సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
శాలువాలతో రాష్ట్రపతిని సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చి న రాష్ట్రపతి ముర్ముకు సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌బాబును పరిచయం చేశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, త్రివిధ దళాల అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
స్వాగత కార్యక్రమం అనంతరం ప్రత్యేక వాహనంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ద్రౌపదీ ముర్ము వెళ్లారు. ఈనెల 23న రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిది నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఐదు రోజులపాటు వివిధ కార్యక్రమాల్లో ..
♦ రాష్ట్రపతి ముర్ము మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు.
♦ పోచంపల్లిలో టెక్స్‌టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్, స్పిన్నింగ్ యూనిట్లను ఈనెల 20న సందర్శిస్తారు. నేతకార్మికులతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో ఎంఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు.
♦ డిసెంబర్ 21న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పలు పనులను ఆమె ప్రారంభిస్తారు.
♦ డిసెంబర్ 22న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రంలోని ప్రముఖులు, విద్యావేత్తలు, ఇతర ముఖ్యులకు ఎట్‌హోం విందు ఇస్తారు.
♦డిసెంబర్ 23న రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో నిర్వహిస్తున్న ఫైరింగ్ కార్యక్రమాలను లైవ్ ద్వారా వీక్షిస్తారు. అనంత రం రాష్ట్రపతి ముర్ము ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment