
న్యాయమంత్రిత్వశాఖ లక్ష్యంగా బాంబుదాడి
కాబుల్: అఫ్గానిస్థాన్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఏకంగా ప్రభుత్వానికి చెందిన ఉన్నత వ్యక్తుల కార్యాలయాలే లక్ష్యంగా బాంబుదాడి జరిపారు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మంగళవారం కాబూల్లోని న్యాయమంత్రిత్వశాఖకు చెందిన పార్కింగ్ ప్రాంతాన్ని ఎంచుకొని ఉగ్రవాదులు బాంబులు అమర్చి వాటిని పేల్చివేశారు. దీంతో విధులకు హాజరైన పలువురు ప్రభుత్వాధికారులు గాయాలతో రక్తసిక్తమవ్వగా.. ఐదుగురు మృతిచెందారు. గతవారం రోజుల్లో ఇది రెండో అతిపెద్ద సంఘటన. ఈ ఘటన మరోసారి భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారి ఒకరు స్పందిస్తూ దేశంలో న్యాయవ్యవస్థలో పనిచేసే ముఖ్య అధికారులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్ ఉగ్రవాదులు ఈ చర్యకుపాల్పడ్డారని చెప్పారు.