ముగిసిన శిక్షణ శిబిరం
♦ చివరి రోజు హాజరైన సీఎం కేసీఆర్
♦ ఉపముఖ్యమంత్రులతో పాటుగా మంత్రివర్గ సహచరులూ హాజరు
♦ ఉత్సాహంగా కనిపించిన కార్పొరేటర్లు
చేవెళ్లః నూతనంగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లకు మూడు రోజులపాటు రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమం బుధవారం సాయంత్రం ముగిసింది. మొదటి రోజు సోమవారం ఈ సదస్సుసు ప్రారంభించిన సీఎం కేసీఆర్ చివరిరోజు బుధవారం ముగింపునకు కూడా హాజరై పరిపాలనలో ఎలా మసలుకోవాలో కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేశారు. చివరి రోజున ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు కె.తారకరామారావు, పి.మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జోగు రామన్న, చందూలాల్‌లు హాజరయ్యారు.
పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, సీతారాంనాయక్‌లు వచ్చారు. ఎమ్మెల్యేలు కాలె యా దయ్య, సంజీవరావు, కొండా సురేఖ, వివేక్, కృష్ణారెడ్డి, తీగల కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కొండా మురళి, సలీం, స్టీఫెన్‌సన్, తదితరులు శిక్షణా శిబిరానికి తరలివచ్చారు. మేయర్లు దొంతు రామ్మోహన్ (జీహెచ్‌ఎంసీ), డిప్యూటీ మే యర్ బాబా ఫసియోద్ధీన్, ఆకుల సు జాత (నిజామాబాద్), పాపాలాల్ (ఖమ్మం), నరేందర్ (వరంగల్), లక్ష్మీనారాయణ (రామగుండం), రవీందర్‌సింగ్ (కరీంనగర్)లు వచ్చారు.
హైద రాబాద్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుదాం : డిప్యూటీ సీఎంలు, మంత్రులు
శిక్షణ శిబిరంలో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పార్లమెంటు సభ్యురాలు కవిత తదితరులు మాట్లాడుతూ హైదరాబాద్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. శిక్షణలో ఆకళింపు చేసుకున్న అంశాలతో హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలోని పార్టీలు ప్రజలకు ఏం చేయలేవు కాబట్టే టీఆర్‌ఎస్‌కు ఎప్పుడూ రాని విధంగా మెజార్టీని కట్టబె ట్టారని గుర్తుచేశారు.
అందుకు అనుగుణంగానే అభివృద్ధి దిశలో హైదరాబాద్‌ను పరుగులు పెట్టించాలని సూచించారు. అభివృద్ధిలో ప్రజలను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని, వారితో కమిటీలను వేసి బాధ్యతను పెంచాలన్నారు. మంచినీరు, రోడ్లు, విద్య, వైద్యం, తదితర అంశాలను ముం దుగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులను ఎవరైనా కబ్జా చేస్తే ఉపేక్షించరాదని, కఠినంగా శిక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు కార్పొరేటర్లు అన్ని విధాలా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. నగరానికి నలువైపులా ఉన్న రంగారెడ్డి జిల్లా కూడా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు. పార్లమెంటు సభ్యురాలు కవిత మాట్లాడుతూ పూణే తరహాలో చెత్త వినియోగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. బెంగళూరు తరహాలో వర్షపు నీటిని వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.