prathibha patil
-
ఇండియా@75: భారత్‌కు తొలి మహిళా రాష్ట్రపతి
ప్రతిభా పాటిల్ భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. 2007 జూలై 25న ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు వరకు రాజస్థాన్ గవర్నరుగా (2004–2007) ఉన్నారు. యునైటెడ్ ప్రొగ్రెస్సెవ్ ఆలియన్స్ (యు.పి.ఎ) పాటిల్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. యు.పి.ఎ మొదట ప్రతిపాదించిన శివరాజ్ పాటిల్ లేదా కరణ్ సింగ్‌ల అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు అంగీకరించకపోవడంతో పాటిల్‌ను ఒక రాజీ మార్గ అభ్యర్థిగా ప్రకటించారు. పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్‌కు, నెహ్రూ గాంధీ కుటుంబానికి అనేక దశాబ్దాల పాటు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నందు వల్ల కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆమెను ఎంపిక చేశారు. పాటిల్ తన ప్రత్యర్థి భైరాన్ సింగ్ షెకావత్‌పై భారీ మెజారిటీ గెలిచారు. ప్రతిభా పాటిల్ 1934లో మహారాష్ట్రలోని నందగావ్‌లో జన్మించారు. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ముఖ్యాంశాలుగా డబల్ ఎమ్.ఎ. చేశారు. టేబుల్ టెన్నిస్‌లో రాణించిన క్రీడాకారిణి కూడా. 1962లో ప్రతిభా పాటిల్ ఎం.జె.కళాశాల ‘కాలేజ్ క్వీన్‘గా కూడా ఎన్నికయ్యారు! ఉన్నత విద్యాభాసం తర్వాత భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను మెరుగుపరచడానికి సామాజిక అంశాలపై ఆసక్తిని ఏర్పరచుకున్నారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు ఒ.పి.నయ్యర్, ధూళిపాళ సీతారామశాస్త్రి, రామచంద్ర గాంధీ, ప్రధాని చంద్రశేఖర్, ఎస్.ఆర్. బొమ్మయ్, జి.పి.సిప్పీ.. కన్నుమూత. హైదరాబాద్‌లో మే నెలలో మక్కా మసీదు వద్ద బాంబు పేలుళ్లు. 9 మంది దుర్మరణం. హైదరాబాద్‌లోనే తిరిగి ఆగస్టు నెలలో బాంబు పేలుళ్లు. 42 మంది దుర్మరణం. (చదవండి: సామ్రాజ్య భారతి: 1916/1947) -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్‌దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
ఢిల్లీలో రాహుల్ ఇఫ్తార్ విందు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతలకు బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఈ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కనిమొళి, జేడీఎస్ నేత డానిష్ అలీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ హాజరయ్యారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు వేదికగా మారనుందని భావిస్తున్న ఈ విందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీలు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ప్రధాని వీడియో నవ్వించేలా ఉంది ప్రధాని మోదీ ట్వీటర్లో పోస్ట్ చేసిన ఫిట్నెస్ వీడియోపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. అది వింతగా, నవ్వించేలా ఉందన్నారు. బుధవారం ఇఫ్తార్ వేడుకలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌తో టేబుల్ పంచుకున్న రాహుల్..సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వైపు తిరిగి ‘మోదీకి దీటుగా మీరూ ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేయొచ్చుగా!’ అని అన్నారు. అక్కడే ఉన్న కనిమొళి, దినేశ్ త్రివేది, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలు ప్రధాని వీడియో గురించి విని నవ్వుకున్నారు. మహా కూటమి.. ప్రజల ఆకాంక్ష మోదీ,బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలతో ఏర్పాటయ్యే మహా కూటమి ప్రజల ఆకాంక్ష అని రాహుల్ గాంధీ ముంబైలో విలేకరులతో అన్నారు. ‘మహా కూటమి ఏర్పాటు బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల కోసం మాత్రమే కాదు. అది ప్రజల ఆకాంక్ష. మహాకూటమితోనే ప్రధాని, బీజేపీ, ఆరెస్సెస్ లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు. -
ఎన్‌మార్ట్ ఎక్కడ?
సాక్షి, అనంతపురం : ‘మా సంస్థలో సభ్యులుగా చేరండి. మీతో పాటు మరికొందరిని చేర్పించండి. లక్షాధికారులు కావడం ఖాయం. రూ. 5,500 చెల్లిస్తే ఐదేళ్ల తర్వాత మీ డబ్బు వాపస్. అప్పటిదాకా ప్రతి నెలా రూ.200 విలువయ్యే నిత్యావసర సరుకులు ఉచితం. వ్యవహారాలన్నీ ఆన్లైన్లోనే. మీరు చేయాల్సిందల్లా రూ.5,500 చెల్లించి మా సంస్థలో సభ్యులుగా చేరడమే.’ - ఇదీ ‘ఎన్‌మార్ట్’ సంస్థ ప్రచారం. రెండేళ్ల క్రితం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఫోటో ఉన్న బ్రోచర్తో ప్రచారం హోరెత్తించి వేలాది మందిని వంచించిన ఆ సంస్థ ప్రస్తుతం అడ్రెస్ లేకుండా పోయింది. అమాయకులను సభ్యులుగా చేర్పించి లక్షలాది రూపాయలు కమీషన్లు దండుకున్న ప్రధాన ఏజెంట్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. కనీసం బాధితుల తరఫున పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ‘ఎన్‌మార్ట్’ మాయలో పడి అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలోని బళ్లారి జిల్లాలలో వేలాది మంది సభ్యులుగా చేరారు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ బాధితులున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పలుకుబడి కలిగిన కొందరు నేతల బంధువులు రెండేళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించారు. దేశంలోని పలు నగరాల్లో షాపింగ్ మాల్స్ తెరిచి దందాకు శ్రీకారం చుట్టారు. ఈ దందాపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు అయినప్పుడు.. మూడు నెలల్లో తిరిగి దుకాణాలు ప్రారంభిస్తామని చెప్పిన నిర్వాహకులు ఇపుడు పత్తాలేకుండా పోయారు. దందా సాగిందిలా... ఒక్కో వ్యక్తి రూ.5,500 చెల్లిస్తే సభ్యత్వం ఇస్తారు. ఇద్దరు కలిస్తే.. ఆ సభ్యులను ‘పెయిర్’గా పిలుస్తారు. ఒక్కో జంట మరొక జంటను సభ్యులుగా చేర్పించాలి. ప్రతి జంటా ఇలా చేర్పించినందుకు కొంత కమీషన్‌ను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఇలా సంఖ్య పెరిగే కొద్దీ.. మొదట్లో చేర్పించిన వారి స్థాయి పెరుగుతూ పోతుందని నమ్మించారు. సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ కలర్ టీవీ, యూపీఎస్, ల్యాప్‌టాప్, ద్విచక్ర వాహనం, కారు తదితర బహుమతులతో పాటు విదేశీయానం అవకాశాలు కూడా కల్పిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ఆన్లైన్లో భారీగా ప్రచారం చేశారు. మొదట్లో సభ్యులుగా చేరిన వారు ఆ తరువాత ఏజెంట్ల అవతారమెత్తారు. ఈ ఏజెంట్లలో అధిక శాతం సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులే కావడం గమనార్హం. వీరిని నమ్మి చిన్నాచితక ఉద్యోగులు, చివరకు కూలీలు సైతం ఎన్మార్టులో సభ్యులుగా చేరారు. రాయలసీమకు అంతటికీ తిరుపతిలో షాపింగ్‌మాల్ తెరిచారు. అనంతపురం జిల్లాలో సభ్యులుగా చేరిన వారు సైతం సరుకుల కోసం తిరుపతి, బళ్లారికి వెళ్లాల్సి ఉండేది. షాపింగ్‌మాల్ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో చిన్నాచితక వస్తువులు లభించినా..రోజులు గడిచే కొద్దీ నిండుకుంటూ వచ్చాయి. తుదకు దేశవ్యాప్తంగా ఎన్మార్టు షాపింగ్ మాల్స్‌ను మూసేశారు. ఆ సమయంలో తిరుపతిలో షాపింగ్ మాల్‌పై సభ్యులంతా మూకుమ్మడిగా దాడిచేసి..చేతికందిన సరుకులు పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఆ సంస్థ వెబ్సైట్ కూడా తెరుచుకోవడం లేదు. నిర్వాహకులను ఒంగోలు పోలీసులు అరెస్టు చేసి... రిమాండ్‌కు పంపించారు. అప్పట్లో నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, మూడు నెలల్లోగా సొమ్ము వాపసు చేస్తామని ప్రకటించారు. అయితే... ఏడాదిన్నర కావస్తున్నా ఏ ఒక్కరికీ డబ్బు చెల్లించిన పాపాన పోలేదు. నిర్వాహకులు రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో పోలీసులే నిర్లక్ష్యం చేసి సమస్య తీవ్రతను నీరుగార్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏజెంట్లు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. కేసు పెట్టండయ్యా అంటే, త్వరలోనే మీ సొమ్ము మీకు వస్తుందని నమ్మబలుకుతూ సదరు బడా ఏజెంట్లు దర్జాగా తిరుగుతున్నారు. జిల్లాలో ఎన్మార్టు బాధితుల నుంచి లిఖిత పూర్వకమైన ఫిర్యాదులు లేకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. కాగా ప్రకాశం జిల్లాలో నమోదైన కేసును సీబీసీఐడి దర్తాప్తు చేస్తోంది. దీంతో బెయిల్‌పై బయటకు వచ్చిన సంస్థ యాజమాన్యం.. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎవరి గొడవలో వారుండటంతో కేసును తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసిందని సమాచారం. ఈ విషయం ఇటీవల బయటకు పొక్కడంతో ఈ వ్యవహారంపై బాధితులందరూ చర్చించుకుంటున్నారు.