విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యారంగాన్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడులను మూసేయడం, వర్సిటీల్లో ప్రమాణాలను కాపాడలేకపోవడం వంటి వాటి వల్ల విద్యారంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందన్నారు. విద్యార్థులు లేరనే నెపంతో 400 పైగా బడులను మూసేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు.
10 మందికి తక్కువగా విద్యార్థులున్న మరో 900 పాఠశాలలను పక్కన ఉన్న పాఠశాలల్లో విలీనంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉస్మానియా వర్సిటీకి న్యాక్ గుర్తింపు లేకపోవడంవల్ల యూజీసీ నిధులను కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి కేసీఆర్ వ్యవహారశైలే కారణమన్నారు. విద్యారంగం పూర్వవైభవం సాధించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులతో కలసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.