సాక్షి, న్యూఢిల్లీ : రెండు దఫాలు అధికారంలో కొనసాగిన యూపీఏ ప్రభుత్వం.. మూడోసారి మాత్రం దారుణంగా పరాభవాన్ని మూటగట్టుకుంది. కారణాలేవైనా తమ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ.. ఈ మూడేళ్లలో రాష్ట్రపతిగా కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ మోదీ ప్రభుత్వంతో సత్సంబంధాలనే కొనసాగించటం అప్పట్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆయన రాష్ట్రపతి భవన్‌ను వీడి నాలుగు నెలలు అయ్యింది. ఇంతకాలం ఎక్కడా కనిపించని ఆయన.. ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఓవైపు బీజేపీ సీనియర్ నేతలే సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ.. మోదీ ప్రభుత్వానికి ప్రణబ్ పలు సూచనలు చేయటం గమనార్హం. ‘మార్పుతో కూడిన నిర్ణయాలను వెను వెంటనే తీసుకోవటం మంచిది కాదు. అవి మంచి ఫలితాను ఇవ్వకపోగా.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయి అని ప్రణబ్ చెప్పారు. ఇక జీఎస్టీ మంచి నిర్ణయమే అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉత్పన్నం కావటం సాధారణమేనని.. వాటిని మోదీ సర్కార్ అధిగమించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా-పాకిస్థాన్‌లతో భారత్ దౌత్యపరమైన అంశాల ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. యుద్ధం అనేది ఎప్పటికీ శాశ్వత పరిష్కారం కాలేదని.. కేవలం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని... ఆ సూత్రాన్నే తానూ బలంగా నమ్ముతానని చెప్పారు.
మరోవైపు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనావేస్తూ... ‘కాంగ్రెస్ పార్టీ పని అయిపోలేదు. అది 132 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. తిరిగి పుంజుకుంటుంది’ అని ప్రణబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో అనుభవాలతోపాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో తన అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. మన్మోహన్ సింగ్ తో ఎలాంటి విభేధాలు లేవన్న దాదా.. తాను ప్రధాని రేసు నుంచి వైదొలగటానికి హిందీ భాష రాకపోవటం కూడా ఓ కారణమని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం ఓ కారణం కాగా, బీజేపీ నేత పీయూష్ గోయల్ అంచనాలు ఆ పార్టీ అందుకోవటం ఆశ్చర్యం ప్రణబ్ కలిగించిందన్నారు.
ప్రణబ్ వెలువరించిన పలు ఆసక్తికర విషయాలతో కూడిన ఈ ఇంటర్వ్యూను ప్రముఖ పాత్రికేయుడు రాజ్ చెంగప్ప చేయగా.. అక్టోబర్ 23 ఇండియా టుడే సంచికలో ప్రచురితం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment