- రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్
- పోలీసు, న్యాయశాఖ సమన్వయ లోపమే ఇందుకు కారణం
- త్వరలో పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో పోలీసు, న్యాయశాఖ మధ్య సమన్వం లోపించడం వల్ల నేర నిరూపణ శాతం తక్కువగా ఉంటోందని హోం శాఖ మంత్రి కె.జె.జార్ట్ అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులోని కావేరి భవన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఉద్దేశించి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నేరారోపణ ఎదుర్కొన్న వారిలో దాదాపు 70 వేల మందికి పైగా కోర్టు శిక్ష నుంచి తప్పించుకున్నారని గుర్తు చేశారు.
ఇందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు, చార్జిషీట్ దాఖలులో సారూప్యత లేకపోవడం ఒక కారణమైతే, కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడం కూడా కారణమవుతోందని అన్నారు. దీని వల్ల న్యాయ, పోలీస్ శాఖలపై ప్రజలకు నమ్మకం, గౌరవం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమని, త్వరలో 2,500 కానిస్టేబుళ్లు, 750 ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
అదే విధంగా 197 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు సంబంధించి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైకోర్టు నుంచి అనుమతి లభించిన వెంటనే ఇందుకు సంబంధించి కార్యాచరణ మొదలుపెడతామని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫాదర్ థామస్ హత్య దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని తెలిపారు.
విశ్రాంత పోలీసులకు క్యాంటీన్ సదుపాయం
విశ్రాంత పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలీస్ క్యాంటీన్ సదుపాయం కల్పించే విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తనను శుక్రవారం భేటీ అయిన రాష్ట్ర విశ్రాంత పోలీసు అధికారుల సంఘం సభ్యులు ముద్దయ్య, పమ్మయ్యలతో జార్జ్ పేర్కొన్నారు. అదేవిధంగా ఆరోగ్యబీమా కల్పించే విషయం కూడా ఆలోచిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.కాగా, జార్జ్‌తో భేటీ అయిన అనంతరం సంఘం పదాధికారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కృష్ణాలో భేటీ అయ్యి డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని అందించారు.