కొన్న వారిలో దాదాపు 70 వేల మందికి పైగా కోర్టు శిక్ష నుంచి తప్పించుకున్నారని గుర్తు చేశారు. ఇందుకు ఎఫ్ఐఆర్ నమోదు, చార్జిషీట్ దాఖలులో సారూప్యత లేకపోవడం ఒక కారణమైతే, కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడం కూడా కారణమవుతోందని అన్నారు. దీని వల్ల న్యాయ, పోలీస్ శాఖలపై ప్రజలకు నమ్మకం, గౌరవం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమని, త్వరలో 2,500 కానిస్టేబుళ్లు, 750 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 197 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు సంబంధించి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైకోర్టు నుంచి అనుమతి లభించిన వెంటనే ఇందుకు సంబంధించి కార్యాచరణ మొదలుపెడతామని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫాదర్ థామస్ హత్య దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని తెలిపారు. విశ్రాంత పోలీసులకు క్యాంటీన్ సదుపాయం విశ్రాంత పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలీస్ క్యాంటీన్ సదుపాయం కల్పించే విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తనను శుక్రవారం భేటీ అయిన రాష్ట్ర విశ్రాంత పోలీసు అధికారుల సంఘం సభ్యులు ముద్దయ్య, పమ్మయ్యలతో జార్జ్ పేర్కొన్నారు. అదేవిధంగా ఆరోగ్యబీమా కల్పించే విషయం కూడా ఆలోచిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.కాగా, జార్జ్‌తో భేటీ అయిన అనంతరం సంఘం పదాధికారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కృష్ణాలో భేటీ అయ్యి డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని అందించారు.