
ఆ అభ్యర్థులకు ఉద్యోగాలేవీ?
♦ డీఎస్సీల్లో నష్టపోయినవారికి ఉద్యోగాలిస్తామన్న సీఎం కేసీఆర్
♦ 8 నెలలు గడిచినా ముందుకు కదలని ఫైలు
♦ జీఏడీ, న్యాయశాఖ పరిశీలన పేరుతో జాప్యం
♦ పోస్టింగ్‌లు ఇస్తారన్న ఆశతో వేల మంది ఎదురుచూపులు
♦ అధికారులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1996 నుంచి 2012 వరకు నిర్వహించిన ఆరు డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయడంలో అడుగు ముందుకు పడటం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఫలితం లేదు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వేలాది మంది ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నా స్పందన రావడం లేదు. అభ్యర్థులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ అప్పులపాలు అవుతున్నారు. గత జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. తరువాత ఒకసారి జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 1998 డీఎస్సీతో పాటు 2012 వరకు నిర్వహించిన 5 డీఎస్సీల్లో నష్టపోయిన వారికి కూడా ఉద్యోగాలివ్వాలని నిర్ణయించారు. కానీ అది ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. ఆరునెలలుగా ఫైలు జీఏడీ, న్యాయశాఖ పరిశీలనలో ఉందంటూ దాటవేస్తున్నారు.
ఎన్నెన్నో అక్రమాలు..
డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది 1998 డీఎస్సీకి చెందినవారే. అప్పట్లో చేపట్టిన 40 వేల టీచర్ పోస్టుల భర్తీలో అనేక అక్రమాలు జరిగాయి. బీఎడ్ లేని వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎస్జీటీ పోస్టుల్లో పండిట్‌లను నియమించారు. రాతపరీక్షలో 4 మార్కులు వచ్చిన వారికి కూడా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. ముఖ్యంగా ఈ డీఎస్సీలో 85 మార్కులకు రాతపరీక్ష నిర్వహించగా, 15 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు. తొలుత ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ వారికి 40 మార్కులను అర్హతగా నిర్ణయించినా... పోస్టుల సంఖ్యకంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారంటూ అర్హత మార్కులను 45, 40, 35కు కుదించారు.
నియామకాల సందర్భంగా దీనిని వినియోగించుకుని తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేసి ఉద్యోగాలిచ్చారు. దీంతో రాతపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు తమకు ఇంటర్వ్యూలో కావాలని తక్కువ మార్కులు వేసి పోస్టులకు ఎంపిక కాకుండా చేశారంటూ ఆందోళనకు దిగారు. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అర్హత మార్కులను తగ్గించడం సరైంది కాద ని, రాతపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని 1999లో ట్రిబ్యునల్ ఆదేశించింది. దానిని సవాలు చేస్తూ 2000వ సంవత్సరంలో విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
అయినా దానిని అమలు చేయని విద్యాశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించినా... హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలుచేయలేదు. తిరిగి 2010 వరకు ట్రిబ్యునల్, హైకోర్టులో మళ్లీ కేసు కొనసాగింది. ఆ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని, నియామక తేదీ నుంచి సీనియారిటీ, ప్రయోజనాలు కల్పించాలని 2011 నవంబర్ 8న ఆదేశాలు వచ్చినా... ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో చీవాట్లు తిన్న విద్యాశాఖ చివరకు ఆ పోస్టులు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. ఇప్పుడు వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా... అది ఆచరణకు నోచుకోలేదు.