ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం
మోదీ 3.0 ప్రాథమ్యాల వెల్లడి
లీకేజీ దోషులపై కఠిన చర్యలన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఎమర్జెన్సీ. నిన్నటికి నిన్న లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవుతూనే ఓం బిర్లా నోట సభలో విన్పించిన మాట. గురువారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలోనూ ప్రముఖంగా చోటుచేసుకుంది! ఇందిరాగాంధీ హయాంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా, రాజ్యాంగంపై దాడిగా రాష్ట్రపతి అభివరి్ణంచారు. ‘‘స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాంగంపై ఇలాంటి దాడులు జరుగుతూ వచ్చాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీపై దేశమంతా భగ్గుమంది.
అంతిమంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై దేశం విజయం సాధించి ప్రగతి పథాన సాగుతోంది’’ అన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కేవలం పాలనా మాధ్యమంగా మాత్రమే చూడటం లేదు. దాన్ని ప్రజల చేతనలో అవిభాజ్య భాగంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం వంటి చర్యలు అందులో భాగమే’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ ఎమర్జెన్సీపై తరచూ విమర్శలు చేస్తూ వస్తోంది.
ప్రధాని మోదీ జూన్ 24న మాట్లాడుతూ ఎమర్జెన్సీని దేశ పార్లమెంటరీ చరిత్రలో చెరగని మచ్చగా అభివ రి్ణంచారు. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ కూడా బుధవారం గాజియాబాద్‌లో ఒక కార్యక్రమంలో ఎమర్జెన్సీపై విమర్శలు గుప్పించారు. ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికవుతూనే ఎమర్జెన్సీని నిరసిస్తూ లోక్‌సభలో ఏకంగా తీర్మానమే చేసి రాజకీయ దుమారానికి తెర తీశారు.
పరీక్షల విధానంలో సంస్కరణలు
న్యూఢిల్లీ: ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు ముర్ము గుర్రపు బగ్గీలో సంప్రదాయ రీతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. గజ ద్వారం వద్ద ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముర్ము తన ప్రసంగంలో మోదీ 3.0 ప్రభుత్వ ప్రాథమ్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా దేశ ప్రజలు వరుసగా మూడోసారి సుస్థిరతకే పట్టం కట్టారు’’ అన్నారు.
‘‘లోక్‌సభ సభ్యులుగా మీరంతా ప్రజల నమ్మకం చూరగొని నెగ్గారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. భారత్ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ప్రపంచమంతా వేయి కళ్లతో గమనిస్తోందన్న విషయాన్ని సభ్యులు గుర్తెరగాలన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దీనిపై పారీ్టలకు అతీతంగా దేశవ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
‘‘ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత చాలా ముఖ్యం. ఈ దిశగా పరీక్షల విధానంలోనే సమూల సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది’’ అని చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలను బలోపేతం చేసి వాటిల్లో సీట్లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులంతా ‘నీట్, నీట్’ అంటూ జోరుగా నినాదాలు చేశారు. పలు ఇతర అంశాలపై రాష్ట్రపతి వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...
⇒ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్నీ ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈవీఎంలు సుప్రీంకోర్టు నుంచి ప్రజా కోర్టు దాకా అన్ని పరీక్షల్లోనూ నెగ్గి విశ్వసనీయతను నిరూపించుకున్నాయి.
⇒ కొన్నాళ్లుగా భారత్ అనుసరిస్తున్న సమర్థమైన విదేశీ విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి అంతర్జాతీయ సమస్యపైనా తక్షణం స్పందిస్తూ క్రమంగా విశ్వబంధుగా పరిణతి చెందుతోంది. భారత్–మధ్య ప్రాచ్యం–యూరప్ ఆర్థిక కారిడార్ 21వ శతాబ్దంలో అతి పెద్ద గేమ్ చేంజర్‌గా మారనుంది.
⇒ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు. పార్లమెంటు కార్యకలాపాలను ఆటంకపరచడం వేరు. ఇది పూర్తిగా తప్పుడు చర్య. పార్లమెంటు సజావుగా సాగినప్పుడే ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు సాధ్యమని అన్ని పారీ్టలూ గుర్తుంచుకోవాలి.
⇒ కశ్మీర్ లోయలో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. తద్వారా శత్రు దేశాలకు కశ్మీరీ ప్రజలు దిమ్మతిరిగే జవాబిచ్చారు. ఆరి్టకల్ 370 రద్దుతో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి వచి్చన తర్వాత కశ్మీర్లో పరిస్థితులు ఎంతగానో మెరుగుపడుతున్నాయి.
⇒ మౌలికాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోంది. దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు దిశల్లో బులెట్ ట్రైన్ కారిడార్ల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది.
⇒ తప్పుడు సమాచార వ్యాప్తి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు విభజన శక్తులు దీన్ని ఆయుధంగా వాడుతున్నాయి. ఈ బెడద నివారణకు కొత్త మార్గాలు వెదకాల్సిన అవసరం చాలా ఉంది.
⇒ దేశ విభజనతో సర్వం కోల్పోయిన వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు పౌరసత్వ సవరణ చట్టం దోహదపడుతుంది.
⇒ శిక్షించడమే ప్రధానోద్దేశంగా రూపొందిన బ్రిటిష్ వలస పాలన నాటి శిక్షా స్మృతులు స్వాతంత్య్రం వచ్చాక కూడా ఏడు దశాబ్దాల పాటు కొనసాగడం దారుణం. న్యాయం శిక్షగా మారకూడదన్నదే లక్ష్యంగా, భారతీయతే మూలమంత్రంగా నూతన నేర న్యాయ చట్టాల రూపకల్పన జరిగింది. జూలై 1 నుంచి అవి ప్రజలకు సరైన న్యాయాన్ని సత్వరంగా అందించనున్నాయి.
⇒ అభివృద్ధితో పాటు దేశ ఘన వారసత్వానికీ మోదీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వనుంది. మహిళల సారథ్యంలో అభివృద్ధికి కట్టుబడి ఉంది. చట్టసభల్లో వారికి 33 శాతం రిజర్వేషన్ల వంటి నిర్ణయాలు ఈ దిశగా ముందడుగులు.
⇒ రక్షణ రంగంలో భారీ సంస్కరణలు మరింత వేగంతో కొనసాగుతాయి. పదేళ్లలో రక్షణ ఎగుమతులు 18 రెట్లు పెరిగాయి. అదే సమయంలో గతేడాది మన రక్షణ కొనుగోళ్లలో 70 శాతం స్వదేశీ సంస్థల నుంచే జరిగింది! ఈ రంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరగనుంది.
⇒ సుపరిపాలనకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. పలు ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల రద్దు, స్వీయ ధ్రువీకరణ వంటి నిర్ణయాలు ఇందుకు ఉదాహరణలు.
⇒ సంస్కరణల పథాన్ని వేగవంతం చేసే దిశగా వచ్చే బడ్జెట్‌లో చరిత్రాత్మక చర్యలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment