ఎన్‌మార్ట్ ఎక్కడ? | Fraud scheme and blamed customers in scheme | Sakshi
Sakshi News home page

ఎన్‌మార్ట్ ఎక్కడ?

Published Sat, Oct 12 2013 2:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Fraud scheme and blamed customers in scheme

సాక్షి, అనంతపురం : ‘మా సంస్థలో సభ్యులుగా చేరండి. మీతో పాటు మరికొందరిని చేర్పించండి. లక్షాధికారులు కావడం ఖాయం. రూ. 5,500 చెల్లిస్తే ఐదేళ్ల తర్వాత మీ డబ్బు వాపస్. అప్పటిదాకా ప్రతి నెలా రూ.200 విలువయ్యే నిత్యావసర సరుకులు ఉచితం. వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే. మీరు చేయాల్సిందల్లా రూ.5,500 చెల్లించి మా సంస్థలో సభ్యులుగా చేరడమే.’ - ఇదీ ‘ఎన్‌మార్ట్’ సంస్థ ప్రచారం. రెండేళ్ల క్రితం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఫోటో ఉన్న బ్రోచర్‌తో ప్రచారం హోరెత్తించి వేలాది మందిని వంచించిన ఆ సంస్థ ప్రస్తుతం అడ్రెస్ లేకుండా పోయింది. అమాయకులను సభ్యులుగా చేర్పించి లక్షలాది రూపాయలు కమీషన్లు దండుకున్న ప్రధాన ఏజెంట్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. కనీసం బాధితుల తరఫున పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ‘ఎన్‌మార్ట్’ మాయలో పడి అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలోని బళ్లారి జిల్లాలలో వేలాది మంది సభ్యులుగా చేరారు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ బాధితులున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పలుకుబడి కలిగిన కొందరు నేతల బంధువులు రెండేళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించారు. దేశంలోని పలు నగరాల్లో షాపింగ్ మాల్స్ తెరిచి దందాకు శ్రీకారం చుట్టారు. ఈ దందాపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు అయినప్పుడు.. మూడు నెలల్లో తిరిగి దుకాణాలు ప్రారంభిస్తామని చెప్పిన నిర్వాహకులు ఇపుడు పత్తాలేకుండా పోయారు.
 
 దందా సాగిందిలా...
 ఒక్కో వ్యక్తి రూ.5,500 చెల్లిస్తే సభ్యత్వం ఇస్తారు. ఇద్దరు కలిస్తే.. ఆ సభ్యులను ‘పెయిర్’గా పిలుస్తారు. ఒక్కో జంట మరొక జంటను సభ్యులుగా చేర్పించాలి. ప్రతి జంటా ఇలా చేర్పించినందుకు కొంత కమీషన్‌ను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఇలా సంఖ్య పెరిగే కొద్దీ.. మొదట్లో చేర్పించిన వారి స్థాయి పెరుగుతూ పోతుందని నమ్మించారు. సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ కలర్ టీవీ, యూపీఎస్, ల్యాప్‌టాప్, ద్విచక్ర వాహనం, కారు తదితర బహుమతులతో పాటు విదేశీయానం అవకాశాలు కూడా కల్పిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ఆన్‌లైన్‌లో భారీగా ప్రచారం చేశారు. మొదట్లో సభ్యులుగా చేరిన వారు ఆ తరువాత ఏజెంట్ల అవతారమెత్తారు. ఈ ఏజెంట్లలో అధిక శాతం సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులే కావడం గమనార్హం.
 
 వీరిని నమ్మి  చిన్నాచితక ఉద్యోగులు, చివరకు కూలీలు సైతం ఎన్‌మార్టులో సభ్యులుగా చేరారు. రాయలసీమకు అంతటికీ తిరుపతిలో షాపింగ్‌మాల్ తెరిచారు. అనంతపురం జిల్లాలో సభ్యులుగా చేరిన వారు సైతం సరుకుల కోసం తిరుపతి, బళ్లారికి వెళ్లాల్సి ఉండేది. షాపింగ్‌మాల్ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో చిన్నాచితక వస్తువులు లభించినా..రోజులు గడిచే కొద్దీ నిండుకుంటూ వచ్చాయి. తుదకు దేశవ్యాప్తంగా ఎన్‌మార్టు షాపింగ్ మాల్స్‌ను మూసేశారు.
 
 ఆ సమయంలో తిరుపతిలో షాపింగ్ మాల్‌పై సభ్యులంతా మూకుమ్మడిగా దాడిచేసి..చేతికందిన సరుకులు పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఆ సంస్థ వెబ్‌సైట్ కూడా తెరుచుకోవడం లేదు. నిర్వాహకులను ఒంగోలు పోలీసులు అరెస్టు చేసి... రిమాండ్‌కు పంపించారు. అప్పట్లో నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, మూడు నెలల్లోగా సొమ్ము వాపసు చేస్తామని ప్రకటించారు. అయితే... ఏడాదిన్నర కావస్తున్నా ఏ ఒక్కరికీ డబ్బు చెల్లించిన  పాపాన పోలేదు.
 
 నిర్వాహకులు రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో పోలీసులే నిర్లక్ష్యం చేసి సమస్య తీవ్రతను నీరుగార్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏజెంట్లు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. కేసు పెట్టండయ్యా అంటే, త్వరలోనే మీ సొమ్ము మీకు వస్తుందని నమ్మబలుకుతూ సదరు బడా ఏజెంట్లు దర్జాగా తిరుగుతున్నారు. జిల్లాలో ఎన్‌మార్టు బాధితుల నుంచి లిఖిత పూర్వకమైన ఫిర్యాదులు లేకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. కాగా ప్రకాశం జిల్లాలో నమోదైన కేసును సీబీసీఐడి దర్తాప్తు చేస్తోంది.
 
 దీంతో బెయిల్‌పై బయటకు వచ్చిన సంస్థ యాజమాన్యం.. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎవరి గొడవలో వారుండటంతో కేసును తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసిందని సమాచారం. ఈ విషయం ఇటీవల బయటకు పొక్కడంతో ఈ వ్యవహారంపై బాధితులందరూ చర్చించుకుంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement