న్యూఢిల్లీ: సెల్‌ఫోన్‌ను వాడే అలవాటు అంతగా లేని ద్రౌపదీ ముర్ము.. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఫోన్‌కాల్‌ను మిస్సయ్యారు..! ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు అది. రాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఆమెను కోరేందుకు స్వయంగా ప్రధాని మోదీయే చేసిన కాల్ అది..!
‘ద్రౌపదీ ముర్ము: ఫ్రం ట్రైబల్ హింటర్ ల్యాండ్స్ టూ రైజినా హిల్’ పేరుతో జర్నలిస్ట్ కస్తూరి రే రాసిన తాజా పుస్తకంలో 2022 జూన్ 21న జరిగిన ఘటన సహా పలు వివరాలున్నాయి. పలు ఇంటర్వ్యూలు, విశ్లేషణల ఆధారంగా ముర్ము జీవితంలో ఘటనల క్రమాన్ని స్కూల్, కాలేజీ రోజులవరకు టీచర్ నుంచి సామాజిక కార్యకర్తగా, అటునుంచి కౌన్సిలర్..మంత్రి..గవర్నర్..దేశ మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి వరకు సాగిన ఆమె ప్రస్థానాన్ని అందులో ప్రస్తావించారు.
గతేడాది జూన్ 21న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 275 కిలోమీటర్ల దూరంలోని తన మారుమూల స్వగ్రామం ఉపర్‌బేడలో ముర్ము ఉన్నారు. బీజేపీ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము అని తెలిసినా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీని కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయమది. అయితే, ముర్ము స్వగ్రామంలో కరెంటు కట్ అమలవుతోంది. బయట జరుగుతున్న ఇలాంటి విషయాలేవీ ఆమెకు తెలియవు.
మొబైల్‌ను ఎక్కువగా వాడే అలవాటు లేని ముర్ము, దాన్ని ఎక్కడో ఉంచారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ సహా ప్రముఖ వ్యక్తుల నుంచి వచ్చిన అనేక ఫోన్‌కాల్స్‌ను ఆమె రిసీవ్ చేసుకోలేకపోయారు. చివరికి పీఎంఓ అధికారులు ముర్ము మాజీ ఓఎస్‌డీ, రాయ్‌రంగ్‌పూర్‌లో ఉంటున్న బికాశ్ చంద్ర మహంతకు ఫోన్ చేశారు. ఆయన ఆగమేఘాల మీద తన మెడికల్ షాపును మూసేసి ముర్ము ఇంటికి చేరుకున్నారు. ఫోన్ ఆమె చేతికందించారు. దీంతో ప్రధాని మోదీతో ఆమె నేరుగా మాట్లాడగలిగారు. ఆ తర్వాతే ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment